గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో ఏడు రౌండ్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏడు రౌండ్ల ఫలితాల అనంతరం కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆధిక్యతను కొనసాగించారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజయం సాధించేందుకు ఈ ఆధిక్యత పల్లాకు ఉపకరించలేదు. దీంతో అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు అధికారయంత్రంగం సంసిద్ధమైంది. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఫలితాల సరళిని బట్టి ts29 ముందే చెప్పిన సంగతి తెలిసిందే.
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పల్లాకు మొత్తం 1,10,840 ఓట్లు లభించగా, తీన్మార్ మల్లన్నకు 83,290, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ కు 70,072, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 39,107, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 27,588 ఓట్ల చొప్పున లభించాయి. మొత్తం చెల్లిన ఓట్లు 3,66,333 కాగా, 21,636 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. దీంతో గెలుపునకు అవసరమయ్యే 50% + 1 ఓట్లు ప్రామాణికంగా రెండో ప్రాధాన్యతలో మరో 72,328 ఓట్లు లభిస్తే ఆధిక్యంలో గల పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించినట్లే.
మిగతా అభ్యర్థులకు లభించిన ఓట్లకు కూడా ఇదే ఫార్ములా ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్లు లభిస్తే తప్ప ఫలితం తారుమారయ్యే అవకాశం లేదు. అయితే ఇంత భారీ సంఖ్యలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ లభించకుంటే మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఆధిక్యంలో గల పల్లా రాజేశ్వర్ రెడ్డిని విజేతగా ప్రకటించే అవకాశాలే ఉన్నాయని, మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు అనంతరం కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి తన ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై ఆమె 6,555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.