ముగ్గురు ప్రముఖులు ఆసుపత్రుల్లో చేరారు. వేర్వేరు కారణాలపై ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఇద్దరు సినీ హీరోలు కాగా, ఓ రాజకీయ నాయకురాలు ఉన్నారు. తీవ్ర కడుపునొప్పి కారణంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ (73) చెన్నయ్ అపోలో ఆసుపత్రిలో చేరారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స అందించామని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
అదేవిధంగా ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందాకు అనూహ్యరీతిలో బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు తన లైసెన్సుడ్ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గోవిందా కాలులోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స ద్వారా వైద్యులు గోవిందా కాలులోకి దిగిన బుల్లెట్ ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని గోవిందా మేనేజర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి, తీహాడ్ జైలులో ఉన్నపుడు కూడా కవిత గైనిక్ సమస్యలతో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కూడా ఆమె మరోసారి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ సాయంత్రంకల్లా కవితకు వైద్య పరీక్షలు పూర్తయ్యే అవకాశమున్నట్లు సమాచారం.