కోవిడ్ – 19 మూలంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందర్నీ పాస్ చేశారంటే అదొక అర్థం ఉంది. అప్పటికే ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది కాబట్టి వారి జవాబు పత్రాలను దిద్ది ఫలితాలను విడుదల చేశారు. ఇక్కడే అసలు కథ మొదలయింది.
ఇంటర్ లో అనుత్తీర్ణులైన వారందరికీ గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేశారు. ఇంటర్ లో గ్రేస్ మార్కులు అనేవి ఇప్పటి వరకు ఉన్న విధానం ఒక విద్యార్థి తన రెండు సంవత్సరాల ఇంటర్ విద్యలో ఒక సబ్జెక్టులో ఒక సారి ఐదు శాతం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే వంద మార్కుల లాంగ్వేజ్ లో ఐదు మార్కులు, 60మార్కుల గ్రూప్ సబ్జెక్టుల్లో 3 గ్రేస్ మార్కులు కలిసేవి. ఇప్పుడు ఉత్తీర్ణతకు అవసరమైన 35 శాతం మార్కులకు ఎన్ని సబ్జెక్టులలో నైనా ఎన్ని మార్కులు అవసరమైతే, అన్ని మార్కులను కలిపి పాస్ చేస్తారన్నమాట.
కళాశాలకు ఎగనామం పెట్టి రోడ్డు మీద తిరిగిన వారు, మాల్ ప్రాక్టీస్ లో బుక్ అయిన వారు, ఇలా అందరికీ ఎవరికి ఎన్ని అవసరమో అన్ని గ్రేస్ మార్కులను ఇచ్చి పాస్ చేస్తున్నారు. కోవిడ్-19 వల్ల ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేకపోతే అప్పుడు మాత్రమే అందర్నీ పాస్ చేశారంటే అర్థం ఉంది. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫెయిల్ అయిన వారందరికీ ఇంత పెద్ద మొత్తంలో గ్రేస్ మార్కులు కలపడం అవసరమా? అని కొంత మంది విద్యా వేత్తల అభిప్రాయం. ఇలా పాసైన వీరంతా ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొంది ఎలా నెట్టుకు రాగలుగుతారనేది విద్యావేత్తలు సంధిస్తున్న ప్రశ్న. మొత్తంగా తెలంగాణ విద్యా వ్యవస్థలో గ్రేస్ మార్కుల అర్థాన్నే మార్చారని చెప్పక తప్పదు. అందుకే కాబోలు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటో దిగువన మీరే చదవండి.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 27,589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. వీరిలో ఎగ్జామ్స్ కు హాజరుకాని 27,251 మంది విద్యార్థులు, మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు ఇవ్వాలని బోర్డు తీర్మానించింది…
.
.
.
సూపరో సూపరు…? అయినా అడ్మిషన్ రిజిష్టర్లలో పేర్లున్న అందరూ పాస్ అని ప్రకటిస్తే సరిపోతుంది కదా ధర్మ ప్రభూ…??
✍ తుమ్మలపల్లి ప్రసాద్
(ఫొటో: ప్రతీకాత్మక చిత్రం)