ఆ శునక భక్తికి అయ్యప్ప భక్తులే ఆశ్చర్యపోయారు. తమ వెంట అడుగులో అడుగేస్తూ శబరిమలకు పాదయాత్రలో కదం కలిపిన కుక్కను చూసి అబ్బర పడ్డారు. తమ వెంట కుక్క కూడా శబరిమలకు వస్తున్నదనే విషయాన్ని అయ్యప్ప స్వాములు గుర్తించే సరికే అది 480 కిలోమీటర్ల మేర నడిచింది. విషయంలోకి వెడితే…తిరుమలకు చెందిన 13 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడితో గత నెల 31న శబరిమలకు కాలినడకన బయలుదేరారు. ఆదివారం నాటికి వారి యాత్ర కర్నాటకలోని గొట్టెగెరాకు చేరుకుంది. కానీ తమ వెనకాలే ఓ కుక్క కూడా వస్తున్నదనే విషయాన్ని స్వాములు గుర్తించే సరికి 480 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయింది. వెనక్కి చూసిన ప్రతిసారీ కుక్క కనిపించేసరికి స్వాములు విషయాన్ని గుర్తించారు. తాము తెచ్చుకున్న ఆహారంలో నుంచే కుక్కకు కాస్త పెడుతూ దాని ఆకలి బాధను తీరుస్తున్నారట. కాలినడకన శబరిమలకు బయలుదేరిన స్వాముల వెంట కుక్క నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎటువంటి ఆయాసం లేకుండా వందల కిలోమీటర్ల మేర కాలి నడకన పయనిస్తున్న ఈ శునకం శబరిమల చేరుకుని, అయ్యప్ప స్వామి కృపకు పాత్రురాలవుతుందని ఆశిద్దాం.