చోరీల్లో వింత చోరీ ఇది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఆవు పేడ దొంగతనానికి సంబంధించి తొలి కేసు నమోదైంది. ఆవుపేడను దొంగిలించడమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆవు పేడ వ్యర్థం కాదు… చాలా విలువైంది కూడా.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలోని రోజి గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు గ్రామస్తులు తమ ఇంటి ఆవరణ నుంచి ఆవుపేడ చోరీకి గురైందని గోథన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో గ్రామస్తుల్లో చర్చకు దారి తీసింది.
ఆవు షెడ్ పథకం కింద ఆవు పేడను తమ ఇంటి ఆవరణలో ఉంచినట్లు బాధితులు గోథన్ కమిటీకి చైర్మెన్ కు నివేదించారు. ఉదయం తమ గోవుల షెడ్ లోని పేడ నిల్వలు కనిపించడం లేదన్నది బాధితులు ఆరోపణ.
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం గోథన్ పథకం కింద ఆవు పేడను కొనుగోలు చేస్తోంది. కిలో ఆవుపేడకు రూ. 2 చొప్పున లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ఈనెల 5వ తేదీన లబ్ధిదారులకు ఆవు పేడ కొనుగోలుకు సంబంధించి తొలిసారి నగదు చెల్లింపులు కూడా చేసింది.
ఈ నేపథ్యంలోనే కొరియా జిల్లాలోని రోజి పంచాయతీ పరిధిలో తొలి ఆవుపేడ చోరీ కేసు నమోదు కావడం గమనార్హం ఈ ఘటనపై గోథన్ కమిటీ దర్యాప్తు ప్రారంభించి గ్రామస్తులను ప్రశ్నిస్తున్నది.