‘అత్తమీది కోపం దుత్త మీద చూపడం…’ అంటే ఇదే కాబోలు. కట్టుకున్న భార్య వేధింపులు తాళలేక, వాటి నుంచి విముక్తి పొందడానికి ఏకంగా పోలీస్ స్టేషన్ కే నిప్పటించాడో వ్యక్తి. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిన ఈ ఘటన ఆసక్తికర వార్తాంశంగా జాతీయ మీడియా ప్రచురించడం విశేషం.
రాజ్ కోట్ లోని జామ్ నగర్ కు చెందిన దేవ్ జీ చావ్డా (23) అనే యువకుడికి ఇటీవలే పెళ్లి జరిగింది. వైవాహిక జీవితంలోకి అడుగిడింది మొదలు దేవ్ జీని అతని భార్య వేధిస్తోందట. ఆమె వేధింపులను తట్టుకోలేక దేవ్ జీ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు.
పోలీసులు ఇందుకు నిరాకరించారో, మరే కారణమో తెలియదుగాని దేవ్ జీ అకస్మాత్తుగా రాజ్ కోట్ పోలీస్ స్టేషన్ కు నిప్పటించాడు. ఆ తర్వాత ఘటనా స్థలంలోనే నిల్చుని తనను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు. నిప్పంటుకున్న పోలీస్ స్టేషన్ ను తొలుత కాపాడుకునే ప్రక్రియలో పోలీసులు అగ్నికీలలను ఆర్పివేశారు. ఆ తర్వాత దేవ్ జీని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించాడనే అభియోగంపై దేవ్ జీని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు. తన భార్య వేధింపుల నుంచి విముక్తి పొందడానికే తాను ఠాణాకు నిప్పటించినట్లు దేవ్ జీ చెబుతున్నారట. అయితే ఇతనికి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసుల విచారణలోతేలినట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలు రావడం గమనార్హం.
ఫొటో: ఘటన జరిగిన పోలీస్ స్టేషన్, నిందితుడు దేవ్ జీ (ఇన్ సెట్)