రాసలీలల వివాదంలో చిక్కుకున్న తెలంగాణా మంత్రి ‘కత’ అడ్డం తిరిగినట్లేనా? అసలు ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్లాలో తెలియక ప్రభుత్వ పెద్దలు సైతం తర్జన భర్జన పడుతున్నారా? వివాదాన్ని ప్రముఖంగా ప్రసారం చేసిన అధికార పార్టీ అనుకూల పెద్దలకు చెందిన 10 టీవీ ఛానల్ కూడా ఈ అంశంలో ఇక ముందుకు వెళ్లలేకపోతున్నదా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ఔననే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇందుకు అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయనేది వారి వాదన.
ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి ద్వారా సినిమా రంగానికి చెందిన మరో యువతికి వల వేసేందుకు ఈ మంత్రి ప్రయత్నించాడనేది రాసలీలల వివాదంలో ప్రధాన ఆరోపణ. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దసరా పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఓ ‘షో’ కార్యక్రమానికి సినిమా రంగానికి చెందిన యువతి వ్యాఖ్యాతగా హాజరైందని, ఈ సందర్భంగా యువతిని నగ్నచిత్రాలు తీసేందుకు మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ప్రయత్నించిందనేది వివాదపు సారాంశం. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలితో మంత్రికి ఉన్నట్లు పేర్కొంటున్న సన్నిహిత సంబంధాలు, చాటింగ్ స్క్రీన్ షాట్ల లీక్ పరిణామాలు ఆయన పదవికే ఎసరు తెచ్చేవిధంగా పరిణమించాయనే వార్తలు వస్తున్నాయి.
కానీ విషయాన్ని లోతుగా పరిశీలించినపుడు బాధితురాలిగా పేర్కొంటున్న సినీరంగపు యువతి ఘటనపై ఇప్పటికీ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ‘షో’ ముగిశాక వెళ్లిపోయిన యువతి ఎప్పటిలాగే తన సినీ కెరీర్ కార్యకలాపాల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తనకు జరిగిన చేదు అనుభవపు ఉదంతాన్ని బాధిత యువతి ప్రభుత్వ పెద్దలకే నేరుగా చెప్పుకుందని, చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్లను వారికి పంపించిందని అంటున్నారు. ఇక్కడ కూడా ఆమె లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నట్లు లేదు. ఈ నేపథ్యంలోనే మంత్రి రాసలీలల వివాదం తెరపైకి వచ్చింది.
అయితే బాధితురాలిగా పేర్కొంటున్న యువతి ఎక్కడా లిఖితపూర్వక ఫిర్యాదు చేయని నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు మంత్రిపై ఏ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి అంశాల్లో ఫిర్యాదు సంగతి ఎలా ఉన్నప్పటికీ, నైతికత ప్రధానమంటున్నారు. విషయం వివాదాస్పదమై రచ్చరచ్చగా మారిన పరిణామాల్లో చర్యలు తప్పకుండా ఉంటాయని అధికార పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన పరిస్థితుల్లో మంత్రి రాసలీలల వివాదం వెలుగులోకి రావడంపైనా ప్రభుత్వ పెద్దలు ఒకింత అసహనంతో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదిలా ఉండగా బాధితురాలిగా భావిస్తున్న యువతిని తమదైన శైలిలో ప్రశ్నించడానికి ఓ న్యూస్ ఛానల్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. తాను ఎటువంటి ‘బైట్’ ఇవ్వనని ఆ యువతి ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిణామాల్లో మంత్రిపై తీసుకునే చర్యలపై సహజంగానే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి రాసలీలల చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను పరిశీలించాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయా స్క్రీన్ షాట్లు మార్ఫింగ్ చేశారా? లేక ఒరిజినల్? అనే విషయాన్ని సాంకేతికంగా తేల్చే బాధ్యతను సైబర్ క్రైం పోలీసులు అప్పగించారంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రాసలీలల వివాదంలో ఇరుక్కున్న మంత్రి పదవిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారమూ జరుగుతోంది. అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఇచ్చి సీఎం కేసీఆర్ సామాజికంగా బ్యాలెన్స్ చేస్తారని, వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారనేది ఆయా ప్రచారపు సారాంశం. ఇందుకు త్వరలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రామాణికంగా ఆయా ప్రచారం సాగుతుండడం విశేషం. ఇదే సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే సరికొత్త వాదన కూడా వినిపిస్తుండడం కొసమెరుపు.