మంత్రి కేబుల్ లో 10 టీవీ ప్రసారాల సిగ్నల్ కట్!
కొన్ని ఘటనలు జరగబోయే పరిణామాలకు సంకేతంగా నిలుస్తాయని అంటుంటారు. రాసలీలల వివాదంలో చిక్కుకున్న తెలంగాణా మంత్రి విషయంలో ఇదే సందేహం కలుగుతోంది. తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలు కలిగిస్తున్న ఓ మంత్రి రాసలీలల వివాదంపై 7.00 గంటల న్యూస్ బులెటిన్ లో అధికార పార్టీ వర్గీయులకు చెందిన 10 టీవీ తనదైన శైలిలో నిప్పులు చెరిగింది. ఆ ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ స్వప్న ఛానల్ తెరపైకి వచ్చి వివాదంలో చిక్కుకున్న మంత్రిని తూర్పారబట్టారు.
‘ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన గౌరవనీయ మంత్రిగారే గౌరవం తప్పి, నీచమైన కామాంధుడిగా మారిన వైనమిది. పాలకుడే ఓ స్త్రీని అడ్డుపెట్టుకుని, మరొక స్త్రీని వేధించే దిగజారుడు చర్యకు పాల్పడ్డారంటే ఇక సభ్య సమాజం ఏం చేయాలి? ఆయనకు పట్టం కట్టిన ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి? ఒక ప్రజాప్రతినిధి ఇంత లేకిగా ప్రవర్తించడం వెనుక విలువలపైన, జవాబుదారీతనంపైన, సమాజంపైన ఆయనకు ఎంత చులకనభావం ఉందో అర్థమవుతోంది. సిగ్గు, సిగ్గు మంత్రిగారూ.., ఇలా ప్రవర్తించడం మీ అధికార మదమా? లేక అమ్మాయిలంటే మీకింత చులకనా? 10 టీవీ ఈ మంత్రిగారి చర్యలను ఖండిస్తోంది. 10 టీవీ ఇటువంటి వారిని ఈడ్చి ప్రశ్నిస్తుంది. నీలదీస్తుంది.’’ అని కన్సల్టింగ్ ఎడిటర్ స్వప్న 10 టీవీ స్క్రీన్ పై నిప్పులు చెరిగారు.
సాధారణంగానైతే ఇంకేదైనా న్యూస్ ఛానల్ ఈ తరహా వ్యాఖ్యలతో వార్తా కథనం ప్రసారం చేస్తే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అధికార పార్టీకి చెందిన నాయకులకు చెందిన 10 టీవీలోనే ఈ కథనం ప్రముఖంగా ప్రసారం కావడం, 7.00 గంటల బులెటిన్ లో యాంకర్ గా వ్యవహరించిన స్వప్ప ఆయా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి రాసలీలల వివాదంలో చిక్కుకున్న మంత్రి వ్యవహారాన్ని అధికార పార్టీ మీడియా వ్యవస్థలోని 10 టీవీ మాత్రమే భుజాన వేసుకుని ప్రముఖంగా ప్రసారం చేస్తుండడం విశేషం. ఈ అంశంపై 10 టీవీ కథనం ప్రసారమవుతున్న తీరు అధికార పార్టీ ఆలోచనా తీరును ప్రతిబింబిస్తుందనే వాదన ఈ సందర్భంగా వినిపిస్తోంది.
వాస్తవానికి వివాదలో చిక్కుకున్న మంత్రికి సంబంధించిన వార్తా కథనపు అంశం సీఎం కేసీఆర్ కు కూడా కొద్ది గంటల ముందు వరకు కూడా తెలియదనే కథనం కూడా ప్రచారంలో ఉంది. కథనాన్ని టీవీలో ప్రసారం చేసిన తర్వాతే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారని అంటున్నారు. ఈ వివాదంలో మంత్రి వ్యవహార తీరు తప్పా? ఒప్పా? అనే తర్కాన్ని వదిలేస్తే, అధికార పార్టీకి చెందిన ఓ వర్గపు నేతలే విషయాన్ని రచ్చ చేశారనే ప్రచారం కూడా ఉంది. అయితే రాజకీయంగా మరో ముఖ్యనేత అండదండలు ఈ మంత్రికి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రి విషయంలో సీఎం కేసీఆర్ ఏ చర్య తీసుకుంటారనే ఉత్కంఠ కూడా పార్టీ వర్గాల్లో నెలకొంది.
తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు కలిగిస్తున్న మంత్రి రాసలీలల వివాదం అధికార పార్టీ చీఫ్ కేసీఆర్ కు సైతం సవాల్ గా పరిణమించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించడం, పోలింగ్ కు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో మంత్రిపై చర్య తీసుకునే అవకాశముందా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వాట్సప్ చాటింగ్ ఆధారంగా మంత్రిపై చర్య తీసుకుంటే ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెడతాయి? మంత్రి సామాజికవర్గం స్పందన, మనోభావాల పరిస్థితి ఏమిటి? చర్య తీసుకోకుంటే పార్టీకి జరిగే నష్టం ఏమిటి? వంటి సంశయాలపై అధికార పార్టీలో తర్జన భర్జన సాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా వివాదంలో చిక్కుకున్న మంత్రి సామాజికవర్గపు ముఖ్య నేతలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సమావేశమయ్యారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది. తమ వర్గానికి చెందిన మంత్రిపై చర్య తీసుకుంటే అనుసరించే విధానంపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తనపై వార్తా కథనం ప్రసారం చేసిన 10 టీవీ ప్రసారాలను వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రి తన నియోజవర్గంలో ‘కట్’ చేయించినట్లు సమాచారం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలో మంత్రికి చెందిన కేబుల్ వ్యవస్థ ద్వారా 10 టీవీ ప్రసారాలను నిలిపివేయడం కూడా సంచలనం కలిగిస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకుల న్యూస్ ఛానల్ అయినప్పటికీ, దాని ప్రసారాలను వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రి కట్ చేయించడం కూడా సాహస చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.