తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారో తెలుసా? తమ నేతలను బీజేపీ కొనుగోలు చేస్తోందని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. బీజేపీ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ కొనుగోళ్లకు తెర తీశారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ నేత భూపేంద్ర యాదవ్ వేరే పార్టీ నాయకులను కొనుగోలు చేయడానికే తెలంగాణాకు వచ్చారా? అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆవేదనలో, ఆందోళనలో పొలిటికల్ రీజన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. రాజకీయాలన్నాక ఎత్తులు, పైఎత్తులు ఉంటాయి. దాన్నే ‘రాజకీయమ్’ అంటారు. పొలిటికల్ ఎన్కౌంటర్ లో ముందు ‘ట్రిగ్గర్’ నొక్కినవాడిదే అప్పర్ హ్యాండ్ అవుతుందనే విషయం మిలటరీలో పనిచేసిన ఉత్తమ్ కు తెలియని విషయమేమీ కాకపోవచ్చు.
కానీ, తెలంగాణాలో ఓ పాపులర్ సామెత ఉంది. ‘మన బంగారం మంచిదైతే స్వర్ణకారున్ని నిందించి ప్రయోజనం లేదు’ అనేది ఆయా నానుడి. దీని భావం తెలుసుగా…? కల్తీ బంగారం స్వర్ణకారుడికి ఇచ్చి, నగ స్వచ్ఛంగా లేదని నగ తయారు చేసిన వ్యక్తిని నిందించడం అన్నమాట. ఇక అసలు విషయంలోకి వెడితే… కాంగ్రెస్ నేతలను బీజేపీ కొనుగోళ్లు చేస్తున్నదనేది ‘ఉత్తమ్’వారి ఆరోపణ-కమ్-ఆందోళన-కమ్-ఆవేదన కావచ్చు. సరిగ్గా రెండేళ్ల క్రితం నాటి పొలిటికల్ సీన్ ఒకటి ఇప్పుడు తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది మినహా ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు చరిత్రాత్మకం. అధికార పార్టీ నేతలను ఆందోళనకు గురిచేసిన తీర్పు అది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒకే ఒక స్థానంలో మాత్రమే అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగతా తొమ్మిది స్థానాల్లో ఏడింట కాంగ్రెస్ నాయకులనే ప్రజలు ఎన్నుకున్నారు. వైరా నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందిన రాములు నాయక్ మినహా, పాలేరు, మధిర, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లందు స్థానాల్లో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులకే ప్రజలు పట్టం గట్టారు రాములు నాయక్ కూడా కాంగ్రెస్ నాయకుడే. రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
కానీ ఏం జరిగింది? ఓట్లు వేసిన ప్రజల చేతిపై సిరా మరక ఆరకముందే మధిర, భద్రాచలం, మధిర స్థానాల్లో గెల్చిన నాయకులు మినహా మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువాను కప్పుకుని, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు జైకొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాకలు తీరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా గెలిచిందే తడవుగా అధికార పార్టీలో చేరారు. ఇప్పుడీ పాత సంగతులను నెమరువేయడం దేనికంటే… తమ నాయకులను బీజేపీ కొంటున్నదని కదా… ఉత్తమ్ సారు బాధపడుతున్నది? బీజేపీ కాంగ్రెస్ నేతలను కొంటున్నదా? లేదా? అనే ప్రశ్నను కాసేపు పక్కనపెడితే, కాంగ్రెస్ నేతలు అమ్ముడు పోవడానికి సిద్ధపడుతున్నారా? అనేదే అసలు సందేహం. అంగట్లో సరుకుగా మారిన నాయకులు పార్టీలో ఉన్నంతకాలం కొనుగోళ్లు జరిపేవారు ఉంటారనేది కాదనలేని రాజకీయ సత్యం. ఈ సింపుల్ లాజిక్ ను ఉత్తమ్ సారు మరిచిపోయారు కాబోలు… అనేది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం.
అయినా జీహెచ్ఎంసీ ఎన్నికల సంగ్రామంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రచారం ఊపందుకున్న పరిణామాల్లో ఉత్తమ్ సారు మాట్లాడాల్సింది కాంగ్రెస్ నేతలు కొందరు అంగట్లో సరుకుగా మారారనే విషయం గురించి కాకపోవచ్చు. దుబ్బాక ఎన్నికల్లోనూ బీజేపీనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు రాజకీయ యుద్దం చేసినట్లు కనిపించింది. ఫలితం తెలిసిందే కదా? అందుకే కాంగ్రెస్ పోరాడాల్సింది బహుషా బీజేపీ నాయకులపై కాదేమో! కాంగ్రెస్ నేతల వ్యవహార తీరు అంశంలో ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం మరొకటీ ఉంది. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల్లో ఓట్లు వేస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? గెలిచాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, ఈమాత్రం దానికి కాంగ్రెస్ కు ఓటు వేయడం కన్నా, బీజేపీకి వేయడమే శ్రేయస్కరమని ఓటర్లు భావిస్తున్నారనేది ఈ ప్రచారపు సారాంశం. అందువల్లే దుబ్బాకలో కాంగ్రెస్ కు గట్టిదెబ్బ పడిందనే వాదనలూ ఉన్నాయి. ఉత్తమ్ సారూ…! విషయం మీకు అర్థమవుతున్నట్లే కదా!?