తెలంగాణాలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పొరుగున గల ఛత్తీస్ గఢ్ లో నిర్బంధం తీవ్రతరమైన నేపథ్యంలో తిరిగి తెలంగాణాలో వేళ్లూనుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.
అనధికారిక సమాచారం ప్రకారం.. ఎన్కౌంటర్ మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిషోర్ (22), కామేష్ (23) అనే పేర్లు గల నక్సల్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ఏడుగురిలో ఇద్దరు ఏరియా కార్యదర్శులు, మరో ఇద్దరు కమాండర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రు అలియాస్ పాపన్న ఇల్లెందు – నర్సంపేట ఏరియా కార్యదర్శిగా చెబుతున్నారు. మిగతా నలుగురు సభ్యులుగానే వార్తల్లో నానుతున్నప్పటికీ, ఇందులో ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు కూడా ఏటూరునాగారం – మహదేవపూర్ ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా కరుణాకర్ అనే నక్సల్ మహదేవపూర్ దళ కమాండర్ గా, జమున మరో ప్రాంత దళ కమాండర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెల్పాక ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు ఏరియా కార్యదర్శులు, మరో ఇద్దరు దళ కమాండర్లు ఉండగా, మిగతా ముగ్గురు సాధారణ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ ఏడుగురిని ‘మిక్సింగ్’ దళంగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే..?
సాధారణంగా మావోయిస్టు పార్టీ ప్రస్తుత సంస్థాగత నిర్మాణం ప్రకారం ఓ ఏరియా కమిటీ కార్యదర్శి పరిధిలో కనీసం మూడు దళాలు ఉంటాయని విప్లవ కార్యకలాపాల పరిశీకులు చెబుతున్నారు. ఏరియా కమిటీ పరిధిలో పనిచేసే దళాలకు కమాండర్లు ఉంటారు. వీటినే దళాలుగా వ్యవహరిస్తారు. ఒక్కో దళంలో కమాండర్ సహా ఏడుగురు నక్సలైట్లు ఉంటారు.
ఈ పరిస్థితుల్లో చెల్పాక ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారిలో ఇద్దరు ఏరియా కార్యదర్శులు, మరో ఇద్దరు దళ కమాండర్లు ఉన్నారు. మిగతా ముగ్గురు సాధారణ సభ్యులు. అంటే కనీసం ఆరు నుంచి తొమ్మిది దళాలకు చెందినట్లుగా భావిస్తున్న ఈ ఏడుగురు ఒకేచోట ఎందుకు ‘మిక్సింగ్’ దళంగా ఏర్పడ్డారనేది ఇప్పటికిప్పుడు జవాబు లేని ప్రశ్న.
ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవలే పంచాయతీ కార్యదర్శి సహా ఇద్దరిని నక్సలైట్లు ఇటీవల నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు ఏరియా కార్యదర్శులు, మరో ఇద్దరు దళ కమాండర్లు, ముగ్గురు సభ్యులు కలిసి ఏదేని భారీ ఘటనకు పాల్పడేందుకు ‘మిక్స్’ అయ్యారా? అనే సందేహంపై ప్రభుత్వ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చెల్పాక ఎన్కౌంటర్ ఉదంతం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. మొత్తంగా పరిశీలించినపుడు ఈ ఎన్కౌంటర్ రెండు ఏరియా కమిటీల్లోని దళాలకు నాయకత్వ నష్టంగా పేర్కొనవచ్చు.