మావోయిస్టు నక్సల్స్ కట్టడి చర్యల్లో తెలంగాణా పోలీసులు అనుసరిస్తున్న వైఖరి సత్ఫలితాలు ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ దళ నేతలనే టార్గెట్ గా ఎంచుకున్నట్లు గోచరిస్తోంది. ముఖ్యంగా పొరుగున గల ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులను అనుకుని ఉన్న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పోలీసుల గాలింపు ఆపరేషన్లకు మావోయిస్టు పార్టీకి చెందిన దళ కమాండర్ స్థాయి నేతలు వరుసగా చిక్కుతుండం గమనార్హం. తెలంగాణాలో మళ్లీ మావోయిస్టు నక్సల్స్ కార్యకలాపాలు, కదలికలు పెరిగాయని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పోలీస్ శాఖ బాస్ నాలుగు రోజులపాటు ఆసిఫాబాద్ జిల్లాలో మకాం వేసి నక్సల్స్ కట్టడిలో అధికారులకు, సిబ్బందికి దిశా, నిర్దేశం చేశారు.
ఈ నేపథ్యంలోనే వారం రోజుల వ్యవధిలో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్ సంఘటనల్లో ఇద్దరు దళ కమాండర్ స్థాయి మావోయిస్టు నేతలు మరణించడం గమనార్హం. ఈనెల 3వ తేదీన గుండాల మండలం దుబ్బగూడెం, దేవలగూడెం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో శంకర్ అనే నక్సల్ మృతి చెందగా, అతను మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ గన్ మెన్ గా తేలింది. అయితే అతను దళ కమాండర్ గా పార్టీ ఆ తర్వాత ప్రకటించడం గమనార్హం. శంకర్ అనారోగ్యంతో చికిత్స కోసం వెళ్లగా పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు.
శంకర్ ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈనెల 6వ తేదీన ఆరు జిల్లాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. బంద్ రోజునే చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపాన పగిడివాగు కల్వర్టుకు చేరువలో మందుపాతర పేల్చడం ద్వారా మావోయిస్టులు కలకలం సృష్టించారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే 7వ తేదీన అదే మండలంలోని పూసుగుప్ప అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిద్దరినీ శ్రీను, ఐతులుగా పోలీసులు ప్రకటించారు.
ఈ ఎన్కౌంటర్ ఘటనపైనా మావోయిస్టు పార్టీ తెలంగాణా అధికార ప్రతినిధి జగన్ స్పందిస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీను తమ పార్టీలో పదేళ్లుగా పనిచేస్తున్నాడని, ప్రస్తుతం అతను దళ కమాండర్ గా పేర్కొన్నారు. ఓ సరుకుల వ్యాపారిని ఇన్ఫార్మర్ గా మార్చుకున్న పోలీసులు శ్రీను, ఐతులను పట్టుకుని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని జగన్ ఆరోపించారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా గుండాల మండలం దుబ్బగూడెం వద్ద, కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా పూసుగుప్ప అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు.
ఈ రెండు ఘటనల అంశంలో పోలీసుల, మావోయిస్టుల పరస్పర భిన్న కథనాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఇద్దరు దళ కమాండర్లను ఎన్కౌంటర్లలో భద్రాద్రి జిల్లా పోలీసులు మట్టుబెట్టడం గమనార్హం. వారం వ్యవధిలోనే ఇద్దరు దళ నేతల ఎన్కౌంటర్ ద్వారా ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై భద్రాద్రి పోలీసులు పైచేయి సాధించినట్లుగానే నిఘా వర్గాలు భావిస్తున్నాయి.