రైతు సంక్షేమమే ధ్యేయం…మాది రైతు ప్రభుత్వం. కర్షక క్షేమమే మా పాలన లక్ష్యం. రైతు బంధు, రైతు భీమా, రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ యోజన. అబ్బో రైతుల కోసం ఎన్నెన్ని పథకాలు? కర్షకులను లక్ష్యంగా చేసుకుని మరెన్ని కార్యక్రమాలు? వాస్తవానికి పాలకులు చెప్పే రైతు సంక్షేమ అంకెలను, ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలను బేరీజు వేసుకున్నపుడు రైతనే వాడు కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేయవచ్చనే భ్రమ కలిగినా అశ్చర్యం లేదు.

కానీ రైతు బతుకు బాగుపడుతున్న దాఖలాలేవీ కనిపించకపోవడమే విషాదం. కర్షకుడు తనకు తాను ఉసురు తీసుకునే బలవన్మరణపు మార్గంలోనే పయనిస్తున్నాడు. ఆయనెవరో కవి ఘోషించి, రచించినట్లు పురుగుల మందునే పెరుగన్నంలా స్వీకరిస్తున్నాడు. ఔను రైతు కుటుంబం రోజు రోజుకూ అగాధంలోనే కూరుకుపోతోంది. రైతులే కాదు.. కౌలు రైతులు, రైతు కూలీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇది గాలి కబురు కాదు. పత్రికా భాష ముసుగులో నింద పర్వం అంతకన్నా కాదు. జాతీయ నేరాల నమోదు సంస్థ (నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో) విడుదల చేసిన నివేదిక చెబుతున్న అక్షర సత్యం.

ఆ నివేదిక ఏం చెబుతున్నదంటే.. దేశ వ్యాప్తంగానే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో రైతుల దైన్యస్థితిని కూడా వెల్లడిస్తున్నది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణపు సంబరాలను వేలెత్తి చూపుతున్నది. మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకుల డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2018 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మన తెలుగు రాష్ట్రాలు ఎంతో ఘనకీర్తిని సాధించాయి. తెలంగాణా మూడు, ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానాలను కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన రైతు ఆత్మహత్యల నివేదికలో తెలుగు రాష్ట్రాలు సరిహద్దుల్లోని కర్నాటక, మహారాష్ట్రల సరసనే ఉండడం గమనార్హం. ఈ ఆత్మహత్యల నివేదిక ప్రకారం భూయజమానులైన రైతులే ఎక్కువ సంఖ్యలో బలవన్మరణానికి పాల్పడినట్లు తేలడం విషాదం. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం…రైతు ఏడ్చిన రాజ్యం’ బాగుపడినట్లు చరిత్ర లేదన్నది నానుడి. ఇకనైనా రైతు అసలు అవసరం ఏమిటన్నది పాలకులు గుర్తిస్తారనే విశ్వసిద్దాం. రైతుల ఆత్మహత్యల పర్వం ఆగాలని ఆకాంక్షిద్దాం.

Comments are closed.

Exit mobile version