వాస్తు విషయంలో తెలంగాణా సీఎం కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉంటారో తెలుసుగా? వాస్తు మీద విపరీతమైన విశ్వాసం గల సీఎం కేసీఆర్ ఇదే కారణంతో సచివాలయానికి సక్రమంగా రావడం మానేశారనే వాదన కూడా ఉంది. ప్రగతిభవన్ నుంచే పరిపాలన నడిపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తు ప్రామాణికంగానే ప్రస్తుత సచివాలయన్ని కూల్చి, పూర్తి వాస్తు ప్రకారం కొత్త సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ ఉపక్రమించడం, వివాదాలు… అదంతా వేరే విషయం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అధికార, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కూడా జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణ పనులకు బ్రేక్ కూడా పడింది. సింగపూర్ సంస్థలు వెనక్కి మళ్లాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది నెలల చేసిన ప్రకటనలతో రాజధానిపై మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాజధాని గురించి బొత్స మాట్లాడుతూ, నిపుణుల కమిటీ 13 జిల్లాల్లో పర్యటిస్తోందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజధానిపై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. ఈ కమిటీ నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ఆరు వారాల గడువు ఇచ్చినట్లు కూడా చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక సూచనల ఆధారంగా ఏ భవనం ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తామన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు అమరావతిపై గెజిట్ విడుదల చేయలేదని కూడా బొత్స వ్యాఖ్యానించారు. అందువల్ల అమరావతి తాత్కాలిక రాజధాని అనే భావన ఉందని, అమరాతిలో శాశ్వత నిర్మాణాలు లేవని కూడా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 5,400 కోట్ల మొత్తం ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఏ నిపుణుడితోనైనా చెప్పించాలని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలను కోరారు. ఎమ్మెల్యేల భవనాలు 67 శాతం పూర్తయ్యాయని, ఐఏఎస్ అధికారుల భవనాలు 26 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎన్జీవోలు, ఐఏఎస్ అధికారుల భవనాలు మినహా మిగతావన్నీ తాత్కాలిక భవనాలేనని బొత్స స్పష్టం చేశారు. గత ఆగస్టు నెలలోనేగాక ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై ఇటువంటి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిస్థితుల్లో రాజధానిని జగన్ సర్కార్ అమరావతిలోనే ఉంచుతుందా? లేక మరో ప్రాంతానికి తరలిస్తుందా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే కేవీ రెడ్డి అనే ఓ వాస్తు ప్రావీణ్యుడు జగన్ ప్రభుత్వానికి అమరావతి గురించి సలహా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వార్తా కథనం కూడా సీఎం జగన్ కు చెందిన సాక్షి పత్రికలో ప్రచురితం కావడం గమనార్హం. అంతర్జాతీయ వాస్తు నిపుణుడిగా పేర్కొన్న కేవీ రెడ్డి అనే పెద్ద మనిషి అమరావతి గురించి ఏమన్నారంటే….

‘‘అమరావతికి ఉత్తరం వైపు కృష్ణా నదీ జల ప్రవాహం ఉండడం మంచిదే. ఈ ప్రవాహం కొంత భాగం అమరావతికి ఉత్తర దిశలో పయనించి, అక్కడి నుంచి ఆగ్నేయం వైపు ప్రవహించింది. వాస్తు శాస్త్ర రీత్యా ఈశాన్యం తెగిపోయిన భాగంలో అమరావతి ఉంది. దీని కారణంగా రాజధాని అభివృద్ధికి నోచుకోదు. పడమర వైపు భూమి వాలి ఉంటే… నైరుతిలో ఉన్న పట్టణాలను రాజధానులుగా ప్రకటించడం మంచిది.’’

అని సెలవిచ్చారు. ఇంకేంది…? రెడ్డి చెప్పిండు…చక్రాలు కట్టండి అమరావతికి. ఇంతకీ అమరావతికి నైరుతి దిక్కున గల పట్టణం ఏమిటో? బహుషా దొనకొండ కావచ్చు.

Comments are closed.

Exit mobile version