‘దెబ్బకు రోగం కుదిరింది’ అనేది తెలంగాణా సామెతల్లో ఒకటి. దెబ్బలకు మనిషికి వచ్చిన రోగం కుదురుతుందో లేదోగాని, మిర్చి పంటకు అంటుకున్న ఓ రోగం మాత్రం దాని ధరను కుదురుకునేలా చేయడమే విశేషం. అన్ సీజన్ లో ధర అమాంతంగా పెరగడం, సీజన్ లో కుప్పకూలి కుదేలవడం వ్యవసాయ మార్కెట్లలో వ్యాపార మాయాజాలమనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
కానీ ఈసారి సీజన్ సమీపిస్తున్న తరుణంలోనూ మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతుండడమే విశేషం. గడచిన 50 ఏళ్ల కాలంలో మిర్చికి ఈ స్థాయిలో ధర పలికిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. అత్యధికంగా నిరుడు రూ. 15 వేల వరకు పలికిన క్వింటాల్ మిర్చి ధర తాజా సమాచారం ప్రకారం 21 వేల పైనే పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు తర్వాత మిర్చి మార్కెట్ వ్యాపారంలో పేరెన్నిక గల ఖమ్మం మార్కెట్లో క్వింటాలు మిర్చి శుక్రవారం గరిష్టంగా రూ. 21,500 పలకగా, తాలు మిర్చి రూ. 7,500 పలికింది. వాస్తవానికి మార్కెట్ కు మిర్చి నిల్వలు భారీగా వచ్చే సీజన్ కూడా కాదిది. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో మార్కెట్ కు మిర్చి పోటెత్తుతుంది. అప్పటికి ఈ ధర ఉంటుందో, లేదో తెలియని అయోమయ స్థితి.
ఒకవేళ ఇదే ధర కొనసాగినా రైతు సంతోషంగా ఉన్నాడనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత రికార్డు ధర పరిస్థితిలోనూ రైతు ఏమాత్రం సంతోషంగా లేకపోవడమే సేద్యపు విషాదం. అదేమిటి.. క్వింటాలు మిర్చి ధర 21,500 పలికినా రైతు ముఖంలో చిరునవ్వు లేదా? అని సంశయించాల్సిన అవసరం లేదు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఇదే. వాస్తవానికి మిర్చి తోటల్లో ప్రస్తుతం ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వస్తుంది. కానీ ఈసారి 20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తే క్వింటా మిర్చికి రూ. 12 వేల ధర పలికినా రైతుకు గిట్టుబాటు అవుతుంది. రూ. 15వేలు పలికితే లాభాలు వస్తాయి. కానీ ప్రస్తుతం రూ. 21,500 పలుకుతోంది. సగటున రూ. 20 వేల చొప్పను పరిగణించినా, 30 క్వింటాళ్ల దిగుబడికి రూ. 6.00 లక్షలు వస్తుంది. ఏరివేత సీజన్ యావత్తూ మిర్చిలో ఒకే నాణ్యత ఉండదు కాబట్టి, సగటున రూ. 5.00 లక్షలు ఎకరానికి లభించే అవకాశముంది. ఇందులో రూ. 2.00 లక్షలు పెట్టుబడిగా తీసివేసినా, రైతుకు రూ. 3.00 లక్షలు మిగులుతుంది. కానీ ప్రస్తుతం రూ. 21 వేలపైన ధర పలుకుతున్నా మిర్చి రైతు సంతోషంగా లేకపోవడానికి కారణాలు అనేకం.
గడచిన రెండు, మూడేళ్లుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. తెలంగాణాలోనే దాదాపు 60 వేల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు తగ్గినట్లు గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరిగాయి. దీంతో మిర్చి ధర అమాంతంగా పెరిగింది. కానీ రైతు ముఖంలో సంతోషం లేకపోవడానికి, మిర్చి ధర రూ. 21 వేలు దాటడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? ‘గుబ్బ’ అనే రోగం మిర్చి పంటలకు సోకడమే. దీని కారణంగా తగ్గిన సాగు విస్తీర్ణంలోనూ కనీస పంట దిగుబడి లేకపోవడమే ప్రధాన కారణం. రెండు, మూడేళ్లుగా మిర్చి పంటలకు సోకిన ‘గుబ్బ’ రోగానికి సస్యరక్షణ చర్యల్లో వ్యవసాయ శాఖ చేతులెత్తేసినట్లు రైతులు చెబుతున్నారు. చేలల్లో మిరప చెట్టు వంకర్లు తిరిగి పంట దిగుబడి గణనీయంగా పడిపోయిందని మిర్చి సాగులో అపార అనుభవం గల పుట్టకోటకు చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు అనే రైతు చెప్పారు. ఎన్ని మందులు వాడినా ‘గుబ్బ’ రోగం తగ్గడం లేదని, వ్యవసాయ అధికారులు దీన్ని వైరస్ గా పేర్కొంటున్నారని చెప్పారు. అసలు విత్తనానికే ‘గుబ్బ’ రోగం ఉందనే అనుమానాన్ని కూడా నాగేశ్వరరావు వ్యక్తం చేశారు.
యాభై ఏళ్ల చరిత్రలో క్వింటాలు మిర్చి ధర ఇంతగా ఎప్పుడూ పెరగలేదని ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారి బండ్లమూడి వెంకటేశ్వరరావు చెప్పారు. తనకు తెలిసి క్వింటాలు మిర్చి ధర రూ. 13 వేలు అత్యధికమని, ప్రస్తుత ధరకు దిగుబడి గణనీయంగా పడిపోవడమే ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా మిర్చి దిగుబడి తగ్గిందని, నిరుడు కోల్డ్ స్టోరేజీల్లో గల సరుకు కూడా అమ్ముడు పోయిందని, ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ లు ఖాళీ అయ్యాయన్నారు. బంగ్లాదేశ్, చైనాలకు ఎగుమతులు పెరిగాయని చెప్పారు. దీంతో మిర్చి ధర అమాంతంగా పెరిగిందని, కానీ ‘గుబ్బ’ రోగం కారణంగా రైతుకు దిగుబడి తగ్గిందన్నారు. మిర్చి ఏరే కూలీల ధర రూ. 30 నుంచి రూ. 200 వరకు పెరిగిందని, కూలీలను ఆటోల్లో తరలించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పెరిగిన చాకిరి చేయలేక సేద్యం విషయంలో రైతు చేతులెత్తేస్తున్న పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం కూడా తగ్గిందన్నారు. గుబ్బ రోగం దిగుబడి పడిపోవడానికి మరింత కారణమైందని చెప్పారు. దీంతో మిర్చి ధర పెరగడం అనివార్యమైందని వ్యాపారి నాగేశ్వరరావు వివరించారు.