నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను. అర్వింద్ ధర్మపురి అను నేను, బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డునుగాని, పసుపుకి, ఎర్రజొన్నకు మద్ధతు ధరనుగాని తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు/ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గత మార్చి 20వ తేదీన ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంతకం చేసి మరీ రాసిచ్చిన బాండ్ కాగితంలోని పూర్తి పాఠమిది.
ఇప్పుడు ఆ బాండ్ కాగితమే బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను రైతుల ఆందోళన రూపంలో కార్చిచ్చులా చుట్టుముడుతోంది. పసుపు బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా? అంటూ వందలాది మంది రైతులు రోడ్డెక్కారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలకు దిగి, ఆందోళన చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనేగాక జగిత్యాల జిల్లాలోనూ పసుపు రైతుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఇంతకీ అర్వింద్ ఎందుకలా రాసిచ్చాడని మళ్లీ మళ్లీ సందేహిస్తూ ప్రశ్నలు వేయకండి.
ఓసారి కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెడదాం. నిజామాబాద్ ఎంపీ అనగానే దాదాపు ఎనిమిది నెలల క్రితం వరకు కూడా టక్కున గుర్తుకు వచ్చే పేరు కల్వకుంట్ల కవిత. తెలంగాణా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవితను గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి బాట పట్టించిన బీజేపీ అభ్యర్థి అర్వింద్ విజయం అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం. ‘సారు-కారు-పదహారు’ నినాదంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ సార్ తోపాటు టీఆర్ఎస్ నేతలు గట్టి నినాదం అందుకున్న సంగతి తెలిసిందే కదా! కానీ పదహారు సంఖ్య నినాదాన్ని ఏడు అంకెకు కుదించి, కేవలం తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ప్రజలు గులాబీ పార్టీని పరిమితం చేశారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు, మధ్యలో నిజామాబాద్, కరీంనగర్ సహా నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడగా, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. బీజేపీ గెల్చుకున్న నాలుగు ఎంపీ స్థానాల్లో నిజామాబాద్ సీటు కూడా ఉంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించిన ధర్మపురి అర్వింద్ కు తాజాగా ఓ బాండ్ కాగితం కష్టం వచ్చి పడింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేకుంటే బాండ్ కాగితం మాట ప్రకారం రాజీనామా చేయాలని పసుపు రైతులు ఉద్యమబాట పట్టారు. నిన్న బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం సోమవారంనాటికి నిజామాబాద్ కు, ఆ పక్కనే గల జగిత్యాల జిల్లాకు కూడా పాకడం గమనార్హం.
అయితే పసుపు రైతుల ఆందోళన పర్వంలో ఇక్కడే అనేక సందేహాలు తలెత్తుతున్నాయంటున్నారు కొందరు రాజకీయ పరిశీలకులు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు గురించి బాండ్ కాగితం ద్వారా మాట ఇచ్చి పత్తా లేకుండాపోయారని, రైతులను మోసం చేశారని పలువురు రైతులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పనిలో పనిగా అప్పుడు ఈ బాండ్ కాగితం రాసివ్వడంలో కీలక పాత్ర పోషించినట్లు కొందరు రైతు సంఘం నాయకులను కూడా ఉటంకిస్తూ వారి తీరుపై మండిపడుతున్నారు. కానీ, ఇదే దశలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతుల కోసం చేయాల్సిందంతా చేస్తున్నారని కూడా కొందరు రైతులు ఈ ఆందోళనా పర్వంలో పొగడ్తల వర్షం కురిపిస్తుండడమే సందేహాలకు కారణం. కాళేశ్వరం నీళ్లు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో భరోసా కల్పించడమేగాక, 24 గంటలపాటు కరెంట్ కూడా కేసీఆర్ సరఫరా చేస్తున్నారని తెగ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన కొందరు రైతులు చేస్తున్న ఈ ప్రసంగాలను అక్షరం కూడా వదలకుండా సాక్షాత్తూ కేసీఆర్ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణా’ పత్రిక తన వార్తా కథనంలో నివేదించడం గమనార్హం. అయితే తనకు పసుపు బోర్డు గురించి అంతగా తెల్వదని, కవితను ఓడగొట్టడమే లక్ష్యంగా ఎన్నికల్లో పని చేశానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఈ పత్రిక తన వార్తా కథనంలో ఉటంకించింది.
‘రాజకీయ నేతలు నోటి మాటగా హామీలు ఇవ్వాలే తప్ప ‘నోట్’ మాటలు ఇస్తే…? ఇదిగో ఇటువంటి ఇబ్బందులు తప్పవు’ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దళితున్ని తెలంగాణాకు తొలి సీఎం చేస్తానని, తాను చెప్పానంటే తల నరుక్కుంటానుగాని, ఆ మాట తప్పనని కేసీఆర్ వాగ్దానం చేశారే తప్ప, ఏనాడైనా బాండ్ కాగితం రాసిచ్చారా? ఇటువంటి అనేక అంశాలపై వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఏ ఒక్క హామీకైనా అర్వింద్ తరహాలో బాండ్ పేపర్ పై రాసి సంతకం చేశారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందరో రాజకీయ నాయకుల్లాగా మాటలు మాత్రమే చెప్పకుండా, బాండ్ పేపర్ రాసిచ్చి అర్వింద్ అనవసరంగా ఇరుక్కుపోయారనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పసుపు రైతుల ఉద్యమం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందా? అని మాత్రం సందేహించకండి. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి ఆందోళనల మంటలు మండుతున్న నేపథ్యంలోనే ఇందూరులో పసుపు రైతుల ఆందోళనలు కొనసాగుతుండడం బహుషా యాధృచ్చికమే కావచ్చు.