తుమ్మల నాగేశ్వరరావు…తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కరలేని రాజకీయ నేత. దశాబ్దాల రాజకీయ నేపథ్యం గల తుమ్మల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడమే కాదు ఆధిపత్యం కొనసాగించిన ఘటనలు అనేకం. ముఖ్యంగా తిరుగులేని రాజకీయ నేతగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను శాసించిన గత వైభవం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం 2014 ఎన్నికల్లో ఓటమిని చవి చూసినప్పటికీ, కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ సంపాదించిన రాజకీయ చాతుర్యం. అనంతరం ఎమ్మెల్సీగా, ఆ తర్వాత పాలేరు అసెంబ్లీ సగ్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడం చక చకా జరిగిపోయాయి. గత డిసెంబర్ లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులోనే అమాత్య హోదాలో అనూహ్యరీతిలో ఓటమిని చవి చూసిన మరో చేదు అనుభవం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో కేసీఆర్ తో గల సాన్నిహిత్యం వల్లే  ఆయన మంత్రివర్గంలో తుమ్మల కొలువు దీరినప్పటికీ,  గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తుమ్మలతోపాటు ఆయన అనుచరులూ జీర్ణించుకోలేకపోయారు. తుమ్మల ఓటమికి అంతర్గతంగా పాటుపడిన అనేక మంది సొంత పార్టీ నాయకులు మాత్రం లోలోన ఎంతో సంతోషించారన్నది వేరే విషయం. కొంత మంది అగ్రనాయకులు తుమ్మలను అత్యంత పకడ్బందీగా ఓడించారనే కథనాలు కూడా అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. అయితే…?

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా తుమ్మలతోపాటు ఆయన అనుచరులు పెద్దగా చడీ, చప్పుడు చేసిన దాఖలాలు లేదు. తనను ఓడించిన పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డిని కేసీఆర్ దరి చేర్చుకున్నా తుమ్మల శిబిరం కిమ్మనలేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, తుమ్మలకు కేసీఆర్ మరోసారి మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుచరగణం ప్రచారం చేసింది. రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గం మద్ధతు కోసం తమ నేతకు కేసీఆర్ మళ్లీ పెద్ద పీట వేయడం  ఖాయమని కూడా తుమ్మల అనుయాయులు భావించారు. కానీ గడచిన 10 నెలల కాలంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో వర్గపోరాటం చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరి మరోసారి పార్లమెంట్ సభ్యుడయ్యారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ తుమ్మలతో అంతర్గతంగా పొసగని పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి అయ్యారు. బహిరంగంగా అంగీకరించకపోయినా, తుమ్మల శిబిరానికి ఏమాత్రం రుచించని పరిణామాలు ఇవి. కాలం కలిసి రానప్పడు మిన్నకుండడమే మిన్న రీతిలో…గత ఎన్నికల్లో ఓటమి అనంతరం గండుగులపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో, లేదంటే అవసరాన్ని బట్టి రాష్ట్ర రాజధానిలో మకాం వేసిన తుమ్మల నాగేశ్వరరావు దాదాపు 10 నెలల తర్వాత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. తనను ఓడించిన పాలేరు నియోజకవర్గంలోనేగాక తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సత్తుపల్లి సగ్మెంట్లోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తుమ్మల పర్యటన సాగుతుందని కూడా ఆయన వర్గీయులు చెబుతున్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటించిన సందర్భంగా ‘జై తుమ్మల…జై జై తుమ్మల’ అంటూ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున నినదించారు. కొన్ని మండలాల్లో తుమ్మలపై పూలవర్షం కురిపించారు. తన వైఖరికి విరుద్ధంగా తుమ్మల తన పర్యటనలో నాయకులతో, కార్యకర్తలతో ప్రవర్తిండం విశేషం. తనను కలవడానికి వచ్చినవారితో ఆయన సంభాషిస్తున్న తీరు, అక్కున చేర్చుకుని కుశల ప్రశ్నలు సంధిస్తున్న పద్ధతుల తీరుపై పార్టీ వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం స్తబ్దుగానే ఉన్న తుమ్మల, ఆయన శిబిరంలోని అనుచరగణం ఒక్కసారిగా యాక్టివ్ కావడంతో సహజంగానే ఆయనంటే పొసగని నేతల్లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. తుమ్మల తాజా అడుగులకు అర్థం, పరమార్థం ఏమిటో బోధపడక ఆయన వ్యతిరేక వర్గీయులు తలలు నిమురుకుంటున్నారు. వచ్చే మార్చిలో తుమ్మల రాజ్యసభ సభ్యుడు అవుతారా? లేక మరేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే ప్రశ్నలకు ఆయన అనుచరుల నుంచి కూడా స్పష్టమైనా సమాధానం లేదు. తుమ్మల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలోనే ఆయన వియ్యంకుడు, బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు కూడా ఇదే జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం యాదృచ్చికం కావచ్చు.  గత ఎన్నికల్లో తుమ్మల ఓటమికి అలుపెరుగని పోరాటం చేసిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులే తాజాగా ‘తుమ్మల జై’ అంటూ ఆయన పర్యటనలో నినదించడం కొసమెరుపు.

Comments are closed.

Exit mobile version