మధ్యప్రదేశ్ తరహా తాజా రాజకీయ పరిణామాలు తెలంగాణాలోనూ చోటు చేసుకునే అవకాశం ఉందా? జ్యోతిరాదిత్య సింథియా తరహాలో పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరే ముఖ్య నేతలు టీఆర్ఎస్ లో కూడా ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ ముందు ఇటువంటి ‘పొలిటికల్ డాన్స్’ చేసే సత్తా తెలంగాణాలోని అధికార పార్టీ నేతల్లో ఎవరికైనా ఉందా? అందుకు తగిన రాజకీయ వాతావరణం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? అదే జరిగితే కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల ధాటిని బీజేపి తట్టుకుంటుందా? పార్లమెంట్ ఎన్నికల్లో మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అంశంలో ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ దేనికంటే…?

ఇదిగో బీజేపీకి చెందిన ఇద్దరు తెలంగాణా ఎంపీలు చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యపై ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రచురించిన ఈ ‘ఫిల్లర్’ వార్తను ఓసారి జాగ్రత్తగా చదవండి. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్ ఏమంటున్నారంటే… ‘కమల్ నాథ్ కన్నా కేసీఆర్ పెద్దోడేం కాదు’ అని. నిన్న విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడి ఘటనను బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించిన సందర్భంగా చేసిన వ్యాఖ్య ఇది. విద్యార్థులపై క్రూరంగా దాడి చేసిన గంగిరెడ్డి తదితర పోలీసు అధికారుల పేర్లు నమోదు చేసుకున్నామని, వారు జాగ్రత్తగా వ్యవహరించాలని పరోక్షంగా పోలీసు అధికారులను హెచ్చరించిన తరహాలో ఆయా నేతల వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాదు ‘కమల్ నాథ్ కన్నా కేసీఆర్ పెద్దోడేం కాదు’ అని బీజేపీ ఎంపీలు సంజయ్, అర్వింద్ లు చేసినట్లు పేర్కొన్న ఏక వాక్యపు వ్యాఖ్య తెలంగాణాలో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తో కేసీఆర్ ను పోలుస్తూ బీజేపీ ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్య వెనుక అసలు మర్మమేమిటనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉద్భవిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పేరును ప్రస్తావిస్తూ కేసీఆర్ అంతకన్నా పేద్దోడేం కాదని వ్యాఖ్యనించడం వెనుక బీజేపీ రాజకీయంగా తెలంగాణాలోనూ అంతర్గతంగా ఏవేని పావులు కదుపుతోందా? అనే సంశయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారంలో గల బీజేపీ మధ్యప్రదేశ్ తరహా రాజకీయం నెరపే అవకాశాలపైనా పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణా రాజకీయాల్లో బీజేపీకి అనుకూలించే సారూప్య రాజకీయ వాతావరణం కూడా లేదంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు ఎంపీల వ్యాఖ్యలోని నర్మగర్భ అర్ధపు మర్మమేమిటన్నదే చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ తరహా రాజకీయానికి బీజేపీ తెలంగాణాలోనూ తెర లేపితే అందుకు సహకరించే ‘తెలంగాణా జ్యోతిరాదిత్య సింథియా’ ఎవరన్నదే అసలు ప్రశ్న.

Comments are closed.

Exit mobile version