పులి చర్మంతో గల ఐదుగురు పోలీసులు సహా ఎనిమిది మంది నిందితులు జగదల్ పూర్ లో అరెస్టయ్యారు. ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో కొందరు పులి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సమాాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులు టీమ్ గా ఏర్పాటు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఉదయం 3.30 గంటల ప్రాంతంలో పులి చర్మంతో గల ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఐదుగురు పోలీసులు, ఆరోగ్యశాఖకు చెందిన ముగ్గురు సిబ్బంది ఉండడం గమనార్హం. దంతేశ్వరి ఆలయం సమీపాన కారులో వెడుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద గల పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఐదుగురు పోలీసులు సహా మొత్తం ఎనిమిది మంది పులిని వేటాడి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో పోలీసుల ప్రమేయం ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఏకే శ్రీవాస్తవ వెల్లడించారు.