To those who are using fb to spread hate red , frustration , anger, vulgarity , infiriority suppression , Gobels spreading , WELCOME ?
పైన గల వ్యంగ్య చిత్రాన్ని, దాని దిగువన గల వ్యంగ్య వ్యాఖ్యలను చూశారుగా… చదివారుగా? సతీష్ ఆచార్య గీసిన కార్టూన్ ను జోడిస్తూ తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిన్న రాత్రి 10.07 గంటల ప్రాంతంలో చేసిన సోషల్ మీడియా పోస్టు ఇది. ‘మినిస్టర్ పువ్వాడ అజయ్ ఇన్ఫో-112’ పేరుతో గల వాట్సాప్ గ్రూపులో మంత్రి అజయ్ కుమార్ స్వయంగా ఈ పోస్టు చేయడం విశేషం. ఈ వాట్సాప్ గ్రూపునకు మంత్రితోపాటు ఆయన ఆయన పీఏ, పీఆర్వోలు కూడా అడ్మిన్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇంతకీ మంత్రి అజయ్ కుమార్ చేసిన ఈ వాట్సాప్ పోస్టు వెనకాల గల అసలు అర్థమేంటి…? ఆయన రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేస్తూ వదిలిన పోస్టు? ఇదీ నెటిజన్లలో సాగుతున్న తాాజా చర్చ. కాంగ్రెస్, బీజేపీ పార్టీల పరస్పర ఆరోపణలు, విమర్శలు, వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తా కథనం నేపథ్యంలో ‘ఫేస్ బుక్ వివాదం’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లోనే తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ చేసిన వాట్సప్ పోస్టు సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన వాట్సాప్ పోస్టులో మంత్రి అజయ్ చేసిన పోస్టును నిశితంగా పరిశీలిస్తే… ‘ద్వేశపూరిత ఎరుపు, అసహనం, కోపం, అసభ్యత, అభద్రత, అణచివేత, గోబెల్స్ వ్యాప్తికి స్వాగతం’ అంటూ నర్మగర్భంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు గోచరిస్తోంది. అయితే ఈ నర్మగర్భపు వ్యంగ్య వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి మంత్రి తన పోస్టులో రాశారన్నదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే.. కరోనా నియంత్రణ చర్యల అంశంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు, అనంతర పరిణామాల్లో టీఆర్ఎస్ నేతల ఎదురుదాడి విమర్శలు, బీజేపీ నాయకుల ప్రతివిమర్శల పరిణామాలు ప్రస్తుతం తెలంగాణాలో పొలిటికల్ హాట్ టాపిక్. ఈ పరిస్థితుల్లో ఫేస్ బుక్ ఇండియాకు చెందిన బాధ్యులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల పరంపరలో మంత్రి అజయ్ సోషల్ మీడియా పోస్టు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే మంత్రి అజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోనేకాదు జిల్లా వ్యాప్తంగానూ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. బీజేపీ నేతలు మంత్రిని లక్ష్యంగా చేసుకుని రాజకీయం నెరపుతున్న దాఖలాలూ లేవు. అందువల్ల మంత్రి పోస్టును మరింత నిశితంగా పరిశీలించినపుడు బహుషా ఇది బీజేపీ నాయకులను ఉద్దేశించి చేసిన పోస్టు కాకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
ఎందుకంటే తన పోస్టులో ద్వేషపూరిత ఎరుపు (hate red) అనే పదాన్ని కూడా మంత్రి ఉపయోగించడం గమనార్హం. వాస్తవానికి hatered అనే ఆంగ్ల పదానికి తెలుగు అర్థం ‘ద్వేషం’. కానీ మంత్రి అజయ్ ఈ పదాన్ని విడదీసి hate red గా అభివర్ణించడం గమనార్హం. మంత్రి అజయ్ ను టార్గెట్ గా చేసుకుని ఖమ్మంలో సీపీఎం పార్టీ నాయకులు గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కొందరు సీపీఎం నాయకులపై ఒకటీ, అరా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీపీఎం వ్యవహార తీరును మంత్రి hate red అంటూ వెటకరించారా? అనే సంశయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా మంత్రి అజయ్ కుమార్ వాట్సాప్ పోస్టు ప్రస్తుతం భిన్నాభిప్రాయాలకు తావు కల్పిస్తూ రాజకీయ చర్చకు దారి తీసిందనేది నిర్వివాదం.