కరోనా వైరస్ ప్రభావపు దెబ్బకు తెలుగు ప్రింట్ మీడియా కకావికలమవుతోంది. ఫలితంగా ఏం చేయాలో పాలుపోక, ప్రస్తుతానికి తోచిన దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు తమ సంచిక పేజీలను సోమవారమే కుదించాయి. ‘THE LARGEST CIRCULATED TELUGU DAILY’ ఏబీసీ సర్టిఫికెట్ ట్యాగ్ లైన్ గల ఈనాడు మెయిన్ ఎడిషన్ 12 పేజీలకు, హైదరాబాద్ మినహా మిగతా దాాదాపు అన్ని జిల్లా అనుబంధాల (టాబ్లాయిడ్స్) పేజీల సంఖ్యను ఎనిమిదికి కుదించడం గమనార్హం. అదేవిధంగా మరో ప్రధాన పత్రిక సాక్షి సైతం మంగళవారం నుంచి పేజీలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా అనుబంధాలను 8 పేజీలతోనే ప్రింట్ చేయాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
అంతేగాక పత్రిక ప్రచురణలో పాలు పంచుకునే సిబ్బందికి వంతుల వారీగా విధులు కేటాయించింది. ఉద్యోగులను విభజించి రెండు బ్యాచులుగా విడదీసింది. రోజు విడిచి రోజు మాత్రమే ఆయా సిబ్బంది విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది. అంటే ఉదాహరణకు ఓ జిల్లా డెస్కులో 10 మంది సబ్ ఎడిటర్లు ఉంటే ఐదుగురు మాత్రమే ఈ రోజు పని చేస్తారు. మరో అయిదుగురు మరుసటి రోజు విధుల్లోకి వస్తారు. మిగతా బ్యాచ్ ‘హోం రెస్ట్’ తీసుకుంటుంది.
ఇకపోతే కరోనా ముప్పు నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటున్నట్లు సుమారు ఏడాదిన్నర క్రితం మార్కెట్లోకి వచ్చిన ‘ప్రభాత వెలుగు’ దినపత్రిక యాజమాన్యం కూడా ప్రకటించింది. సామాజిక బాధ్యతతో వీలైనంత తక్కువ సిబ్బందితో పత్రికను అందించాలని భావిస్తున్నామని, అందువల్ల జిల్లా టాబ్లాయిడ్లను అందించలేకపోతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా తెలంగాణాలో అధికార పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణా’ యాజమాన్యం కూడా జిల్లా టాబ్లాయిడ్ల ఎత్తివేతపై కొంత కాలం క్రితం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎందువల్లనో అది అమలు కాలేదని ఆ సంస్థ ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల ఆయా ప్రతిపాదన ప్రస్తుతం అమలైనా ఆశ్చర్యం లేదంటున్నారు. తెలుగు ప్రింట్ మీడియాలో కరోనా ప్రభావం మరెన్ని పరిణామాలకు, చర్యలకు దారి తీస్తుందో చూడాలి.