పొద్దుటే లేచి కళ్ళు నలుపుకుంటూ గుమ్మంలో పడిఉన్న పత్రిక తీసుకొని వార్తలు చదవాలంటే… ఏ పత్రిక, ఏ వార్తను, ఏ రాజకీయం కోసం రాసిందో అనే అనుమానంతోనే రోజు మొదలవుతుంది.
మీడియాపై విశ్వాసం పోతోంది అనడానికి పొద్దుటే పత్రిక తీసుకోగానే కలిగే భావన ఇది. ఇలాంటి భావనతో రోజు మొదలైన తర్వాత అది క్రమేణా సూర్యుడితోపాటు పెరుగుతూ చూసిన ప్రతి వాళ్ళను అనుమానిస్తూ, చేస్తున్న ప్రతి పనిమీద ఆసక్తి, శ్రద్ధ కోల్పోతూ సాయంత్రానికి మనసు సూర్యుడితోపాటు అస్తమిస్తుంటే సమాజం ఆరోగ్యకరంగా ఎలా ఉంటుంది?
ఈ సమాజంలో సామాజికవర్గ పరిధిదాటి ఇలా బయటకు వచ్చి చూడకపోతే, లేదా మన చుట్టూ ఉండే పరిస్థితులు దాటి ఇతర ప్రపంచాన్ని చూడకపోతే ఆలోచనలు, చేతలు, మాటలు కుచించుకు పోకుండా విస్తరిస్తాయా?
ఇంట్లో గదుల్లో నుండి ఉదయాన్నే బయటకు వచ్చి ఆహ్లాదకర వాతావరణం చూసి ఆస్వాదించినట్టే బయట ప్రపంచాన్ని కూడా మన పరిధులు దాటి చూడాల్సిన అవసరం ఉంది. అలా చూడగలిగితేనే మానసిక వికాసం కలుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఏపత్రిక చదివినా ముందుగా మొదటి పేజీ చూడ్డం మానేశారు. నేరుగా లోపలి పేజీల్లోకి వెళ్ళి ఇలాంటి వార్తలేమైనా ఉన్నాయేమో వెతుక్కుంటున్నారు. నావరకూ నేనూ ముందుగా వెతుక్కునేది ఇలాంటి వార్తల కోసమే.
బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తికి ఆ బ్యాగ్ అందజేసిన ఆటో డ్రైవర్, కాల్వలో దూకిన మహిళను కాపాడిన పోలీసు, రోడ్డుపక్కన పడి ఉన్న వ్యక్తిని గమనించి 108కు ఫోన్ చేసిన వ్యక్తి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు. వృద్ధురాలిని కాపాడిన యువకుడు. అనాధలకు ఆహార పొట్లాలు అందించిన యువత… ఇలా ఎన్నో సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు సమాజం ఇంకా ఆరోగ్యకరంగానే ఉంది అనే ‘పాజిటివ్’ ఆలోచనతో రోజు ప్రారంభమైతే, ఆ రోజంతా మన చుట్టూ ఉన్నవాళ్ళను కూడా ‘పాజిటివ్’గానే చూడగలుగుతాం.
ఇలాంటి ‘పాజిటివ్’ వార్తలతో ప్రతిరోజూ మొదలైతే సమాజంలో నేర ప్రవృత్తీ తగ్గుతుంది. పాజిటివ్ ఆలోచనలు పెరిగితే బహుశా ‘దిశ’ లాంటి చట్టాలు అవసరం ఉండదేమో!
అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో పత్రికల మొదటి పేజీ వదిలేస్తే మనం, మన రాష్ట్రం ఆరోగ్యకరంగా ‘పాజిటివ్ వైబ్రేషన్స్’తో వృద్ధి వృద్ధి చెందే అవకాశం ఉందేమో చూడాలి!
-దారా గోపి