ఖమ్మం నగరంలోని ఓ జంక్షన్ అభివృద్ధి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పువ్వాడ తీసుకుంటున్న ఇటువంటి కీలక నిర్ణయాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్, చర్చి కాంపౌండ్ ఏరియాగా ప్రాచుర్యం పొందిన జంక్షన్ లో మంత్రి అజయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఓ సంచలనంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
ఇటీవలే అభివృద్ధి చేసిన ఈ సెంటర్ లో భారీ శిలువను గాని, లేదంటే ఏసుక్రీస్తు విగ్రహాన్ని గాని ఏర్పాటు చేసేందుకు మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా ప్రాంతంలో నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడి జంక్షన్ లో నిర్మించే శిలువ లేదా ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు.
కాగా ముత్యాలమ్మగుడి సెంటర్, చర్చి కాంపౌండ్ ఏరియాలో ప్రారంభించిన ఈ కట్టడం వివాదానికి దారి తీసింది. బీజేపీ, ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ లకు చెందిన పలువురు కార్యకర్తలు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు శనివారం రాత్రి ప్రయత్నించిన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కట్టడాన్ని అడ్డుకున్న ఆయా పార్టీ, సంస్థలకు చెందిన పలువురిని ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.