తెలంగాణా రాజధాని హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే కదా? అటువంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అంశంపై ఈనెల 5వ తేదీన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం భయానక స్థాయికి చేరుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమో’ అని విద్యాసాగర్ రావు అన్నారు. విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణాలోని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే కిషన్ రెడ్డి తాజాగా తమ వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేయడం విశేషం.