తెలుగంటే ఆంధ్రం…ఇదీ ‘THE LARGEST CIRCULATED TELUGU DAILY’ ‘ఈనాడు‘ పత్రిక నిర్వచనం. అదేమిటీ తెలుగంటే ఆంధ్రం మాత్రమేనా? తెలంగాణం కాదా? ఇదేమి వాదం? అని తల నిమురుకోకండి. విషయమేమిటంటే… ఏపీలో…అదే ఈనాడు ‘పరిబాస’ ప్రకారం ఆంధ్రము అనే రాష్ట్రములో అక్కడి ప్రభుత్వం సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నట్లు చేసిన ప్రకటనపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా? ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పార్టీ తరపున మల్లగుల్లాలు పడుతూ పోరాటం చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇదిగో చంద్రబాబు చెప్పిన అంశానికే ఈనాడు పత్రిక ‘ఆంధ్రం’ తగిలించిందన్న మాట.
వాస్తవానికి చంద్రబాబు చెప్పింది వేరు…ఈనాడు పత్రిక కథనం ప్రకారమే…భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు, వృత్తిలో రాణించడానికి ఇంగ్లీషు అవసరమనేది తమ పార్టీ విధానంగా చంద్రబాబు ప్రకటించారు. ఇంగ్లీష్ కు తాము వ్యతిరేకం కాదని, మాతృ భాష తెలుగును కాపాడాలని మాత్రమే తాము చెబుతున్నామని నిన్నగుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగును కాపాడాలని మాత్రమే చంద్రబాబు చెప్పారే తప్ప, తెలుగంటే ఆంధ్రం అని ఆయన నిర్వచించినట్లు ఈనాడు ప్రచురించిన తన వార్తా కథనంలో ఎక్కడా ఉటంకించలేదు. కానీ ఆంధ్రము, అదే… ఏపీ ఎడిషన్‌లో ‘ఆంధ్రం, ఆంగ్లం రెండూ అవసరమే‘ అనే శీర్షికతో చంద్రబాబు ఫొటోతో పత్రికలోనేగాక ఆన్ లైన్ ఎడిషన్‌లోనూ సదరు వార్తను ఆంధ్రీకరించిన ఈనాడు పత్రిక తెలంగాణా ఎడిషన్‌లో మాత్రం శీర్షికను మార్చడం విశేషం. ‘సంస్కృతి పరిరక్షణకు తెలుగు అవసరం’ అనే శీర్షికతో తెలంగాణా ఎడిషన్‌లో వార్తా కథనాన్ని కుదించి ముక్తాయింపునిచ్చింది. తెలుగంటే ఆంధ్రం మాత్రమే అనే భావన స్ఫురించే విధంగా ఉన్న ఈ శీర్షికలోని పైత్యం ఇంతకీ ఈనాడు పత్రిక విధానమా? లేక ప్రాస కోసం సబ్ ఎడిటర్ పడిన ప్రయాసా? ఏంటో ఈనాడు ఆంధ్రము భాష… అని నిట్టూరుస్తున్నారుట… దాని పాఠకులు.