అచ్యుతరావు గారు బాలల హక్కుల పోరాట యోధుడిగా చేసిన కృషి గురించి ఒక జర్నలిస్టుగా నాకు తెలుసు. కానీ అయనను నేను గుర్తు చేసుకునేది ఆ పరంగా కాదు. నాకు తెలిసిన అచ్యుతరావు చక్కని ఉమ్మడి కుటుంబంలో ఒక ప్రధానమైన యూనిట్. ఆ కుటుంబంతో నా పరిచయం దశాబ్దన్నర పైనే. ఈనాడులో పని చేస్తున్నప్పుడు శ్రీధర్ గారితో పరిచయం, స్నేహం నన్ను వారి ఇంటికి మొదటిసారి తీసుకువెళ్లాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా అది నా ఫేవరిట్ ఫామిలీ. స్నేహితుల ఇళ్లకు వెళ్లడాన్ని శతవిధాలా తప్పించుకోవడానికి ప్రయత్నించే నాకు, వారి కుటుంబం మాత్రం ఎక్సెప్షన్. అప్పట్లో ఇంట్లో శ్రీధర్ గారు, పీఎస్సెమ్ రావు గారు, వరలక్ష్మి వదిన గారు, అచ్యుత రావు, అనురాధ, వారబ్బాయి ఆదిత్య ఉండేవారు. తర్వాత, యూఎన్ తరఫున దేశదేశాలు తిరిగిన మాధవరావు గారు, వారి సతీమణి జ్యోతి గారు, కుమార్తె గార్గి, శ్రీధర్ గారబ్బాయి సిద్ధార్థ్ కూడా కలిశారు.
వారింట్లో నేను గమనించి ఆశ్చర్యపోయిన మొదటి విషయం, ఎంత ఘాటు వాదనైనా మంద్ర స్వరాలతో మాట్లాడుకోవడం. వాదన పెరిగే కొద్దీ డెసిబెల్స్ పెరిగి, అందరి కంటే ఎక్కువ అరిచేవాళ్ల ముందు మిగిలిన వాళ్ళు నోరు మూసుకునే కుటుంబ సంస్కృతి నుంచి వచ్చిన నాకు, ఎంత తీవ్రమైన వాదన అయినా, ఎవరూ గొంతు పెంచని సంయమనం గొప్ప విచిత్రం లాగ కనిపించింది.
అచ్యుతరావు గారికి సిపిఐతో ఉన్న అనుబంధం గురించి అందరికి తెలుసు. దశాబ్దాలు పార్టీలో పనిచేశారు ఆయన. ఈ సురవరాలు, నారాయణలు అందరి జాతకాలు పుట్టు వెంట్రుకలతో సహా చెప్పగలరు.
తొలినాళ్లలో పార్టీ కార్యకర్తలు రావడం, చర్చలు, ఇక్కడే తినడం, నిద్రపోవడం, చాల సందడిగా ఉండేది అని శ్రీధర్ గారు చెప్పారు. బహుశా ఆ కల్చర్ కొనసాగింపుగానో లేక స్వాభావికంగానో గానీ వారింట వాతావరణం చాల ఓపెన్ గా ఉండేది. ఎవరు వచ్చినా సాదరంగా చేతులు చాచి ఆహ్వానించే ఇల్లు అది. Inviting home. వచ్చిన వారిని అందరూ పలకరించడం, కలుపుగోలుగా మాట్లాడటం, పీఎస్సెమ్ రావు గారు అది తిను,ఇది తిను అని కొసరడం, ఎవ్వరూ చెప్పకుండానే, ఎవ్వర్నీ అడగకుండానే మరో కంచం వేసేయడం… ఇవన్నీ చూసి suffocating & closed homes నుంచి వచ్చిన వారు ఆ ఇంటిని స్వర్గం లాగ భావిస్తారు.
ముఖ్యంగా పిల్లలను, ఆ పిల్లలు ఎవరైనా, ఎక్కడి వారైనా, మరీ ముఖ్యంగా ఆడ పిల్లలను వీరు బాగా ముద్దు చేస్తారు. వాళ్ళతో కబుర్లు, ఆటలు, జోకులు, అబ్బో ఆ సందడి చెప్పలేము. ఇళ్లల్లో repressive atmosphere ఎదుర్కొనే అమ్మాయిలే ఎక్కువైన ప్రపంచంలో ఇలాంటి ఇళ్ళు అరుదు. అచ్యుతరావు మరీ ముఖ్యంగా ఆ పిల్లలతో చేయించే అల్లరి అంతా ఇంతా కాదు. వీళ్ళ ప్రాక్టికల్ జోక్స్ బారిన పడని వాళ్ళు అరుదు.
ఆ ఇంట్లో ఎవ్వరూ పిల్లల పైన అరవడం, పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. ఆదిత్య ఒక humane, kind and collected person లా తయారు కావడానికి ఇలాంటి వాతావరణంలో పెరగడమే కారణం. ఇక బాలల హక్కుల పై పోరాడటానికి అచ్యుత రావు కంటే అర్హులు ఎవరుంటారు?
