ఇద్దరు పోలీసు అధికారులపై దొంగతనం అభియోగం మోపుతూ ఫిర్యాదు చేసిన ఘటన ఇది. చోరీకి పాల్పడ్డారంటూ అభియోగం మోపిన ఎస్ఐకే ఫిర్యాదును అందించడం ఈ ఘటనలో ఆసక్తికర పరిణామం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో బెంద్రం తిరుపతిరెడ్డి అనే బీజేపీ నేత ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుని కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెడితే…

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటన చేసిన సందర్భాల్లో విపక్ష పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇందులో భాగంగానే గత ఏప్రిల్ నెలలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బెంద్రం తిరుపతిరెడ్డి సహా సుమారు 30 మంది నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

ఆయా కేసుల్లో నిందితులైన వారికి సిరిసిల్ల కోర్టు స్వంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ అఫిడవిట్లు కూడా స్వీకరించింది. ఆ తర్వాత పరిణామాల్లో ఈనెల 16వ తేదీన కూడా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బెంద్రం తిరుపతిరెడ్డి తదితరులపై పోలీసులు మరో నాలుగు కేసులు నమోదు చేశారు. అయితే ‘ప్రజా శాంతి’కి భంగం కలిగించబోమంటూ నిందితులు గతంలో బాండు పేపర్లు రాసిచ్చారని, అయినప్పటికీ అదే నేరానికి పాల్పడ్డారని పేర్కొంటూ పోలీసులు తాజా కేసుల్లో నిందితులు ఇచ్చినట్లు పేర్కొన్న అఫిడవిట్లను, బాండు పేపర్లను జత చేశారనేది ఆరోపణ.

ఈ పరిణామమే ఇద్దరు ఎస్ఐలపై చోరీ ఫిర్యాదుకు దారి తీసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో తాము కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు, పర్సనల్ బాండు పేపర్ల జిరాక్స్ కాపీలు న్యాయస్థానం అనుమతి లేకుండా బయటకు ఎలా వచ్చాయనేది బెంద్రం తిరుపతిరెడ్డి ప్రశ్న. కోర్టు అనుమతిలోనే ఈ కాగితాలు తీసుకుని ఉంటే వాటిని ‘సర్టిఫైడ్’ కాపీలుగా పేర్కొంటూ సమర్పించాల్సి ఉంటుందంటున్నారు. సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి లేకుండా తన పర్సనల్ బాండ్, అఫిడవిట్ కాగితాలను ఇల్లంతకుంట ఎస్ఐ రఫీక్ ఖాన్, ప్రొబేషనరీ ఎస్ఐ దిలీప్ లు తస్కరించారనేది తిరుపతిరెడ్డి ఆరోపణ. ఎటువంటి అనుమతి లేకుండా కోర్టు నుంచి చోరీ చేసిన ఆయా కాగితాలను నిజ ప్రతుల నిర్ధారణగా ‘అటెస్ట్’ చేస్తూ నాలుగు అక్రమ కేసుల్లో జతపర్చారని ఆయన ఆరోపిస్తున్నారు.

అందువల్ల తాను సమర్పించిన ఆయా కాగితాలను సిరిసిల్ల కోర్టు నుంచి చోరీ చేసిన ఇద్దరు ఎస్ఐలపై దొంగతనం కేసు నమోదు చేయాలని, ఈ కాగితాల తస్కరణ బాగోతంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బెంద్రం తిరుపతిరెడ్డి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రొబేషనరీ ఎస్ఐ దిలీప్ కు తిరుపతిరెడ్డి అందించడం గమనార్హం.

కాగా కోర్టు అనుమతితోనే ఈ పత్రాలను పోలీసు అధికారులు తీసుకుని ఉంటే, సర్టిఫైడ్ కాపీల రూపేణా కోర్టు ముద్రలతో సమర్పించాల్సి ఉంటుందని న్యాయవాది ఆవునూరి రమాకాంత్ రావు అన్నారు. ఆలా కాకుండా కోర్టులో ఉన్నటువంటి పర్సనల్ బాండును జిరాక్స్ రూపంలో పోలీసు అధికారుల తీసుకుని, వాటిని పోలీసులే ‘అటెస్ట్’ చేస్తూ తిరిగి కోర్టుకే సమర్పించడం విచిత్ర పరిణామంగా రమాకాంత్ రావు పేర్కొన్నారు. కోర్టు అనుమతి లేకుండా ఇటువంటి పత్రాలు సమర్పించడం పోలీసు అధికారుల పనితీరును వెల్లడిస్తోందని, ఈ ఘటనలో తమపై మోపిన అభియోగాలు నిజం కాదని నిరూపించుకోవలసిన బాధ్యత పోలీసు అధికారులదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Comments are closed.

Exit mobile version