హరీష్ ఇంటర్వ్యూ అంటే మీడియాకు ఎంతిష్టమో!
తన్నీరు హరీష్ రావు… తెలంగాణా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని అధికార పార్టీకి చెందిన నాయకుడు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లపాటు మళ్లీ మంత్రి పదవికి నోచుకోని దైన్య స్థితిని ఎదుర్కున్న నేత. ఆయన అభిమానులను తీవ్రంగా కలవరపర్చిన చేదు పరిణామాలవి. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు అంటే ఎవరికీ పెద్దగా నెగిటివ్ అభిప్రాయం ఉండదు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, మీడియా విషయంలో మాత్రం హరీష్ ఎప్పుడూ సత్సంబంధాలనే కలిగి ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అధికార పార్టీలో ‘ట్రబుల్ షూటర్’గా ప్రాచుర్యం పొందిన హరీష్ రావు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలుపు బాధ్యత ఆయన భుజస్కంధాలపైనే పడుతుంది. తనకు అప్పగించిన ‘టాస్క్’ను విజయవంతంగా పూర్తి చేయడంలో హరీష్ రావు అనుసరించే విధానాలే వేరు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు బాధ్యత కూడా హరీష్ రావు భుజాలపైనే పడింది. కాదు… కాదు పార్టీ ఆయనకు అప్పగించింది. ఇంకేముంది బాధ్యత అప్పగించాక హరీష్ రావు అత్యంత ఉత్సాహంతో కదనరంగంలోకి దూకడం కొత్తగా చూస్తున్నదేమీ కాదు. కాకపోతే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోలిపేట సుజాత ఇంటర్వ్యూల పట్ల మీడియా పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు. ఆమె గెలుపు బాధ్యతను స్వీకరించిన హరీష్ రావు ఇంటర్వ్యూలపైనే మీడియా ఫోకస్ చేయడం విశేషం. టీఆర్ఎస్ కరదీపికగా పేరుగాంచిన ‘నమస్తే తెలంగాణా’కు ఎలాగూ తప్పదు. కానీ ఇతర ప్రధాన పత్రికలతోపాటు చిన్నా, చితకా పత్రికలు, మీడియా సంస్థలు కూాడా హరీష్ రావు ఇంటర్వ్యూలకే ఎనలేని ప్రాధాన్యతను కల్పిస్తుండడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తిరుగుతూ, సోలిపేట సుజాత గెలుపునకు కంటిమీద కునుకులేకుండా కష్టపడుతున్న హరీష్ వీలు కల్పించుకుని మరీ పత్రికల వారీగా ‘ప్రత్యేక’ ఇంటర్వ్యూలు ఇస్తుండడం ఆసక్తికరం.
అసలు విషయమేమిటంటే… పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతను తీసుకున్న హరీష్ రావు ఇంటర్వ్యూలకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యతపై ఇది రంధ్రాన్వేషణ కూడా కాదు. కానీ కొన్నాళ్ల క్రితం హరీష్ రావు వార్తలకు పెద్దగా ప్రాధాన్యత కల్పించని కొన్ని మీడియా సంస్థల గురించి మనకు తెలిసిందే కదా? ఒకానొక దశలో హరీష్ రావు ఫొటో కూడా ప్రచురించకుండా కొన్ని మీడియా సంస్థలు చాలా జాగ్రత్త పడ్డాయి. ఓరకంగా ఆయన వార్తలపై అప్రకటిత నిషేధం విధించినంత పనిచేశాయి. కానీ ప్రస్తుతం మాత్రం పేజీలకు పేజీల స్థలాన్ని కేటాయిస్తూ హరీష్ రావు ఇంటర్వ్యూలు ప్రచురిస్తుండడమే అసలు విశేషం. ఇంటర్వ్యూలకే కాదు, ఆయన చెప్పే ప్రతి మాటను, ప్రత్యర్థులపై చేసే విమర్శలను అక్షరం పొల్లుపోకుండా మెయిన్ ఎడిషన్లలోనే ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. హరీష్ కు లభిస్తున్న ఈ ప్రాధాన్యత ‘దుబ్బాక’ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఉంటుందా? లేదా? అనేదే ఆయన అభిమానుల్లో కలుగుతున్న తాజా సందేహం.