రాసలీలల వివాదాన్ని ఎదుర్కుంటున్న తెలంగాణా మంత్రి ఒకరు తన పదవికి రాజీనామా చేశారా? ప్రభుత్వ పెద్దలు ఆయా మంత్రి చేత పదవికి రాజీనామా చేసినట్లు లేఖ రాయించి తీసుకున్నారా? మంత్రివర్గ విస్తరణకు ముందు వివాదాస్పద మంత్రి రాజీనామా అంశం వెల్లడవుతుందా? ఇవే సందేహాలపై తెలంగాణాలో రాజకీయంగా సరికొత్త ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రి రాసలీలల వివాదాంశంపై భిన్న కథనాలు ప్రచారమవుతున్న తరుణంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారనే ధృవపడని సమాచారం సంచలనం కలిగిస్తోంది.
మసాజ్ సెంటర్ నిర్వహించే ఓ మహిళ ద్వారా సినీరంగానికి చెందిన ఓ యువతిపై కన్నేశారని, ఆమెను కాంక్షించారనే అభియోగాలను మంత్రి ఒకరు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన ‘చాటింగ్’ వ్యవహారం వెలుగులోకి వచ్చి రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. అధికార పార్టీకి అనుకూల పెద్దలకు చెందిన 10 టీవీ న్యూస్ ఛానల్ ఈ వివాదాన్ని ప్రముఖంగా ప్రసారం చేయడం సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మంత్రి రాసలీలల చాటింగ్ బాగోతం తెలంగాణా రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమైంది.
గత నెల 30వ తేదీన ఈ విషయం వెలుగులోకి రాగా, అప్పటి నుంచి నిన్నటి వరకు, దాదాపు వారం రోజులపాటు వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రి హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు కూడా ఆయా మంత్రికి ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల స్పందన లభించలేదనే వార్తలు వచ్చాయి. సీఎం కేసీఆర్ సైతం మంత్రి రాసలీలల వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతేగాక మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రెండు అంబులెన్సులను విరాళంగా ఇచ్చిన ఈ మంత్రి వాటి ప్రారంభోత్సవం రోజున కనిపించకపోవడం కూడా చర్చకు దారి తీసింది. మంత్రి కేటీఆర్ అంబులెన్సులను ప్రారంభించిన కార్యక్రమానికి వివాదాస్పద మంత్రికి ఆహ్వానం కూడా అందలేదని ప్రచారం జరిగింది.
ఆయా వివాదం, దానిపై భిన్న కథనాల నేపథ్యంలో ఎట్టకేలకు వారం తర్వాత సదరు మంత్రి హైదరాబాద్ వీడి తన నియోజకవర్గంలో అడుగిడారు. ఈ సందర్భంగా స్థానికంగా కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే రాసలీలల వివాదాన్ని ఎదుర్కుంటున్న ఆయా మంత్రి ముఖంలో మునుపటి జోష్ కనిపించలేదని స్థానిక మీడియా మిత్రులు చెబుతున్నారు. బాడీ లాంగ్వేజ్ లోనూ గణనీయమైన మార్పు వచ్చిందంటున్నారు. ఇదే దశలో మంత్రి తన నియోజకవర్గానికి బయలుదేరే ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారని, అందుకు సంబంధించిన లేఖను పార్టీ పెద్దలకు ఇచ్చారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. పార్టీ అధినేత ఆదేశం మేరకే ఆయన రాజీనామా లేఖ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. అంతేగాక పిలిచినప్పుడు రావాలని పార్టీ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రి తన సన్నిహితులవద్ద ప్రస్తావించినట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది.
త్వరలో మంత్రి వర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వార్తలు వస్తున్న పరిణామాల్లో రాసలీలల వివాదాస్పద మంత్రి తన పదవికి రాజీనామా చేశారని, లేఖ కూడా ఇచ్చారని జరుగుతున్న ప్రచారం తెలంగాణా రాజకీయాల్లో సరికొత్త చర్చకు తావు కల్పించింది.