అది 1974, ఆగస్టు 10వ తేది. ‘ఈనాడు’ దిన పత్రికను స్థాపించిన రోజు. విశాఖపట్నం కేంద్రంగా రామోజీరావు తన మానస పుత్రిక ఈనాడుకు పునాది వేసిన నేపథ్యం. పత్రిక ప్రారంభమైంది. జనంలోకి వెడుతోంది. కొద్ది రోజుల్లోనే ఉత్తరాంధ్ర ప్రజల నుంచి పత్రిక కార్యాలయానికి లేఖల వరద. అసంఖ్యాకంగా వచ్చిపడుతున్న లేఖల సారాంశం ఏమిటంటే ‘మీ పత్రిక విధానం ఏమిటి? లక్ష్యం ఏమిటి? సమాజానికి ఏం చెప్పలదలిచారు? మాకేమీ అర్థం కావడం లేదు. బోధపడడం లేదు. ఎందుకంటే మీ పత్రికలో ఎడిటోరియల్ పేజీ లేదు. కారణం? మీకు ఏ విధానమూ లేదని మేం భావించవచ్చా?’ ఇవీ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న లేఖల్లోని ప్రశ్నలు. పత్రికకు ఖచ్చితంగా ఎడిటోరియల్ పేజీ ఉండాలని ప్రారంభం నుంచే దాని ఫౌండర్ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ పట్టుబట్టారు. కానీ యాజమాన్యం అంగీకరించలేదు. అనవసరంగానే భావించింది. కానీ పాఠకుల ఒత్తిడిని తట్టుకోలేక పత్రిక ప్రారంభమైన నాలుగు నెలల తర్వాత ఈనాడులో ‘సంపాదకీయ పేజీ’ (ఎడిటోరియల్ పేజీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీరావు, ఏబీకే ప్రసాద్ వంటి పెద్దల మధ్య జరిగిన సంభాషణ, అనంతర పరిణామాలు అప్రస్తుతం… అది వేరే విషయం. ఎప్పుడో 1974లో ప్రారంభించిన ఈనాడు పత్రికలోని ఎడిటోరియల్ పేజీ గురించి ప్రస్తుతం ప్రస్తావన దేనికంటే… కారణం ఉంది.
ప్రతి పత్రికకూ ఓ విధానం ఉండాలి. పాఠకులకు పత్రిక అభిప్రాయం కీలకం. పత్రిక విధానాన్ని, లక్ష్యాన్ని ప్రతిబింబించేది ఎడిటోరియల్ పేజీ. పత్రిక విధానం ఏదైనా కావచ్చు. పాలకుల పట్ల సానుకూలత కావచ్చు. వ్యతిరేకత కావచ్చు. లేదా పక్కా వ్యాపార ధోరణి కావచ్చు. ఏదైనా ఫరవాలేదు. కానీ పత్రిక విధానమేమిటో తన పాఠకుల ముందుంచాల్సిన ప్రాథమిక ధర్మం, కర్తవ్యం పత్రిక యాజమాన్యానికి ఉండాలన్నది సుప్రసిద్ధ సంపాదకుల అభిప్రాయం. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి కూడా తెలుగు పత్రికా రంగంలో ఎడిటోరియల్ పేజీ లేని పత్రికలు లేవు. చివరికి ‘టైటిల్’లోనే వ్యాపార లక్షణాన్ని ప్రస్ఫుటించే ‘ఎకనమిక్ టైమ్స్’ వంటి పత్రికలు సైతం ఎడిటోరియల్ పేజీలతోనే పాఠకుల ముందుకు వస్తున్నాయి.
కానీ 2018 అక్టోబర్ 5వ తదీన ప్రారంభమైన ‘ప్రభాత వెలుగు’ అనే తెలుగు దినపత్రిక ఎడిటోరియల్ పేజీని విస్మరించడమే అసలు విశేషం. పత్రిక ప్రారంభంలో నిర్వహణకు సంబంధించిన బాలారిష్టాలు ఎంత పెద్ద యాజమన్యానికైనా సహజమే. కానీ పాఠకుల ముందుకు వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ‘ప్రభాత వెలుగు’ దినపత్రిక ఎడిటోరియల్ పేజీ గురించి పట్టించుకోకపోవడమే జర్నలిస్టు సర్కిళ్లలో చర్చకు కారణమైంది. ఈ పత్రికలో ‘ఓపెన్ పేజ్’ పేరుతో గల ఓ పేజీలో అడపా దడపా పాఠకుల లేఖలు కాబోలు… కొన్ని అభిప్రాయాలను మాత్రం ప్రచురిస్తున్నారు. దీన్నే సదరు పత్రిక వర్గాలు ‘ఎడిటోరియల్ పేజి’గా ఉటంకిస్తుండడం గమనార్హం. అయితే ఈ పేజీలో ఎటువంటి సంపాదకీయం లేకపోవడమే గమనించాల్సిన అంశం. పత్రికకు ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్ ఫలానా వారుగా పేర్కొంటూ ‘ఇంప్రింట్’లో ప్రచురించడం ఆర్ఎన్ఐ నిబంధన. ఇందుకు అనుగుణంగా ‘ప్రభాత వెలుగు’ ఆయా వివరాలను ప్రచురిస్తున్నది కూడా. పత్రికకు ఎడిటర్ ఉన్నపుడు ఎడిటోరియల్ తప్పనిసరిగా ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. దీన్ని ‘ప్రభాత వెలుగు’ పత్రిక యాజమాన్యం విస్మరించిందన్నదే కొందరు జర్నలిస్టుల వాదన.
పత్రిక నిర్వహణలో డబ్బు, సీట్లు ప్రధానం కాదని, తన విధానమేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవశ్యకత పత్రిక యాజమాన్యానికి అనివార్యమని, అందుకే ఎడిటోరియల్ పేజీ ఉంటుందని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి పత్రికకు ఎడిటర్ వ్యూ ఉంటుందని, ఎడిటోరియల్ లేకుండా ప్రచురించేది కరపత్రమవుతుందే తప్ప, పాఠకుల పత్రికగా భావించరని సీనియర్ జర్నలిస్టు ఎం. మారుతీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎడిటోరియల్ పేజీ చట్టమా? నిబంధనా? అనే అంశాలను పక్కనబెడితే పత్రిక నిర్వహణలో సంప్రదాయమనే అంశాన్ని విస్మరించరాదన్నారు. వార, పక్ష, మాస పత్రికలు సైతం ఎడిటోరియల్ పేజీని ప్రచురిస్తున్న దాఖలాలు ఉన్నాయని మారుతీ ప్రసాద్ గుర్తు చేశారు.
ఓ పత్రిక ఎడిటోరియల్ పేజీ లేకుండా ప్రచురితమవుతోందంటే పాఠకుల పట్ల ఆ పత్రికకు కమిట్మెంట్ ఇష్టం లేనట్లు భావించాల్సి ఉంటుందని సుప్రసిద్ధ, సీనియర్ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ ts29.inతో అన్నారు. ఎడిటోరియల్ లేకుండా పత్రిక పాలసీ పాఠకులకు అర్థమయ్యే అవకాశమే లేదన్నారు. పాఠకులకు పత్రిక విధానం తెలియాల్సిన అవసరం తప్పక ఉంటుందని, ఇందుకు విరుద్ధంగా ఉంటే అవకాశవాదంగా భావించాల్సి ఉంటుందన్నారు. పాఠకుల ముందు అభిప్రాయం వ్యక్తీకరించడం మనకెందుకులే అనేది దాని నిర్వాహకుల భావన కాబోలునని ఏబీకే అన్నారు.