ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. జిల్లా జైలు నుంచి ఐదుగురు కరడుగట్టిన సిమి కార్యకర్తలను 2015 ఏప్రిల్ 7వ తేదీన ఎస్కార్ట్ వాహనంలో హైదరాబాద్ కు పోలీసులు తరలిస్తున్నారు. సిమి టెర్రరిస్టులను తరలిస్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఆలేరు దాటుతున్న సమయంలో అనూహ్య పరిణామం. ఐదుగురు సిమి ఉగ్రవాదులు ఉన్నట్టుండి పోలీసులపై తిరగబడ్డారు. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే పోలీసుల వద్ద గల తుపాకులను లాక్కుని కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు. ఈ సందర్భంగాపోలీసులకు, సిమి ఉగ్రవాదులకు తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. గత్యంతరం లేక అనివార్యమైన పరిస్థితుల్లో పోలీసులు పారిపోతున్నసిమి టెర్రరిస్టులపై కాల్పులు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఎన్కౌంటర్ ఘటనలో కర్కశ టెర్రరిస్టు వికారుద్దీన్ తోపాటు సయ్యద్ అంజాద్ అలియాస్ సులేమాన్, ఇజార్ఖాన్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ జకీర్ అనే సిమి కార్యకర్తలు కూడా హతమయ్యారు. మృతులంతా తెహ్రిక్ గుల్బా ఈ ఇస్లాం సభ్యులు. కాల్పుల్లో మృతి చెందిన వికారుద్దీన్కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు కూడా ఘటన సందర్భంగా పోలీసులు ప్రకటించారు. మక్కా మసీదులో బాంబు పేలుడుకు నిరసనగా వికారుద్దీన్ ఏటా దాడులకు దిగుతూ పోలీసులకు సవాల్ విసిరేవాడు.
ఇప్పడు ఇంకాస్త వెనక్కి వెడదాం. దాదాపు 23 ఏళ్ల క్రితం. ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్ ప్రాంతం. ఓ ఉన్మాది తల్వార్ చేబూని ఈ మండలంలోని అనేక మందిపై విరుచుకు పడ్డాడు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులంతా భయంతో గజగజ వణికిపోయారు. ఉన్మాది తల్వార్ చేబూని చేసిన కరాళ నృత్యానికి కొందరు కాళ్లు, చేతులు కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్నపోలీసులు తీవ్రంగా శ్రమించడం ద్వారా ఎట్టకేలకు ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని జగిత్యాల కోర్టుకు తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో మేడిపల్లి శివార్లలో పోలీసు జీపు టైర్ పంక్చరైంది. జీపు డ్రైవర్ టైరు మారుస్తుండగా, పోలీసులు కాస్త ఆదమరచి ఉన్నారు. ఇదే అదునుగా ఉన్మాది పోలీసుల చేతిలో తుపాకీ లాక్కుని వారిపై తిరగబడ్డాడు. ఈ సందర్భంగా పోలీసులు కూడా కొందరు గాయపడ్డారు. తప్పించుకుని పోతున్న ఉన్మాదిపై పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు. ఉన్మాది అక్కడికక్కడే హతం కాగా, రాయికల్ మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ యాసిడ్ దాడి, రంగారెడ్డి జిల్లా ఫాం హౌజ్ ఉదంతాల్లో కూడా నిందితులు పోలీసులపై తిరగబడి దాడులకు తెగబడి, తప్పించుకునేందుకు ప్రయత్నించి ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఆయా ఘటనల్లో నిందితులంతా పోలీసులపై తిరగబడి తప్పించుకునేందుకు యత్నించిన దృశ్యాలే మనకు కనిపిస్తాయి.
ఇక తాజా పరిణామాల్లోకి వస్తే డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హతమార్చిన నిందితులను ఉరి తీయాలని కొందరు, ఎన్కౌంటర్ చేయాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ వేలాది మంది ప్రజలు నిన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన తీరు, తీవ్రత తెలిసిందే. నిందితులను కోర్టుకు తరలించే పరిస్థితులు లేకపోవడంతో మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ను వెనుక వైపు నుంచి పోలీసులు స్టేషన్ కు తీసుకురావలసి వచ్చింది. చివరకు నిందితులను రిమాండ్లో ఉంచిన చర్లపల్లి జైలు వద్దకు కూడా నిరసనకారులు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తన రక్షణ సంగతేమిటి? అంటూ అను దూబే అనే యువతి పార్లమెంట్ గేటు వద్ద నిరనసకు దిగారు. ప్రియాంక హత్యపై ఆమె తీవ్రంగా కలత చెందారు. మరోవైపు వరంగల్ మహా నగరానికి చెందిన నౌషీన్ ఫాతిమా అనే లెక్చరర్ తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలంటూ పోలీస్ కమిషనర్ కు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేశారు. పోలీసు రక్షణపై తనకు నమ్మకం లేదంటున్నారు. ప్రియాంకారెడ్డి హత్యానంతరం ఆందోళనలు తెలంగాణాకే పరిమితం కాలేదు. దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లోనూ మహిళలు ఆందోళన చేస్తున్నారు. వారికి ఇప్పడు తమ భద్రతపై భరోసా కావాలి. దాన్ని కల్పించేదెవరు? ప్రజలు కోరుకుంటున్నదీ, పోలీసుల మదిలో మెదలుతున్నది ఒకే తరహా ఆలోచన అయితే, అందుకు పాలకుల ఆమోదం కూడా అవసరమే. ప్రియాంకారెడ్డి హత్య, తాజా పరిణామాలపై జిల్లా స్థాయి పోలీసు అధికారి ఒకరు ‘ఆఫ్ ది రికార్డ్’గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే…
‘వివిధ కేసుల్లో విచారణ చేస్తున్నప్పుడుగాని, కోర్టుకు తరలిస్తున్నప్పుడుగాని నిందితులు పోలీసులపై తిరగబడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. వివిధ సందర్బాల్లో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. అప్పుడు పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం అనివార్యమైన చర్యలు తీసుకోక తప్పదు. అది తుపాకీ ట్రిగ్గర్ నొక్కడం కూడా కావచ్చు. ఇది పోలీసు విధుల్లో భాగం. కానీ, సోషల్ మీడియా విస్తృతి, వదంతుల వ్యాప్తి, రాజకీయం వంటి అంశాల నేపథ్యంలో జనం మొబైల్ ఫోన్లు ఊరకే ఉంటాయా?’ అని ప్రశ్నించారు.