తెలుగు మీడియాలోని ఓ పత్రికకు చెందిన బ్రాంచ్ మేనేజర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. వ్యాపారం పేరుతో తనను నమ్మించిరూ. 10 లక్షల మొత్తాన్ని అతను ఎగవేశాడనేది బాధితుని ఆరోపణ. ఈ వ్యవహారం అటూ, ఇటూ తిరిగి చివరికి పోలీస్ స్టేషన్ వరకు చేరుకోవడం గమనార్హం. భారీ మొత్తపు ఆర్థిక ఆరోపణలు ఎదుర్కుంటున్న పత్రిక మేనేజర్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారు. ఖమ్మం నగరానికే చెందిన ప్రముఖ వ్యాపారి మేళ్లచెరువు వెంకటరమణ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం. ఆయన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన పోస్టును స్వల్ప ఎడిట్ ద్వారా దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవవచ్చు.
………… పత్రిక బ్రాంచ్ మేనేజర్ రూ. 10 లక్షలు ఎగవేతపై ఫిర్యాదు
శ్రీయుత గౌరవనీయులైన …….. పత్రిక ఎడిటర్ గారికి నమస్కరించు వ్రాయునది
ఆర్యా..!
మేము కొన్ని సంవత్సరాలుగా ఖమ్మంలో బాలాజీ జనరల్ స్టోర్‌ను నడుపుతున్నాము. జిల్లాలో మా స్టోర్‌కు అనేక మంది నమ్మకమైన కష్టమర్లు ఉన్నారు. కొంత కాలం క్రితం …. పత్రిక జిల్లా ఇంచార్జీగా పని చేస్తున్నానంటూ మిత్రుల ద్వారా ……. మాకు పరిచయం అయ్యారు. నాకు విజయవాడలో ……. రెస్టారెంట్లు ఉన్నాయని అలాగే నా భార్య విజయవాడలో ……. ఆఫీసర్‌గా పని చేస్తుందని చెప్పారు. ఖమ్మంలో కొత్తగా …….. రెస్టారెంట్ పేరుతో బ్రాంచ్‌ను తెరిచామని ప్రతి నెల సరుకులు సరిపడా సరఫరా చేస్తే వెంటనే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికించారు. వారి రెస్టారెంటుకు నెల నెల సరుకులు పంపాము మొత్తం సరుకులు బాబాతు రూ 10 లక్షలు బకాయి పడ్డాడు. అవి అడిగితే వాయిదాలు పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడేమో నేను జిల్లా ఇంచార్జీని నాకు ఉన్నతాధికారులతో బాగా సంబంధాలు ఉన్నాయని డబ్బులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. …….. పత్రికకు మార్కెట్లో మంచి పేరు ఉండటం, అతను ఆ సంస్థలో బాధ్యత గల పదవిలో ఉండటంతో అతను మాటలు నమ్మి అప్పు ఇవ్వడం జరిగింది. తీసుకున్న సరుకుల తాలుకా అప్పు తీర్చక పోగా మమ్మలను పత్రిక పేరుతో బెదిరిస్తుండటంతో మేము మానసిక మనో వేదనకు గురౌతున్నాము. బాలాజీ స్టోర్‌ను మా కుటుంబ సభ్యుల స్వయం కృషితో జిల్లాలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాము. మా దగ్గర వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు వివిధ వర్గాల వారు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకూ మాకు ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చేసే వ్యక్తి ఇంతవరకు మాకు ఎదురుపడలేదు. ఇతని పద్దతిపై విసిగి వేసారి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా …….. బ్లాక్ మెయిలింగ్ పై చర్యలు తీసుకుని మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేకూర్చగలరని ప్రార్థన.
ఇట్లు
తమ విదేయులు
మేళ్లచెరువు వెంకటరమణ
సెల్ నెం, 9849766399
అయితే తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన మేళ్లచెరువు వెంకటరమణపై ఆయా పత్రిక మేనేజర్ ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారానికి దిగిన వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో పోలీసులు వెంకటరమణను పిలిపించి ప్రశ్నించగా, తనకు జరిగిన అన్యాయాన్ని, సదరు పత్రిక మేనేజర్ వ్యవహార శైలిని పూసగుచ్చినట్లు పోలీసుల ముందు ఆయన ఏకరవు పెట్టారు.
ఇదే అంశంపై వ్యాపారి వెంకటరమణను ts29 ప్రశ్నించగా, తనకు రూ. 10 లక్షల పైనే ఆయా పత్రిక మేనేజర్ చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి గతంలో ఇద్దరు పెద్ద మనుషులను వెంటేసుకుని వచ్చి రూ. 3 లక్షలు ఇస్తానని, మొత్తం డబ్బు చెల్లించినట్లు కాగితం రాసి ఇవ్వాలని బెదిరించారని మేళ్లచెరువు వెంకటరమణ పేర్కొన్నారు. తనకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోగా, తనపైనే అన్యాయంగా పోలీసు ఫిర్యాదు చేశారని ఆయన వాపోయారు.
ఘటనపై ఖమ్మం రూరల్ పోలీసులను వివరణ కోరగా, ఆయా పత్రిక మేనేజర్ వ్యాపారి వెంకటరమణపై ఫిర్యాదు చేసిన మాట వాస్తమేనన్నారు. తాము ఆయనను పిలిపించి వివరాలు ఆరా తీశామని, పత్రిక మేనేజర్ ఇచ్చిన అస్పష్టమైన (వేగ్) ఫిర్యాదుపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా రూరల్ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ భారీ మొత్తపు డబ్బును ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయా పత్రిక మేనేజర్ కు వత్తాసుగా ఓ రాజకీయ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పైరవీలు చేస్తున్నట్లు తెలియడం కొసమెరుపు.