ఔను…ఎన్కౌంటర్ చేయగానే పోలీసులకు పండుగ కాదు. ఆ తర్వాతే మొదలవుతుంది వారికి అసలు బాధ. దిశ హత్యోదంతంలో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసుల చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సత్వర న్యాయంగా ప్రాచుర్యం పొందుతున్న ఈ ఘటనలో తెలంగాణా పోలీసులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదే దశలో ఎన్కౌంటర్ ను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి కూడా. దిశ నిందితుల ఎన్కౌంటర్ అంశంలో ఇటు తెలంగాణా హైకోర్టులోనేగాక, అటు సుప్రీంకోర్టులోనూ వివిధ రకాల పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో అసలు దిశ నిందితుల ఎన్కౌంటర్ ద్వారా పోలీసులు అదనంగా బావుకునేదేమీ లేకపోవడం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం ప్రజల చేత జేజేలు అందుకుంటున్నతెలంగాణా పోలీసులు ఈ ఎన్కౌంటర్ ఘటనలో మున్ముందు ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోక తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరహా ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు యాగ్జిలేటరీ ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా లేవు. నక్సలైట్ల, టెర్రరిస్టుల అణచివేతలో మాత్రమే ఎన్కౌంటర్లలో పాలు పంచుకున్నపోలీసులకు యాగ్జిలేటరీ పదోన్నతులతోపాటు ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం) వంటి ప్రతిష్టాత్మక పతకాలు లభిస్తాయి. వరంగల్ యాసిడ్ దాడి, హైదరాబాద్ దిశ హత్యోదంతాల్లో నిందితుల ఎన్కౌంటర్ ఫలితంగా ప్రమోషన్ల సంగతి దేవుడెరుగు, కనీసం సేవా పతకం కూడా లభించదంటే ఆశ్చర్యం కాదు. ఇక ఐపీఎస్ అధికారులకైతే టైమ్ బౌండెడ్ ప్రమోషన్లు మినహా ఇటువంటి కేసుల్లో లభించే అదనపు ప్రయోజనం కూడా లేదు.
‘సీన్ రీ-కన్ స్ట్రక్షన్’ సమయంలో నిందితులు తిరగబడడం, రాళ్లు, కర్రలతో పోలీసులపైకి దాడులకు పాల్పడడం, పోలీసుల తుపాకులు లాక్కుని వారిపైనే కాల్పులు జరపడం, ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జ్యుడిషియల్ కస్టడీలో గల నిందితులు హతం కావడం వంటి ఉదంతాల్లో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కోవలసిందే. జేజేలతోపాటు విమర్శలనూ స్వీకరించాల్సిందే. ముఖ్యంగా సుప్రీం కోర్టు రూలింగ్ ప్రకారం ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులపై హత్య కేసు నమోదైతే మరిన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. కోర్టులో ఎదురయ్యే అనేక కీలక ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పక తప్పదు.
ఉదాహరణకు దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసునే పరిశీలిస్తే, సీన్ రీ-కన్ స్ట్రక్షన్ ను పగటి పూటే నిర్వహించారా? లేక చీకటి వేళ జరిపారా? అనే ప్రశ్నలను కోర్టులో ఎదుర్కునే పరిస్థితి రావచ్చు. ‘నిందితులు నలుగురు మాత్రమే ఉన్నారు, మీరు పది మంది వరకు ఉన్నారు. పోలీసుల నుంచి వాళ్లు తుపాకులు లాక్కోవడం ఎలా సాధ్యమైంది?’ అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కావచ్చు. సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే జరిగినట్లు చెబుతున్న ఎన్కౌంటర్లో కాల్చిన బుల్లెట్లు నేరుగా నిందితుల శరీరాల్లోకి ఎలా దూసుకు వెళ్లగలిగాయి? అసలు మీరు కాల్చిన బుల్లెట్లు ఎన్ని? వాళ్లకు తగిలినవి ఎన్ని? మిస్సయినవి ఎన్ని? ఏయే తుపాకులు వాడారు? హతుల శరీరాల్లోని బుల్లెట్లు ఆయా తుపాకులకు చెందినవేనా? బుల్లెట్ల లెక్కల్లో ఏవేని తేడాలు ఉన్నాయా? మీరు కాల్చిన ప్రతి బుల్లెట్ వాళ్లకే ఖచ్చితంగా ఎలా తగిలాయి? వాళ్లు కాల్పులు జరిపితే మీకేమీ తగల్లేదా? తుపాకీ కాల్చడంలో హతులకు అనుభవం ఏమైనా ఉందా? అసలు నిందితులు తుపాకులు గుంజుకుంటుంటే మీరేం చేస్తున్నారు? తుపాకులు గుంజుకున్న నిందితులు పారిపోతుంటే చోద్యం చూశారా? తెలంగాణా పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అనే ప్రచారం ఉంది కదా? ఓ నలుగురు నిందితులు మీ తుపాకులు లాక్కుంటుంటే మీ శక్తియుక్తులు ఏమయ్యాయి? ఇదిగో ఇటువంటి అసంఖ్యాకమైన అనేక ప్రశ్నలను పోలీసులు కోర్టులో ఎదుర్కుని సరైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చకుండా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహశీల్దార్) ముందు హాజరు పర్చడానికి దారి తీసిన పరిస్థితులను కూడా పోలీసులు న్యాయస్థానంలో వివరించాల్సి ఉంటుంది.
అంతేకాదు ఇటువంటి ఎన్కౌంటర్ ఘటనల్లో పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు, హతులపై ఐపీసీ 174, 307 సెక్షన్ల కింద కేసు నమోదు కావచ్చు. పోలీసులపై నమోదైన కేసు దర్యాప్తు బాధ్యతను ఇతర సబ్ డివిజనల్ పోలీసు అధికారికి అప్పగిస్తారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం ఇతర సబ్ డివిజన్ కు చెందిన అధికారికి అప్పగించే ఈ కేసు దర్యాప్తులో ఆత్మరక్షణకోసం మాత్రమే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందనే అంశం తేలాల్సి ఉంటుంది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులు కూడా నిరూపించుకోవలసి ఉంటుంది. ఇక మానవ హక్కుల సంఘ విచారణ ప్రక్రియ ఉండనే ఉంది. మానవ హక్కుల సంఘం విచారణలో పోలీసుల తప్పిదం ఉన్నట్లు తేలితే, వాళ్ల సిఫారసు ప్రకారం ప్రభుత్వం తీసుకునే చర్యలపై భిన్నాభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ఈ తరహా కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఎవరైనా పట్టుబడితే, సీబీఐ రంగంలోకి దిగితే మాత్రం ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులు మరిన్ని సవాళ్లను ఎదుర్కునే అవకాశాలు కూడా లేకపోలేదు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ ఘటనలో కొందరు పోలీసు అధికారులు ఎదుర్కున్న పరిణామాలు తెలిసిందే కదా? మొత్తంగా చెప్పేదేమిటంటే ప్రస్తుతం జేజేలు అందుకుంటున్న పోలీసులు ఎన్కౌంటర్ కేసుల దర్యాప్తులో భరించలేని టెన్సన్ కు గురవడమే కాదు, ఒక్కోసారి అనూహ్య పరిణామాలను కూడా భరించవలసి రావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాల అణచివేతలో అత్యంత చురుగ్గా వ్యవహరించి, ఎన్నో ఎన్కౌంటర్లకు సూత్రధారిగా నిలిచిన ఓ పోలీసు అధికారి తన రిటైర్మెంట్ రోజున కనీస సేవా పతకం కూడా లేకుండా డిపార్ట్మెంట్ నుంచి సెలవు తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఒకప్పడు ఆయనను హీరోగా కీర్తించిన ఉన్నతాధికారులు కూడా ఇప్పడు ఆయనను పూర్తిగా మర్చిపోవడం. మొత్తంగా చెప్పేదేమిటంటే దిశ ఎన్కౌంటర్ ద్వారా ఇప్పడు పోలీసులకు లభిస్తున్న జేజేలు మిథ్య. విధుల్లో భాగంగా అనేక సవాళ్లను ఎదుర్కోవడం నిజం. దిశ ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు హీరోలు ఇందుకు అతీతం కాకపోవచ్చు.