అదృష్టమంటే తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోని ఓటర్లదే మరి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు చేయని ప్రయత్నాలంటూ ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. ఈమేరకు రకరకాల ప్యాకేజీలను ఇప్పటికే అమలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. వారం క్రితం ముగిసిన సంక్రాంతి పర్వదినం సందర్భంగా పండుగ ‘కర్సు‘ తీరేలా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ప్యాకేజీలు రూపొందించారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ చికెన్, మటన్, పిండివంటలకు నూనె సరఫరా చేసినట్లు వార్తా కథనాల సారాంశం. పురుషులకైతే మందు, మహిళకైతే కూల్ డ్రింక్స్ కూడా సప్లయి చేశారు. ఇంట్లోని ఓట్ల సంఖ్యను బట్టి సంక్రాంతి పండుగ ప్యాకేజీలు అందించారు. ఇక యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టీలోనైతే ఓటు ధర రూ. 30 వేలు పలికినట్లు మంగళవారం రాత్రి నాటి వార్తల సారాంశం. ఇవన్నీ పాచి వార్తలు. ఇదిగో ఇదీ కొత్త వార్త.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల పండుగలో మందూ, విందూ, చికెనూ, మటనూ ప్రలోభాల ఎర కామన్. పోలింగ్ కు ముందురోజు రాత్రి వరకు ఓటుకు నోటు పంచుతారు సరే.. ఇంకా స్పెషల్ ఏమీ లేదా? అని వార్డుల వారీగా ఓటర్లను ప్రభావితం చేసే ఛోటా లీడర్లు అభ్యర్థులను ప్రశ్నిస్తే? ప్రశ్నించారు కూడా. అందుకే మున్సిపాల్టీల్లో వార్డు కౌన్సిలర్లుగా, కార్పొరేషన్లలో డివిజన్ల కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అనేక మంది ‘మేడారం జాతర’ ప్యాకేజీలను రూపొందించారట. తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న తొమ్మిది కార్పొరేషన్లలో, 120 మున్సిపాల్టీల్లోని 90 శాతానికి పైగా వార్డుల్లో ఇదే ప్యాకేజీల ఒప్పంద పరిస్థితిగా తెలుస్తోంది.
ఓటర్లను ప్రభావితం చేసే ఛోటా, మోటా లీడర్లకు వార్డు లేదా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులు అనేక మంది జాతర ప్యాకేజీకి అంగీకరించినట్లు సమాచారం. దీని ప్రకారం ఒక్కో బ్యాచ్ కు 25-30 మంది చొప్పున విభజించి ప్యాకేజీలను అమలు చేయబోతున్నారు. తమ గెలుపునకు పాటు పడిన బ్యాచ్ లకు మేడారం వెళ్లేందుకు వాహన సదుపాయం కల్పిస్తారు. ఇంటి ముందు వాహనంలో ఎక్కించుకుని, మేడారం తీసుకువెళ్లి, మళ్లీ ఇంటి ముందు దింపే బాధ్యతను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు భుజాన వేసుకున్నారు. జాతరలో టెంటు, యాటపోతు (మేక/గొర్రె), సౌండ్ సిస్టమ్, మందు, విందు ఏర్పాట్లకయ్యే ఖర్చు యావత్తూ అభ్యర్థే భరించాలి. రెండు రోజుల ప్రయాణం సహా ఖర్చు మొత్తం భరించాల్సిందే.
మేడారం వెళ్లి వచ్చాక ఇంటివద్ద దింపే ముందు మరో మందు బాటిల్ ‘గిఫ్ట్’ రూపంలో ఇవ్వాలి. ప్రతి వార్డు లేదా డివిజన్లో రెండు, నుంచి మూడు బ్యాచ్ లకు ఈ ప్యాకేజీలకు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఫలితంగా ప్రతి అభ్యర్థికి రూ. 2.50 నుంచి రూ. 3.00 లక్షల వరకు ఖర్చు అదనంగా వస్తోందట. అయితే ఎన్నికలకు ముందు ఖర్చులకు మేడారం జాతర ప్యాకేజీ అదనం కావడమే ఇక్కడ అసలు విశేషం. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న అనేక మున్సిపాలిటీల్లో ఎక్కడ విన్నా మేడారం ‘జాతర ప్యాకేజీ’ల విశేషాలే. నయా పైసా ఖర్చు లేకుండా మేడారం జాతరకు వెళ్లి రావడం మున్సిపల్ ఎన్నికల పుణ్యమేనని ఛోటా, మోటా లీడర్లు తెగ ఆనందపడుతున్నారట. పోలింగ్ ముగియగానే రెండు రోజుల ప్యాకేజీ అమలు చేయాలనేది ఒప్పందమట. మున్సిపల్ ఎన్నికల డబుల్ ధమాకాలో ఇదో భాగమట. ఇక రేపటి నుంచి మేడారం బాటలో జాతరే జాతరట.