‘నేను ఫారెస్ట్ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. నాది తప్పయితే నాపై కేసులు పెట్టండి చూద్దాం’ అని సవాల్ విసురుతున్నారు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. పోడు భూముల అంశాన్ని ప్రామాణికంగా చేసుకుని పినపాక ఎమ్మెల్యే గత రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఫారెస్ట్ అధికారులపై యుద్ధానికి సిద్దం కావాలని, వారిని గ్రామాల్లోకి రానీయవద్దని, వస్తే నిర్బంధించాలని కాంతారావు పిలుపునిస్తున్నారు. తాను హైదరాబాద్ నుంచి రాగానే ఫారెస్ట్ అధికారులతో ప్రత్యక్ష యుద్ధమని, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈనెల 18న అశ్వాపురం, 19న మణుగూరు మండలాల్లో పర్యటిస్తున్నట్లు కూడా విప్ కాంతారావు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రేగా కాంతారావు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని ఫారెస్ట్ రేంజ్ అధికారుల సంఘం ప్రకటించడం గమనార్హం. సీతారామ ప్రాజెక్టు, సింగరేణి, వివిధ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 7,500 ఎకరాలకుపైగా అటవీ భూములను కేటాయించారని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం మొక్కలు నాటుతున్నామని ఈ సంఘం నేతలు పేర్కొన్నారు. ఆక్రమణలో గల తమ భూములను చట్టపరంగా స్వాధీనం చేసుకుంటున్నామని, బాధ్యతాయుత పదవిలో ఉండి అటవీ అధికారులను నిర్బంధించాలని రేగా కాంతారావు ప్రజలకు పిలుపునివ్వడం సమంజనం కాదని, ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దమని అటవీ అధికారులు వాదిస్తున్నారు.
సరే.., రేగా కాంతారావు ఆదివాసీల పోడు భూముల అంశంలోనే పోరాటం చేస్తుండవచ్చు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని కూడా ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కాంతారావు ఆదివాసీల సంక్షేమమే లక్ష్యంగా ఆయన గులాబీ పార్టీ కండువాను కప్పుకుని ఉండవచ్చు. ఇందులో సందేహించాల్సింది కూడా ఏమీ లేకపోవచ్చు. కానీ, విద్యావంతుడేగాక, రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గానూ పనిచేసిన రేగా కాంతారావుకు పోడు భూముల సమస్యను పరిష్కరించే చట్టపరమైన మార్గం ఏమిటో తెలియదా? అటవీ హక్కుల చట్టంపై ఆయనకు అవగాహన లేదా? ఇవీ అటవీ అధికారుల సందేహాలు. అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం డిసెంబర్ 13వ తేదీ 2005కన్నా ముందు పోడు చేసుకున్న భూములకు మాత్రమే పట్టాలు లభిస్తాయి. పార్లమెంట్ చేసిన ఈ చట్టంలో పోడు భూములపై సంక్రమించే హక్కులను స్పష్టంగా పేర్కొన్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఈ చట్టం కింద పోడు భూములపై గిరిజనులకు సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం డిసెంబర్ 13వ తేదీ, 2005లోపు నరికిగిన పోడు భూములన్నింటికీ పట్టాలు ఇచ్చారని, కొత్తగా ఇచ్చే విస్తీర్ణపు అటవీ భూములు కూడా ఏమీ లేవనేది అటవీ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అప్పట్లో ఇచ్చిన ఆయా పట్టాలే అడవుల పాలిట శాపంగా పరిణమించాయనేది కూడా అటవీ శాఖ అధికారుల ఆందోళన. గిరిజనేతరులు సైతం కూలీలను పెట్టి మరీ 2008-09 తర్వాత భారీ ఎత్తున అడవులను నరికి ‘పోడు’ చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాల్సిందే… కానీ ఎలా? ఇదీ అసలైన చిక్కు ప్రశ్న. అటవీ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుండవచ్చు. కానీ అటవీ భూములపై హక్కులు ప్రసాదించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్పపుడు యూపీఏ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది. అందువల్లే పోడు భూములకు పట్టాలిచ్చే అవకాశం ఆయనకు లభించింది. ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. కాకపోతే గిరిజనులకు లబ్ధి చేకూర్చాలనే తపన వైఎస్ లో ఉండడం వల్లే అది సాధ్యమైంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో గల ఎన్డీయే ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ పెద్దలు ఒప్పించి మరోసారి అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఇది జరగాలంటే 2005నాటి చట్టాన్ని సవరించాలి. ఇందుకు పార్లమెంటులో ఆమోదం లభించాలి. విద్యావంతుడైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఈ విషయాలు తెలియవా? ఒకవేళ తెలిస్తే అటవీ శాఖ అధికారులను టార్గెట్ చేస్తూ, వారిని నిర్బంధించాలని ప్రజలను, పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వివాదాస్పద పిలుపును ఎందుకు ఇస్తున్నట్లు? ఇవీ అధికార వర్గాల సందేహాలు. ఈ విషయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావును ఎవరైనా జర్నలిస్టు తప్పుదోవ పట్టిస్తున్నారా? తన ప్రయోజనమే పరమావధిగా ఆదివాసీల పోడు భూముల అంశాన్ని ముందుకు తీసుకువచ్చి, ఎమ్మెల్యే కాంతారావుకు ఆ జర్నలిస్టు తప్పుడు సలహాలిస్తున్నారా? అనే ప్రశ్నలకు ఔననే ప్రచారం భిన్న వర్గాల్లో జరుగుతోంది.
అసలు ఈ జర్నలిస్టు ఎవరు? అతనికి పినపాక నియోజకవర్గంలో పోడు భూములున్నాయా? దాదాపు వంద ఎకరాలకు పైగా అడవిని నరికించి ఆ జర్నలిస్టు పోడు భూములుగా మార్చాడా? కరకగూడెం అడవిని ఆనుకుని ఉన్న ములుగు నియోజకవర్గంలోని అడవులను నరికి జామాయిల్ తోటను పెంచుతున్న మరో వంద ఎకరాలు కూడా సదరు జర్నలిస్టు నరికించిన పోడు భూమేనా? గిరిజనుల పేరుతో బినామీ దందా ద్వారా వందలాది ఎకరాల అటవీ భూమిని కైంకర్యం చేసేందుకు జర్నలిస్టు పథక రచన చేశారా? ఇప్పటికే ఓ ‘కోత’ ద్వారా జామాయిల్ పంటతో సొమ్ము చేసుకున్న ఈ జర్నలిస్టుకు మణుగూరు రాజకీయాలతో గల సంబంధమేంటి? వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుడిని అధికార పార్టీ తరపున పదవీ హోదాలో చూసుకునేందుకు ఇప్పటి నుంచే ఆ జర్నలిస్టు పావులు కదుపుతున్నాడా? ఆయా ప్రశ్నలపై పినపాక నియోజకవర్గంలో భిన్న ప్రచారం సాగుతోంది. అంతే కాదు ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఇదే అంశంపై కూపీ లాగుతున్నాయట. అదీ అసలు సంగతి.