విజయశాంతి అడుగులు నిజంగానే బీజేపీవైపు పడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి ఆమె రాంరాం చెప్పనున్నారా? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి బుజ్జగించినా ఫలితం లేనట్లేనా? విజయశాంతి ఫేస్ బుక్ ఖాతాను నిశితంగా పరిశీలిస్తే ఇవే సందేహాలు కలగకమానవు. తెలంగాణా ప్రభుత్వంపై, అధికార పార్టీపై విజయశాంతి ఇటీవలి కాలంలో ఫేస్ బుక్ పేజీలో పలు విమర్శలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగానూ రూలింగ్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె వివిధ పోస్టులు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే విజయశాంతి బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇదే దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. విజయశాంతి ప్రజాదరణ గల నాయకురాలని, తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. తెలంగాణ పల్లెల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని, కానీ, తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని సంజయ్ వ్యాఖ్యానించారు. విజయశాంతి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బండి సంజయ్ ప్రశంసలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
దీంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ విజయశాంతితో బుధవారం భేటీ అయ్యారు. తాను స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి ఠాగూర్ వద్ద ప్రస్తావించారని వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని విజయశాంతి ఫిర్యాదు చేశారనేది ఆయా వార్తల సారాంశం. మరోవైపు విజయశాంతి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ, పార్టీలో క్రియాశీలకంగా లేరు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ఠాగూర్ పలుసార్లు రాష్ట్రానికి వచ్చినా ఆయనను కలిసిన దాఖలాలు లేవు. దుబ్బాక ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఈ పరిణామాల్లోనే విజయశాంతిని బుజ్జగించేందుకు ఠాగూర్ ఆమె ఇంటికి వెళ్లారు. పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది.
అయినప్పటికీ విజయశాంతి ఆలోచనలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో వివిధ అంశాలపై ఫేస్ బుక్ పేజీలో చేస్తున్న పోస్టుల్లో తన పేరు పక్కన ‘చైర్ పర్సన్, తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ’ అంటూ పార్టీలో తన హోదాను రాసుకున్నారు. ఆ తర్వాత ‘కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా’ వరకు మాత్రమే పరిమితం చేశారు. కానీ తాజాగా సుమారు 11 గంటల క్రితం పెట్టిన పోస్టులో ‘విజయశాంతి’ అని మాత్రమే రాసుకోవడం గమనార్హం. తెలంగాణాలో మిస్సింగ్ కేసుల అంశంపై పెట్టిన పోస్టులో తన పేరు పక్కన కాంగ్రెస్ పార్టీ పేరుగాని, పార్టీలో తనకు గల హోదానుగాని విజయశాంతి ఉటంకించలేదు. కానీ ఫేస్ బుక్ కవర్ ఫొటోలో మాత్రం ‘హస్తం గుర్తుకే మన ఓటు’ నినాదం మాత్రం అలాగే ఉండడం విశేషం. ఇక తెలంగాణాలో మిస్సింగ్ కేసుల గురించి విజయశాంతి తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టును యథాతథంగా దిగువన చదివేయండి.
తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 30 నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం సుమారు 200 మంది కనిపించకుండా పోయినట్లు పోలీస్ శాఖ అధికారిక వెబ్ సైటు వెల్లడించిందని మీడియా తెలిపింది. అయితే, ఒకే రోజున ఏకంగా 65 మంది వరకూ మిస్ అయినట్టు రికార్డవడం మరీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ సమాజంలో కలవరానికి దారి తీయకముందే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. ఈ మిస్సింగ్ కేసుల్లో కొద్ది శాతం వ్యక్తిగత, కుటుంబ సంబంధ కారణాలను కలిగి ఉండవచ్చు కానీ…. అత్యధిక కేసుల్లో నేరపూరిత కోణాలను కొట్టిపడేయలేం. గతంలో ఎందరో అభాగ్యులు ఇలాగే కనిపించకుండా పోయి సీరియల్ క్రైమ్స్ చేసే నేరగాళ్ళు, కామాంధుల బారిన పడిన ఘటనలు చూశాం. మాటలతో వివరించలేని రీతిలో పసి మొగ్గల్ని, బాలికల్ని, మహిళల్ని హింసించి బలి తీసుకున్న వ్యధలెన్నో మనం విన్నాం. మిస్సింగులతో ముడిపడిన నేరాలు తర్వాత ఎప్పుడో బయటకొస్తున్నాయి. దారుణమైన అకృత్యాలు జరిగేదాకా నిర్లక్ష్య ధోరణితో ఉండి… నెత్తిమీదకు వచ్చినప్పుడు ఏదో ఒక ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి తెచ్చుకోవడం ఈ సర్కారు విధానంగా మారింది. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఈ మిస్సింగ్ కేసులను సీరియస్గా తీసుకుని, కేసు నమోదైన వెంటనే పోలీస్ శాఖ స్పందించేలా ఒక వ్యవస్థను రూపొందించాలి. అలా చేస్తే… జరగబోయే ఘోరాల్ని అరికట్టి ఎందరో బాధితుల్ని కాపాడే అవకాశముంటుంది. పరిపాలన పరంగా టీఆరెస్ వైఫల్యాల ప్రభుత్వమే అయినా… ప్రజా క్షేమం దృష్ట్యా ఈ బాధ్యతలైనా సక్రమంగా నిర్వర్తించాలని తెలియజేస్తున్నాను.
విజయశాంతి