* సొంత పార్టీ నేతలే మంత్రిని ‘ఫిక్స్’ చేశారా?
* ఇంతకీ ‘చాటింగ్’ లీక్ చేసిందెవరు?
* మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పట్టని ఘటన
* అపాయింట్మెంట్ కు ప్రభుత్వ పెద్దల ‘నో’ !
* మంత్రి రాసలీలల వివాదంలో తర్వాత ఏంటి ?
మంత్రి రాసలీలల వివాదపు వ్యవహారంలో కథనపు శీర్షిక సర్టిఫికెట్ కాదు. ఓ సంఘటన వెలుగులోకి వచ్చినపుడు దాని పూర్వాపరాలపై భిన్నకోణాల్లో చర్చ జరుగుతుంటుంది. ఇది కూడా అటువంటి కథనమే. మసాస్ సెంటర్ నిర్వాహకురాలితో మరో మహిళకు వల వేశారనే అభియోగాలకు సంబంధించి తెలంగాణాలోని ఓ మంత్రిపై తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసందే. ప్రస్తుతం ఈ వివాదం అధికార పార్టీ రాజకీయాల్లో పెను దుమారానికి కారణమైంది. అధికార పార్టీకి నాయకులకు చెందిన న్యూస్ ఛానల్ లోనే మంత్రి రాసలీలల వ్యవహారం ప్రముఖంగా వెలుగులోకి రావడమే భిన్నకోణాల్లో చర్చకు ఆస్కారం కలిగించింది.
రాసలీలల బాగోతపు వివాదాన్ని ఎదుర్కుంటున్న మంత్రికి, అధికార పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులకు మధ్య సఖ్యత లేకపోవడం, అధిపత్య పోరు కూడా విషయం రచ్చ కావడానికి ఓ కారణంగా ప్రచారం జరుగుతోంది. అంతేగాక కొందరు స్థానిక నేతలతోనూ మంత్రికి ఏమాత్రం సత్సంబంధాలు లేవంటున్నారు. మంత్రి వ్యక్తిగత బలహీనతలపై కన్నేసిన సొంత పార్టీ నాయకులే మంత్రిని రాజకీయంగా సమాధి చేసేందుకు పథకరచన చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో మంత్రి స్వయంకృతాపరాధం కూడా ఉందంటున్నారు.
మసాజ్ సెంటర్ కేంద్రంగానే మంత్రి బలహీనతలపై సొంత పార్టీ నాయకులే కొందరు ‘స్కెచ్’వేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘చాటింగ్’ స్క్రీన్ షాట్లను ఎవరు లీక్ చేశారనే అంశంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తనను కాకుండా మరో మహిళ కోసం మంత్రి అర్రులు చాస్తున్నాడనే ఆక్రోశంతోనే మంత్రితో సన్నిహిత సంబంధాలున్నట్లు ప్రచారంలో గల మసాజ్ సెంటర్ నిర్వాహకురాలే ‘చాటింగ్’ స్క్రీన్ షాన్లను లీక్ చేసిందనేది ఓ వాదన. మద్యం సేవించిన మైకంలో మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి భర్త వీటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారనేది మరో ప్రచారం. మంత్రి నియోజకవర్గంలో నిర్వహించిన ఓ ‘షో’కు వ్యాఖ్యాతగా హాజరైన సినీ తార నేరుగా వీటిని ప్రభుత్వ పెద్దలకే ‘ట్వీట్టర్’ ఖాతా ద్వారా పంపించారనేది ఇంకో కథనం.
విషయాన్ని ఎవరు లీక్ చేశారనే వాదన సంగతి ఎలా ఉన్నప్పటికీ, మహిళల విషయంలో మంత్రి వ్యక్తిగత బలహీనతలపై ఎన్నాళ్లుగానో ప్రచారం ఉందని స్థానిక నేతలు వాదిస్తున్నారు. మొత్తంగా విషయం తొలుత ఓ చిన్న పత్రిక ఈ పేపర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంత్రి రాసలీలలు రచ్చరచ్చగా మారాయి. అధికార పార్టీ నాయకులకు చెందిన 10 టీవీ ఛానల్ వరుస కథనాలతో నిన్నంతా హడావిడి చేసింది. ఈరోజు దాని గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు.
మంత్రి రాసలీలల వివాదాన్ని ప్రధాన పత్రికలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం కూడా చర్చకు దారి తీసింది. ఏదేని చిన్న వివాదం చిక్కితేనే మెయిన్ ఎడిషన్ లో, జిల్లా అనుబంధాల్లో చాంతాడులా వార్తా కథనాలు వండి, వార్చే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓ క్యాబినెట్ మంత్రి రాసలీలల బాగోతం విషయంలో ఏమీ తెలియనట్లు వ్యవహరించడం కూడా చర్చకు దారి తీసింది. ఎక్కడా సింగిల్ కాలమ్ వార్తను కూడా ప్రధాన పత్రికలు ప్రచురించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆయా పత్రికలకు ఆదాయపరంగా మంత్రి ‘బంగారు బాతు’గా ఉన్నారని, ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికి ఆయనే కేంద్ర బిందువనే ప్రచారమూ ఉంది. ఈ విషయంలో కొందరు స్థానిక జర్నలిస్టులకు, మంత్రికి మధ్య గల సత్సంబంధాలపైనా భిన్న కథనాలు ఉన్నాయి. విషయం ఏదైనప్పటికీ మంత్రి రాసలీలల వివాదానికి సంబంధించి అక్షరం ముక్క కూడా రాయకుండా ప్రధాన పత్రికలు మిన్నకున్నాయనేది కాదనలేని వాస్తవం.
మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోనంత మాత్రాన విషయం మాత్రం దాగలేదు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక బాజాప్తా మంత్రి ఫొటో సహా వార్తా కథనం ప్రచురించడం సంచలన విశేషం.నిన్నంతా వరుస కథనాలు ప్రచురించిన 10 టీవీ కూడా మంత్రి పేరును బహిరంగ పర్చకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. సరే, విషయం బహిర్గతం కావడమే కాదు, వివాదం అధికార పార్టీకి సవాల్ గా మారిందని చెప్పక తప్పదు. వాట్ నెక్ట్స్? అనేది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. ఈ వివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇదీ అసలు ఉత్కంఠ.
రాసలీలల వివాదం బహిర్గతమై రచ్చగా మారిన పరిణామాల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ఇద్దరు ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినట్లు తాజా సమాచారం. అయితే అందుకు ఆయా పెద్దలు నిరాకరించారనేది జరుగుతున్న ప్రచారం. ‘విషయం పెద్ద సార్ పరిధిలో ఉంది’ అని వారు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఏదేని కీలక నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది అధికార పార్టీ నాయకులు ఎదుర్కుంటున్న తీవ్ర ఉత్కంఠ. మొత్తం చెప్పేదేమిటంటే… ఇక ‘కేసీఆర్ దయ… మంత్రి ప్రాప్తం…’ అనేది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.