తెలంగాణా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పట్టాభిషేకానికి అంతా రెడీ అవుతున్నట్లేనా? ఇందుకు సంబంధించిన ఇండికేషన్స్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం వెలువడినట్లేనా? ‘కారు గుర్తుకే మన ఓటు’ అంటూ టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనల తీరు ఇదే సంశయాన్ని కలిగిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే ఈ తరహా పొలిటికల్ అడ్వర్టయిజ్మెంట్లు విడుదల కావడం తొలిసారిగా ఆ పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఈ తరహా ప్రకటనలు జారీ కావడం మొదటిసారిగానే ఆ వర్గాలు ఉటంకిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో మాత్రమే విడుదల చేసిన ప్రచారపు ప్రకటనలు ఆంధ్రజ్యోతి మినహా దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లోనేగాక, కొన్ని చిన్న పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. ‘ఉమ్మడి జిల్లా’ పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జారీ చేసిన ఈ ఎన్నికల ప్రకటనలను జిల్లాల వారీగా విడిగా చూస్తే ఆయా జిల్లాల పార్టీ నాయకత్వాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. కానీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే జిల్లాల పేర్లు మార్చి ఒకే డిజైన్ తో విడుదల చేసినట్లు స్పష్టంగా కనిపించడం గమనార్హం.
ఈ ప్రకటనలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు మాత్రమే ఉండడం తప్పు పట్టే అంశం కాకపోవచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో, మున్సిపల్ మంత్రిగా కేసీఆర్ పక్కనే కేటీఆర్ ఫొటో ప్రచురించడాన్ని ఎవరూ అక్షేపించకపోవచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన తర్వాత నిర్వహించిన పార్టీ సమావేశంలో కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నవ్వుతూనే హెచ్చరిక చేయడం తెలిసిందే. ‘ఒక్కచోట ఓడినా పదవులు ఊడుతాయ్, చివరికి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోవచ్చు’ అని కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మంగళ, బుధవారాల్లో జారీ చేసిన ప్రకటనల్లో కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు మాత్రమే ఉండడాన్ని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలు జిల్లాల వారీగా జారీ చేసినప్పటికీ, జిల్లా నాయకత్వానికిగాని, మంత్రులకుగాని ఈ ప్రకటనల్లో కనీస చోటు కల్పించకపోవడాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను, కనీసం మంత్రుల ఫొటోలకు కూడా ఈ ప్రకటనల్లో కాస్త చిన్నగానైనా చోటు కల్పించాల్సిందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేసీఆర్ తర్వాత స్థానపు నేత కేటీఆర్ మాత్రమేనని పార్టీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల ప్రకనల డిజైన్ ద్వారా తన కేడర్ కు చెప్పకనే చెప్పినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహుషా మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ పట్టాభిషేకానికి ఈ తరహా పరిణామం సూచికగా కూడా భావించ వచ్చంటున్నారు. విశేషమేంటంటే ‘ఉమ్మడి జిల్లా’ పేరుతో జారీ చేసిన ప్రకటనలు ఎటువంటి మున్సిపల్ ఎన్నికల ఊసే లేని ములుగు వంటి జిల్లాల్లో కూడా ప్రచురితం కావడం.