జూదం…ఈ పేరు చెబితేనే తెలంగాణా ప్రభుత్వం భగ్గుమంటోంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్రంలోని పేకాట క్లబ్బులన్నీ దాదాపుగా మూతపడ్డాయి. తెలంగాణాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోని పేకాట క్లబ్బుల్లో సాగుతున్న జూదంపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ సైతం ఉక్కు పాదం మోపింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జూదం అనే మాట వింటేనే ప్రభుత్వాలు కన్నెర్రజేస్తున్న పరిస్థితి.
సరే.. జూదంలో రకరకాలు ఉంటాయనుకోండి.. కాసినో వంటి పెద్దోళ్ల గ్యాంబ్లింగ్ గురించి కాదుగాని, పేకాటలో రమ్మీ, మూడు ముక్కలు, అందర్- బాహర్ తదితర గేమ్ లకు సంబంధించి రకరకాల భాష్యాలున్నాయి. పోలీసులు ఎక్కడ పేకాటరాయుళ్లను పట్టుకున్నా ‘రమ్మీ’ ఆడుతున్నట్లు కేసు నమోదు చేయరన్నది అందరికీ తెలిసిందే. మూడు ముక్కల జూదంగానే కేసులు నమోదు చేస్తుంటారు. స్కిల్డ్ గేమ్ గా భావించే రమ్మీ చట్టబద్ధమని కూడా అనేక సందర్భాల్లో పోలీసులే నిర్వచిస్తుంటారు.
కానీ పేకాట క్లబ్బులపై, స్థావరాలపై జరిగే దాడుల్లో ఎక్కడైనా సరే రమ్మీ ఆడుతున్న దాఖలాలు ఉన్నట్లు ఏ కేసుల్లోనూ కనిపించవన్నది వేరే విషయం. ఉదాహరణకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలోని పుష్పాంజలి రిసార్ట్స్ కేసు గురించి తెలిసిందే కదా? ఈ విషయంలో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించడం, పోలీసుల దాడులు, కోర్టు ధిక్కరణ కింద కరీంనగర్ పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులకు ఆర్నెళ్ల జైలు శిక్ష వంటి పూర్వాపరాలను కాసేపు పక్కన పెడదాం.
కాసేపు కోడి పందేల గురించి మాట్లాడుకుందాం. ఈ విషయంలో తెలంగాణా పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఏమంటున్నారో తెలుసా? కోడి పందాలు సంప్రదాయ క్రీడల్లో భాగమని ఆయన నిర్వచించారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి వేడుకలకు పెట్టింది పేరుగా కూడా అభవర్ణిస్తూ కొనియాడారు. కోడి పందాలు ఆనవాయితీగా వస్తున్నాయని, వీటిని జూదంగా చూడవద్దని మంత్రి కోరారు. కోడి పందేల గురించి తలసాని శ్రీనివాస యాదవ్ ఆయా వ్యాఖ్యలు చేసింది ఎక్కడో కాదు. ఏటా సంక్రాంతి సందర్భంగా కోడిపందేలకు, కోట్ల రూపాయలు చేతులు మారడానికి వేదికలుగా భావించే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఓ ప్రాంతంలోనే కావడం విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సీసలలో ఏర్పాటు చేసిన కోడి పందేలను వీక్షించిన సందర్భంగా శ్రీనివాసయాదవ్ ఆయా వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏటా శ్రీనివాసయాదవ్ సంక్రాంతి సంబరాలకు ఏపీకి వస్తుంటారు లెండి. అందులో భాగంగానే తాజాగా సంక్రాంతి వేడుకల కోసం ఆయన పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి కోడి పందాలను తిలకించినట్లు వార్తల సారాంంశం.
అయితే ఏంటీ అంటారా? ఏమీ లేదు. కోడి పందేలపై దేశంలోని అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్డు ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చింది. కోడి పందేల నిర్వహణ చట్ట వ్యతిరేకమని, ఇటువంటి జూద క్రీడను నిషేధిస్తున్నట్లు కూడా ఇప్పటికే కోర్టు తీర్పులున్నాయి. జూదం కిందకు వచ్చే క్రీడలపై ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా సీరియస్ గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాత్రం దీన్ని సంప్రదాయ క్రీడల్లో భాగమని వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడి పందేలపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఏమిటి? మంత్రి తలసాని వ్యాఖ్యల భాష్యం ఏమిటి? అని న్యాయవాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అదీ అసలు సంగతి.