తెలంగాణా రాజకీయాల్లో బీజేపీ ప్రాచుర్యాన్ని నిలువరిస్తూ తాజాగా తెరపైకి వచ్చిన అంశం కాబోయే సీఎం కేటీఆర్. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగనుందనే వార్తలు కొత్తేమీ కాదు. తాజాగా జరుగుతున్న ప్రచారం అంతకన్నా కాదు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంగా సాగుతున్న ప్రచారమే. కొన్నాళ్లపాటు ఈ అంశంపై అందరూ స్తబ్ధుగానే ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీకి వెళ్లి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షా తదితరులను కలిసి వచ్చిన దృశ్యాల అనంతర పరిణామాల్లో కేటీఆర్ కు పట్టాభిషేకం అంశం మరోసారి రాష్ట్రమంతా మార్మోగుతోంది. మెయిన స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాతోపాటు ఇంకా రకరకాల మీడియా భిన్న కోణాల్లో వార్తా కథనాలను తమ పాఠకులకు, వీక్షకులకు వడ్డిస్తున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చిన్నా, పెద్దా పార్టీ నేతలందరూ ఇప్పుడు కేటీఆర్ పేరును పలవరిస్తున్నారు. తప్పేమీ లేదు. ఏ పార్టీలోనైనా కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ పార్టీ నేతల్లో, కేడర్ లో ఈ మాత్రం సంతోషం సహజమే. విపక్ష పార్టీ నేతల వాదన ప్రకారం సీఎం మార్పు అనేది అధికార పార్టీ అంతర్గత అంశమే కావచ్చు. కానీ అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు ఈ విషయంలో మరీ అడ్వాన్స్ అయ్యారనేది కాదనలేదని వాస్తవం. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఏకంగా కేటీఆర్ కు ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ పద్మారావు కాబోయే ముఖ్యమంత్రిగా కీర్తిస్తూ, అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్పినపుడు సభా వేదికపైనే గల కేటీఆర్ పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. ఇదే సమయంలో తన పట్టాభిషేకంపై ఎమ్మెల్యేలెవరూ ప్రకటనలు ఇవ్వొద్దని కేటీఆర్ ఫోన్ల ద్వారా ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తనతో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం చెప్పించలేదని, తన సొంత అభిప్రాయం మాత్రమేనని పద్మారావు తాజాగా, ప్రత్యేకంగా చెబుతున్నారు. త్వరలోనే సిరిసిల్లకు సీఎం జిల్లాగా గుర్తింపు రాబోతోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా కీర్తిస్తున్నారు..
ఇంతకీ కేటీఆర్ కు పట్టాభిషేకంపై బీజేపీ బండి సంజయ్ తాజాగా ఏమంటున్నారు? కేసీఆర్ ను మాత్రమే సీఎంగా గుర్తించి ప్రజలు రెండోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని, ఈ పదవి నుంచి కేసీఆర్ తప్పుకుని కేటీఆర్ కు సీఎం చేయాలని తలస్తే మళ్లీ ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కేటీఆర్ ను సీఎంగా చేస్తే అధికార పార్టీలో ఆటంబాంబు కాదని, ఏకంగా అణుబాంబు పేలుతుందని అంటున్నారు. సరే, సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగమే కావచ్చు.
కానీ, ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ చేసినట్లు పేర్కొంటున్న ఓ వ్యాఖ్య కేటీఆర్ పట్టాభిషేకం వస్తున్న వార్తలపై అసలు విషయాన్ని చెప్పకనే చెబుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా నాయకులతో సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి వెలువడిన ఓ వ్యాఖ్య కేటీఆర్ పట్టాభిషేకానికి ముడిపడి ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ సమీక్షలో పాల్గొన్న ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులతో కేసీఆర్ చేసిన ఆ ముఖ్య వ్యాఖ్య ఏమిటో తెలుసా? సమీక్ష ముగిసిన అనంతరం ‘మళ్లీ జూన్ లో కలుద్దాం’ అని కేసీఆర్ అన్నారట. వచ్చే జూన్ కల్లా ఈ ప్రాజెక్టు నుంచి నీరు అందించాల్సిందేనని సీఎం ఆదేశించినట్లు కూడా తాజా సమీక్షలోని ముఖ్యాంశం. అంటే… విషయం బోధపడినట్లే కదా? వచ్చే జూన్ వరకు కేసీఆర్ సీఎంగా ఉంటారనేది పార్టీ నేతల సరికొత్త భాష్యం. సీఎం హోదాలోనే కదా కేసీఆర్ మళ్లీ కలిసేది అని కూడా వారు అంటున్నారు. దీంతో బహుషా కేటీఆర్ కు సీఎంగా ఇప్పట్లో పట్టాభిషేకం జరగకపోవచ్చనేది సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి సమీక్షలో పాల్గొన్న నాయకుల్లో కొందరు అంచనా. కేటీఆర్ కు అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా తాజాగా మరో విషయం చెబుతున్నారు యాదాద్రి పనులు పూర్తయి, అది ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కేటీఆర్ సీఎం అయ్యే అవకాశాలుంటాయని చెబుతున్నారు.
‘జూన్ లో కలుద్దాం’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాట, తాజాగా పద్మారావు చెబుతున్న యాదాద్రి పనుల పూర్తికి డెడ్ లైన్ జూన్ గా భావించాల్సిందేనా? అంటే వచ్చే జూన్ వరకు కేటీఆర్ పట్టాభిషేకం జరగనట్లేనా? ఇవీ పార్టీ నేతల్లో నెలకొన్న తాజా సందేహాలు.