‘Sir you are here in Delhi to attend a wedding but you have no time to visit the Cyberabad victim’s family,’ Times Now reporter asked only to get no response from the CM. Rao remained tight-lipped and walked away.
సరిగ్గా నాలుగు రోజుల క్రితం తెలంగాణా సీఎం కేసీఆర్ ను పట్టుకుని టైమ్స్ నౌ ఛానల్ కు చెందిన విలేకరి ఢిల్లీలో అడిగిన ప్రశ్న, ప్రసారం చేసిన వార్తా కథనపు సారాంశం ఇదే కదా?
‘‘సర్, మీరు ఓ వివాహ వేడుకకు హాజరు కావడానికి ఢిల్లీ వరకు వచ్చారు. కానీ హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యోదంతంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు తీరిక లేదా?’’ అనే కదా? ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు తెలుగు అనువాదం. సరే, అనువాదంలో ఏదేని భాషా దోషం, లేదా భావ పొరపాటు ఉన్నా, లేకపోయినా, ఆ ప్రశ్న తాలూకు సారాంశం మాత్రం అంతే.
ఈ ప్రశ్న అడిగినపుడు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ విలేకరిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎందుకంటే సాధారణంగా ప్రశ్న అడిగిన విలేకరి గురించి అనేక సందర్భాల్లో కేసీఆర్ స్పందించే తీరు మనందరికీ తెలిసిందే కదా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ శర్మ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరు కావడం కోసం ఈనెల 3వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ కిమ్మనకపోవడంపై 72 గంటల తర్వాత క్లారిటీ వచ్చిందనే అభిప్రాయాలు అధికార పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ సమ్మె అంశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందించిన తీరు మనందరికీ తెలిసేందే. ‘‘ఓ సీఎంను పట్టుకుని అడుగుతవానవయా? సోయి ఉండి మాట్లాడాలె’’ అంటూ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్ గుడ్లురుమడంతో ఆ విలేకరి సెట్ బ్యాక్ కాక తప్పలేదు. కానీ ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ మౌనానికి అర్థం దిశ హత్యోదంతపు నిందితుల ఎన్కౌంటర్ ఘటనే అసలు సమాధానంగా అధికార పార్టీ నేతలు నిర్వచిస్తున్నారు. ఇంకా వారు ఏమంటున్నారో తెలుసా?
‘మేధావి మౌనం ప్రమాదకరం అంటుంటారు. కానీ మేధావే పరిపాలకుడైతే అతడి మౌనం ఎలా ఉంటుందో తెలిసింది కదా?’’ అని కేసీఆర్ చదివిన పుస్తకాల సంఖ్యను ఏకరవు పెడుతూ టీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. జయహో కేసీఆర్, జయహో సజ్జన్నార్ నినాదాల వెనుక సమాజ హితాన్ని కోరుకునే తమ నేత అసలు లక్ష్యం ప్రస్ఫుటమైందంటున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు. ఘటనకు దారి తీసిన పరిస్థితులను బట్టి పోలీసులు ఎన్కౌంటర్ చేయవచ్చు, కానీ అందుకు సమాజం నుంచేగాక, పాలకుల నుంచి కూడా ఆమోదం అవసరమే కదా? అంటాడు మరో నాయకుడు ‘ఆఫ్ ది రికార్డ్’ గా.
ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకి చూపిస్తామన్న కేసీఆర్ మాటలు తూటాలై తగిలాయని, సత్వర న్యాయం చేయడంలో తెలంగాణా రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని సాక్షాత్తూ కొందరు సచివులే దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై వ్యాఖ్యానిస్తుండడం విశేషం. తన దిష్టిబొమ్మలు తగలేసి నానా శాపనార్ధాలు పెట్టిన ఆర్టీసీ కార్మికులచేత చప్పట్లు కొట్టించుకోవడమేకాదు, దిశ హత్యోదంతంలో పోలీసు వాహనాలపైకి రాళ్లు, చెప్పులు విసిరిన ప్రజల చేత సైతం జేజేలు పలికించడం కూడా కేసీఆర్ పరిపాలనా దక్షత ప్రత్యేకతగా అధికార పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.