ఒక భవనం నిలబడటానికి కీలకమైనవి పిల్లర్స్ అయితే ఈ కుటుంబానికి పిల్లర్స్ ఈ ఇంట్లో మహిళలు. వరలక్ష్మి వదిన, అనురాధ, జ్యోతి ఎంత ప్రేమాస్పదులు! అచ్యుత రావు గారు, పీఎస్సెమ్ రావు గారితో నాకు చిట్టి తగాదాలు వచ్చి మాటలు బంద్ అయినపుడు కూడా (ఎందుకు వస్తాయంటే ఏమి చెప్తాం! మనం అలా పెరిగాం!) వదిన, అనురాధ నన్ను సమాదరించే వారు. ఇంట్లో ఏమైనా చేసుకుంటే డబ్బాలో పెట్టి నాకు పంపించే వారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా జ్యోతి మొహమాట పెట్టి కంచం వేసేసేవారు. అనురాధ చేసిన చికెన్, వదినె వండిన బర్ఫీలు, మైసూరుపాక్ ఎన్ని లక్షల సార్లు తిన్నాను!
అలాంటిది, కోవిడ్ బారిన ఇంట్లో అందరు ఖాయిలా పడి, వంట కూడా చేసుకోలేని, ఇల్లు శుభ్రం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఏమీ చేయలేకపోవడం, అచ్యుతరావు గారు లేకుండా పోయిన విషాద సందర్భంలో కూడా వెళ్లి పక్కన నిలబడలేకపోవడం, అనురాధను ఓదార్చలేకపోవడం ఎంత దుర్భరమైన పరిస్థితి!
నేను సరే, నిన్న మొన్నటి దాకా వీరింట్లోకి హక్కుగా వచ్చి పోతుండే ఇరుగు పొరుగు పెద్దమనుషులు, వీరి ప్రేమను అనుభవించిన వారి పిల్లలు ఏమి చేసారు? కాలనీలో ఇంటికొక్కరికి అదనంగా వంట చేసినా, ఆ ఇంట్లో ఎనిమిది మందికి ఈ రోగకాలం హాయిగా గడచిపోయేదే! చేయలేదు సరికదా, ఆ ఇంట్లో కోవిడ్ ఉంది, వెళ్ళకండి అని అందరికీ, ముఖ్యంగా మందులు డెలివర్ చేసే మెడికల్ షాప్ వాడికి చెప్పడం ఎంత నీచత్వం! కోవిడ్ పేషంట్స్ తో ఎలా వ్యవహరించకూడదు అనే దానికి ఈ కాలనీ వాసులు ఉదాహరణ.
పక్షం రోజులకు పైగా పీఎస్సెమ్ రావు గారి కుమార్తె అనుపమ రోజూ రెక్కలు ముక్కలు చేసుకుని ఎనిమిది మందికి అదనంగా వంట చేసి, డబ్బాల్లో సర్ది పెట్టి పంపిస్తున్నది. శ్రీధర్ గారి అబ్బాయి సిద్ధార్థ రోజుకో సారో రెండు సార్లో వెళ్లి ఎం కావాలో కనుక్కుని సమకూర్చి వస్తున్నాడు. ఆ మాత్రం సాయం పొరుగు మనుషులు (?) చేయలేరా? నువ్వు ఎవరితో ఎంత బాగున్నా, ఎంత సామాజిక మానవుడిగా బతికినా, నీకు అవసరమైనప్పుడు ఆధార పడవలసింది కుటుంబంపైనే అని మొహం పై కొట్టినట్టు చెప్పారు ఈ స్వార్థజీవులు.
శ్రీధర్ గారు గొంతు మీదకు వచ్చి సోమాజిగూడ యశోద లో అడ్మిట్ కావడం గురించి కూడా చిల్లరగా మాట్లాడుతున్నారు. వాళ్లకు అన్ని అందుబాటులో ఉంటాయి కనుక చెల్లిపోతుంది అని. గొంతులో నీళ్లు పోసే వాళ్ళు కూడా అందుబాటులో లేరు అని ఎవరు చెప్పాలి వీళ్లకు? అచ్యుత రావు లేని ఆ ఇల్లు ఇక ఎప్పటికైనా ఇదివరకులా కళకళ లాడుతుందా?
ఇంటర్వ్యూ లో ‘నువ్వు కూడా కార్టూన్స్ వేయొచ్చుగా’ అని అడిగితే, ‘అది అంటు రోగం కాదు’ అని అంటించిన అచ్యుత రావు,..
‘నాకు డార్క్ వైట్, లైట్ బ్లాక్ చీరలు చూపించు’ అని చీరలమ్ముకునే వాడిని ఆట పట్టించిన అచ్యుత రావు….
‘అయ్యో… మేము ఐదువేల తొమ్మిది వందల నియ్యోగులమే’ అని, అనానిమస్ కాల్ లో ఆరువేల నియ్యోగి సంబంధాలు వెతుకుతున్న బావగారిని ఆటపట్టించిన అచ్యుత రావు…
ఇక కనిపించడు అనుకుంటేనే బాధగా ఉంది. నమ్మలేకుండా ఉంది. ఆదిత్య, అనురాధ, రావు గారు, వదినె గారు, శ్రీధర్, Siddharth, మాధవరావు, జ్యోతి గార్లకు, గార్గి కి, అనుపమ, అరుణలకు నా ప్రగాఢ సహానుభూతి. I am with you in this tragedy….
✍️ Swathi Vadlamoodi