రాజకీయం, జర్నలిజం పరస్పరం పెనవేసుకున్న బంధానికి సంబంధించిన అంశం కాదిది. రాజకీయ పార్టీలతో అంటకాగడం, పార్టీలకు కరపత్రాలుగా మారిన పత్రికల సబ్జెక్టు వేరు. మీడియా అధిపతులు తమ సంస్థలను పార్టీలకు తాకట్టు పెట్టి, ‘నామినేటెడ్’ పదవులతో రాజకీయాలు వెలగబెట్టి తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్న బాగోతం వేరు. పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూనే రాజకీయ రంగం వైపు చూస్తున్న జర్నలిస్టుల ‘శక్తి’కి సంబంధించిన కథనమిది.
చాలా మంది జర్నలిస్టులు తాము అత్యంత బలవంతులమని విశ్వసిస్తుంటారు. పత్రికల్లో తాము రాసే వార్తలకో, టీవీల్లో తాము అరిచే అరుపులకో జనంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందని భ్రమిస్తుంటారు. తనకు ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు వేల ఓట్లు ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ అంశంలో తనకు ‘లైవ్’లో కొన్ని అంశాలకు హామీ ఇస్తే బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తానని పర్వతనేని వెంకటకృష్ణ అనే జర్నలిస్టు చేసిన తాజా వ్యాఖ్యల తరహాలో అన్నమాట. నిజంగానే జర్నలిస్టులకు ప్రజల్లో అంత పవర్ ఉందా? ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంత మంది జర్నలిస్టులు సఫలమయ్యారు? ఇదీ తాజా చర్చ.
గత కొంత కాలంగా రాజకీయ రంగంలో సక్సెస్ అయిన జర్నలిస్టుల ఉదంతాలను పరిశీలిస్తే… ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతున్న సమంయలో కాలువ శ్రీనివాసులు అనే ఈనాడు రిపోర్టర్ రాజకీయ రంగంలోకి అడుగిడి విజయం సాధించారు. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చి అదే సంస్థలో జర్నలిస్టుగా కొనసాగుతున్న కాలువ శ్రీనివాసుకు టీడీపీ టికెట్ లభించడం వెనుక ఈనాడు అధినేత రామోజీరావు ఆశీస్సులు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. స్థానికంగా ఏర్పడిన సామాజిక అంశాలే ఇందుకు ప్రధాన కారణమనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగానూ పనిచేశారు.
అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా ఒకప్పుడు జర్నలిస్టే. ఉదయం, వార్త దినపత్రికల్లో పనిచేసిన రామలింగారెడ్డికి విప్లవోద్యమ నేపథ్యం, ప్రత్యేక తెలంగాణా మలిదశ ఉద్యమంలో భాగస్వామ్యం కలిసొచ్చాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రామలింగారెడ్డిని రాజకీయ నేతగా తీర్చిదిద్దారని చెప్పక తప్పదు. ఫలితంగానే రామలింగారెడ్డి పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరో జర్నలిస్టు క్రాంతి కూడా కేసీఆర్ అండదండలతో గత ఎన్నికల్లో ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సైతం ఒకప్పుడు జర్నలిస్టే. ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న కాలంలోనే కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీన పరిణామాల్లో కొంత కాలం ఆ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికై, ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో చేరి సక్సెస్ అయినవారిలో ఆయా జర్నలిస్టుల ఉదంతాలు ఓ ఉదాహరణ మాత్రమే.
ఈ నేపథ్యంలోనే అనేక మంది జర్నలిస్టులు రాజకీయంగా విఫలమైన ఘటనలు కూడా లేకపోలేదు. అంతెందుకు ప్రస్తుత ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అపజయం పాలయ్యారు. ఆ ఫలితానంతరమే ఆయన జగన్ పార్టీలో చేరారు. రాజకీయ రంగంవైపు చూసిన మరో ప్రముఖ జర్నలిస్టు, ప్రస్తుత ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎందుకోగాని అమర్ అభ్యర్థిత్వం పట్ల కేసీఆర్ ఏమాత్రం మొగ్గు చూపలేదు.
అదేవిధంగా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురు జర్నలిస్టులు తీవ్రంగా భంగపడిన ఘటనలు కూడా ఉన్నాయి. కనీసం డిపాజిట్ దక్కని జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు. తాజాగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు జర్నలిస్టులు తహతహలాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ న్యూస్ ఇన్ పుట్ ఎటిడర్ పీవీ శ్రీనివాస్ అధికార పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సాక్షిలో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ట్రై చేస్తున్నట్లు కూైడా వార్తలు వచ్చాయి. ఇంకా అనేక మంది జర్నలిస్టులు కూడా ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో నిలిచేందుకు కుతూహలపడుతున్నారు.
మొత్తంగా ‘పొలిటికల్ జర్నలిస్ట్’ అనే అంశంలో చొప్పొచ్చేదేమిటంటే తాము రాసే రాతలకో, కూసే కూతల వల్లో బలవంతులమని భ్రమించాల్సిన అవసరం లేదని. కాలువ శ్రీనివాసులు, రామలింగారెడ్డి, కురసాల కన్నబాబు, క్రాంతి వంటి జర్నలిస్టులు సక్సెస్ కావడం వెనుక టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల బలముంది. ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతల ప్రోత్సాహం ఉంది. ప్రముఖ ఆంగ్ల పత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోపి దారా తన ఫేస్ బుక్ పేజీలో ఏమంటారంటే… ‘రోడ్డు మీద నేను వెడుతున్నప్పుడు నా వెనుక ఉన్నవారంతా నా అనుచరులే…’ అని ఛమత్కరించారు. అదీ కొందరు జర్నలిస్టులు భ్రమిస్తున్న బలుపు లాంటి పొలిటికల్ వాపు. ఇదే అసలు సంగతి.