కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరూ చెబుతారు. స్వీట్ ప్యాకెట్టో, పూల బొకేనో ఇచ్చి ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ఎవరు ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పవచ్చు. ప్రేయసీ, ప్రియులైతే కాస్త ఖరీదైన గిఫ్టులు ఇచ్చుకుని పరస్పరం గ్రీటింగ్స్ చెప్పుకుంటుంటారు. ఖర్చు దండగ అనుకుంటే, నేరుగా కలిసి చెప్పడం టైమ్ వేస్ట్ అనుకుంటే వాట్సాప్ లో ఓ మెసేజ్ పడేసి కూడా గ్రీటింగ్స్ చెప్పవచ్చు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదేననుకోండి. కానీ మీడియా వాళ్లకోసం, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించినట్లుగా కొత్త సంవత్సరపు ఆకాంక్షను ఇలా ప్రత్యేకంగా వెలిబుచ్చాడో గుర్తు తెలియని వీక్షకుడు-కమ్-ప్రేక్షకుడు. మీడియా తీరు, తెన్నులను వెటకరిస్తూ కొత్త సంవత్సర వేళ సోషల్ మీడియాలో వదలిన ఈ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. మీరూ చదవండి సరదాగా…

శాస్త్రవేత్తల్లా శోధించి సాధించినట్టు exclusive news అంటూ ఏదో మిస్టరీ సినిమాలో ట్విస్టు ఇచ్చే డైరెక్టర్ లా ఫీలయ్యే మీ ఆలోచనలు మంటగలిసి పోవాలని..

బిగ్గు బ్రేకింగు న్యూసంటూ నిమిషానికోసారి చెవులో జోరీగలా నస దొబ్బే మీ న్యూసులకు బ్రేకులు పడాలని..

వీక్షించే వీక్షకులకు విసుగొచ్చేలా రోజంతా ఒకటే న్యూసేసి దొబ్బకుండా ఉండాలని..

నారదుడు కలహం సృష్టించినా అది లోక కల్యాణం కోసమే.. కాని మీరు మాత్రం సద్దుమనిగిన దాన్ని గెలికి మరీ రెచ్చగొట్టే విధంగా కలహాలు సృష్టిస్తారు.. ఆ విధంగా ఉండకూడదని..

చనిపోయిన వారింటికెళ్ళి వేసిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ వేసి కుటుంబ సభ్యులను ఇంకా మనోవేదనకు గురిచేయకుండా ఉంటారని..

ప్రతి దాంట్లో వేలెట్టి పళ్ళు రాలగొట్టుకోకుండా ఉంటారని.. ఏది? మొన్న పొరుగు రాష్ట్రంలో జరిగినదాని గురించి..

ప్రతి న్యూసులో TRP కోసం వెతక్కుండా ఉండాలని కోరుకుంటూ..

నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా వారికి ?

Comments are closed.

Exit mobile version