పోలీసు రక్షణ పట్ల కూడా తెలంగాణా రెవెన్యూ అధికారులు తమ భద్రతపై పూర్తి భరోసాగా ఉన్నట్లు కనిపించడం లేదు. పెప్పర్ స్ప్రే బాటిళ్లను ఎప్పడూ తమ వెంట ఉంచుకోవాలని, ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని, తద్వారా ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలని మహిళా తహశీల్దార్లకు రెవెన్యూ సంఘాల నేతలు సలహా ఇస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలో మహిళా తహశీల్దార్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని, పెప్పర్ స్ప్రే బాటిళ్లను వెంట తీసుకువెళ్లాలని తాము సలహా ఇచ్చినట్లు తెలంగాణా డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి స్వయంగా ప్రకటించడం గమనార్హం.
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యి మంది తహశీల్దార్లలో దాదాపు 400 మంది మహిళలు ఉన్నారు. విజయారెడ్డి ఉదంతం నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ భద్రతపై రెవెన్యూ అధికారులు భయం భయంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల సమీపంలోని తంగళ్లపల్లి తహశీల్దార్ కార్యాలయానికి ఓ వ్యక్తి ఇటీవల పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. ఇంకేముందు ఎమ్మార్వో ఆఫీసు అధికారులు, సిబ్బంది గజగజ వణికిపోయారు. అతన్ని పట్టుకుని పెట్రోల్ డబ్బా గురించి ప్రశ్నిస్తే, తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోయిందని, ఇంటికి వెడుతూ పెట్రోల్ తీసుకువెడుతున్నానని చెప్పడంతో రెవెన్యూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరహా అనేక అనుమానాస్పద సంఘటనల నేపథ్యంలో ఇకపై ఫిర్యాదులతో తహశీల్దార్లను కలవడానికి వచ్చేవారు తమ వెంట ఎటువంటి బ్యాగులను తీసుకువెళ్లడానికి అనుమతించరట. రెవెన్యూ అధికారులను కలిసే ప్రజల చేతుల్లో ఇక నుంచి పిటిషన్లకు సంబంధించిన కాగితాలు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటారట. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా పదే పదే తమ కార్యాలయాలకు వచ్చేవారిపై నిఘా ఉంచవచ్చని భావిస్తున్నారు. అదే పనిగా తహశీల్దార్ ఆఫీసులో సంచరిస్తున్నట్లు సీసీ కెమెరా పుటేజీ ద్వారా గుర్తిస్తే, అతని సమస్య ఏమిటో తెలుసుకుని, సరైన చర్య తీసుకోవచ్చని, లేదా సలహా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో గ్రామ సభలు నిర్వహించి సర్పంచ్ లకు, ఎంపీటీసీల సహకారం కూడా తీసుకోవాలని పలువురు తహశీల్దార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తరహా కఠిన నిబంధనలు అధికారులను ప్రజలకు మరింత దూరం చేసినట్లేనని ఓ తహశీల్దార్ వ్యాఖ్యానించారు.