పై ఫొటో చూశారుగా…? ఖమ్మం-సూర్యాపేట మధ్య కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిని ఇలా అడ్డంగా తవ్వి, ఎటువంటి వాహనాలు రాకుండా కందకం తీసిన దృశ్యం. ఆయా జిల్లా సరిహద్దుల్లోని నాయకన్ గూడెం చెక్ పోస్టు వద్ద అకస్మాత్తుగా అందుకు దారి తీసిన పరిణామాల్లోకి వెడితే…

ప్రభుత్వాధికారుల, ఉద్యోగుల షటిల్ సర్వీస్ గురించి కొత్తగా చెప్పకునేదేమీ లేకపోవచ్చు. వంద కిలోమీటర్లు, వీలైతే పరిస్థితిని, అవకాశాన్ని బట్టి 200 కిలోమీటర్ల వరకు షటిల్ సర్వీస్ చేస్తూ సర్కారు కొలువు వెలగబెట్టే సర్కారు సార్లు బోలెడు మంది. సాధారణ సమయాల్లో ఇది సర్వ సాధారణం. తమకు ఇబ్బంది కలిగినప్పుడు, అధికారులపై ఆగ్రహం కలిగినప్పుడు స్థానికులు ఇటువంటి సర్కారు ఉద్యోగులపై ఫిర్యాదు చేయడం, వీలైతే మీడియాకు ఉప్పందించి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా సహజమే. ఈ పరిణామాలు సాధారణ సమయాల్లో మాత్రమే.

వాస్తవానికి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, అక్కడే స్థానికంగా నివాసముండాలనే ప్రభుత్వ నిబంధనలను అనేక మంది సర్కార్ అధికారులు, సిబ్బంది బేఖాతర్ చేస్తుంటారు. ఏజెన్సీ అలవెన్సులు, ఇతరత్రా పలు రకాల జీత, భత్యాలు స్వీకరిస్తూ స్థానికేతర నివాసంతో చాకచక్యంగా కొలువులు వెలగబెడుతుంటారు. ఇది సాధారణ సమయాల్లో సర్వసాధారణం. కానీ కరోనా వైరస్ వ్యాప్తి వంటి ప్రమాద, అసాధారణ సమయాల్లోనూ సర్కారు సార్లు ఇదే టైపు కొలువు చేస్తే? ప్రజల ప్రాణాలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా హాని కారకులైతే? ఇందుకు బాధ్యులెవరు? ఇదీ తాజా ప్రశ్న.

ఖమ్మం నగరానికి పొరుగున గల సూర్యాపేటలో 54 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాన్ని ప్రస్తుతం ‘రెడ్ జోన్’గా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. సూర్యాపేటలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు రాకపోకలను నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఖమ్మం జిల్లా నుంచి సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ 120 మంది వరకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అంచనాకు వచ్చింది. ఇందులో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు కూడా ఉన్నారట. నిత్యం రెడ్ జోన్ ప్రాంతాల్లోకి వెళ్లి డ్యూటీలు వెలగబెడుతున్నట్లు తాజా సమాచారం. వీరి వివరాల సేకరణలో ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం ప్రస్తుతం నిమగ్నమైంది.

సూర్యాపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకగా, అదే ఆఫీసులో ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారితోపాటు డిప్యూటీ సీఈవో స్థాయిలో గల మరో అధికారి, రెవెన్యూ శాఖకు చెందిన ఇంకో సారువారు నిత్యం ఒకే కారులో జాయింట్ గా షటిల్ సర్వీస్ చేస్తున్నట్లు తేలింది. దీంతో ప్రస్తుతం ఆయా అధికారగణంతోపాటు కారు డ్రైవర్ కూడా ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్ వార్డులో ఉన్నారు.

సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించే ఇతర మార్గాలనూ మూసేసిన దృశ్యం

సాధారణ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అది కూడా 3 కిలోమీటర్ల పరిధి దాటరాదని లాక్ డౌన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అటు వైద్యశాఖ, ఇటు పోలీసు తదితర విభాగాలకు చెందిన అధికారగణం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఖమ్మం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేటకు, 40 కిలోమీటర్ల దూరంలోని కోదాడకు, 90 కిలోమీటర్ల దూరంలోని మిర్యాలగూడకు ప్రభుత్వాధికారులు కొందరు కరోనా కల్లోలంలోనూ షటిల్ సర్వీస్ చేస్తుండడం గమనార్హం. తాము ప్రయాణించే కార్లపై ‘కోవిడ్-19 ఆన్ డ్యూటీ’ పేరుతో స్టిక్కర్లు అతికించి, వాహనాల నెంబర్ ప్లేట్ పైన ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ పేరుతో ప్రయాణిస్తున్నారు.

దీంతో పోలీసులు కూడా వారిని డ్యూటీ అధికారులుగా భావిస్తున్నారు. అయితే ఈ టైపులో షటిల్ సర్వీస్ డ్యూటీ చేస్తున్న అధికారులు రెడ్ జోన్ పరిధి నుంచి కరోనా వ్యాప్తికి కారకులైతే అందుకు బాధ్యులెవరన్నదే అసలు ప్రశ్న. ఇది కేవలం ‘ఖమ్మం-టు-సూర్యాపేట’ షటిల్ సర్వీస్ చేస్తున్న అధికారుల వ్యవహారమే కాకపోవచ్చు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోనూ చాలా మంది అధికారులు, ఉద్యోగులు ఇదే దారిని అవలంభిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తే తప్ప ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించవచ్చు. లేని పక్షంలో సర్కారు సార్ల షటిల్ సర్వీస్ కూడా కరోనా వైరస్ విస్తృత వ్యాప్తికి మరో కారణంగా మారే ప్రమాదం లేకపోలేదు.

Comments are closed.

Exit mobile version