చదివారుగా… ఖమ్మం ‘పోలీస్-ప్రెస్’ వాట్సాప్ గ్రూపులో తాజాగా వచ్చిన పోస్టులు ఇవి. ఇద్దరు జర్నలిస్టులు వేర్వేరుగా చేసిన పోస్టులివి. విషయంలోకి వెడితే… సోషల్ మీడియాలో అత్యుత్సాహంతో పోస్టులు పెట్టి, తమకు మాత్రమే సమాచారం తెలుసని కొందరు తహతహలాడుతుంటారు. అది వాస్తవమా? అవాస్తవమా? అనే అంశాన్ని తేల్చుకోకుండానే తమ పైత్యాన్ని ప్రదర్శిస్తుంటారు.
కానీ ‘రెగ్యులర్’ జర్నలిజంలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు బాధ్యత ఉండాలి కదా? బాధ్యతను విస్మరించి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే అభాసుపాలు కాకతప్పదని నిరూపించే ఉదంతమిది. ఎవరో గాలి గన్నారావు చెప్పాడని కొత్తగూడెం ఎస్పీ బదిలీ అంటూ ఓ జర్నలిస్టు వాట్సప్ గ్రూపులో పోస్ట్ పెట్టేశాడు. జర్నలిజంతో ‘టచ్’లేని వ్యక్తులు ఇటువంటి పోస్టును ఫార్వార్డ్ చేశారంటే అవగాహనలేని వ్యక్తి కాబోలునని భావించవచ్చు. ఫీల్డుకు కొత్తగా వచ్చిన జర్నలిస్టు పోస్ట్ పెట్టాడంటే ‘కొత్త మురిపెం’గా పేర్కొనవచ్చు.
కానీ అధికార పార్టీ మీడియా సంస్థ ప్రతినిధిగా పనిచేస్తూ, విషయాన్ని ధృవీకరించుకోకుండా గాలి వార్తను పోగేసి నేరుగా పోలీస్ గ్రూపులోనే ఎస్పీ బదిలీ అంటూ పోస్ట్ చేస్తేనే నలుగురిలో నవ్వులపాలు కాకతప్పదు. ఆ తర్వాత ఇదిగో ఇలా బహిరంగ క్షమాపణ చెప్పుకోవలసి రావచ్చు. అధికార పార్టీ నేతలకు చెందిన మీడియా ప్రతినిధి ఇటువంటి ఘటనల్లో అభాసుపాలైతే దాని చర్చ తాలూకు ప్రభావం సంస్థపైనా పడే ప్రమాదం లేకపోలేదు.
ఇక రెండో ఘటన విషయానిక వస్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కిష్టాపురం అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని ఎవరో సోషల్ మీడియా ద్వారా పుకార్ లేపారు. ముగ్గురు నక్సలైట్లు మరణించారని కూడా ఆయా పోస్టు ద్వారా వ్యాప్తి చేశారు. అటువంటి ఘటనేమీ జరగలేదు, ఎన్కౌంటర్ పై వస్తున్న వార్తలు అవాస్తమని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ప్రకటన కూడా విడుదల చేశారు. ఏ ఎన్కౌంటరూ జరగలేదు బాబోయ్… అని స్వయంగా ఎస్పీ ప్రకటన ద్వారా క్లియర్ చేసినప్పటికీ, మన మీడియా ‘ఉత్సాహం’ ఊర్కోదు కదా? ఇందుకు సంబంధించి ప్రధాన పత్రికలు సైతం ఈరోజు వార్తా కథనాలను వండేశాయి కూడా.
‘కిష్టాపురం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్?’ అంటూ క్వశ్చన్ మార్క్ వార్త.., దాని పక్కనే అవాస్తవమని పోలీసు అధికారుల వెల్లడి’ అటూ ముక్తాయింపు. ఎవరేం చెప్పినా మేం వినం, సోషల్ మీడియా వేదికగా ఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేస్తాం, ఆ తర్వాత క్షమాపణ చెబుతాం… ఎన్కౌంటర్ జరగలేదని ఐపీఎస్ ఆఫీసర్ చెబితే మాత్రం వింటామా… ఏంది? మా వార్తలు మేం రాస్తూనే ఉంటాం. మా దారి… పుకార్లనూ వదలని రహదారి…’ అంటుంటాం. ఇదే నయా జర్నలిజపు రీతి. అదీ అసలు సంగతి.