ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై తాను మంగళవారం చేసిన వ్యాఖ్య‌ల‌కు కట్టుబడి ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి బుధ‌వారం పునరుద్ఘాటించారు. ఈ మేర‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఓ ప్రకటన విడుద‌ల చేశారు. తన ప్రకటనలో మంత్రి ఏమంటున్నారంటే….

‘‘నేను నిన్న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో చేసిన వ్యాఖ్య‌లు రాయ‌ల‌సీమ‌, ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించిన‌వి కావు. ఆది నుంచి అది టీఆర్ఎస్ విధానం కూడా కాదు.

అవి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం రైతుల పొట్ట‌గొట్టే అక్ర‌మ ప్రాజెక్టులు. క‌ట్టిన మ‌రియు క‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న ఆంధ్ర పాల‌కుల‌ను ఉద్దేశించి చేసిన‌వి మాత్ర‌మే అని ఏపీ ప్ర‌భుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు గుర్తించాలి.

గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా తెలంగాణ‌లో ఉంటున్న ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌తో తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రియు తెలంగాణ ప్ర‌భుత్వం సోద‌ర‌భావంతో మెలుగుతున్న విష‌యం వాస్త‌వం కాదా? ఇటు తెలంగాణ రైతులు అటు ఆంధ్ర రైతులు అంద‌రూ బాగుండాల‌నేది కేసీఆర్ విధానం. కృష్ణాపై ఏపీ ప్ర‌భుత్వం క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల వ‌ల్ల తెలంగాణ రైతులు న‌ష్ట‌పోతార‌నే మా బాధ‌.

నేను తెలంగాణ ఉద్య‌మంలో నుండి కేసీఆర్ నీడ‌లో ఎదిగిన రాజ‌కీయ నాయ‌కుడిని, ఆంధ్ర పాల‌కుల చేతిలో గోస ప‌డ్డ తెలంగాణ చ‌రిత్ర తెలిసిన ఉద్య‌మ‌కారుడిని. ఆ ఉద్య‌మం వ‌ల్లే, ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వ‌ల్లే నేను మంత్రిని అయిన కాబ‌ట్టే తెలంగాణ‌కు నొక్కు ప‌డితే స‌హించే ప్ర‌స‌క్తి లేదు.

మీరు ఎవ‌రి మీద ఉద్య‌మం చేస్తారు? అని ఆంధ్ర బీజేపీ అధ్య‌క్షులు సోము వీర్రాజు అంటున్నారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ నీటి వాటాను తేల్చ‌డానికి అనేక సంవ‌త్స‌రాలు తాత్సారం చేస్తున్న బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వంపై ఉద్య‌మం చేస్తాం. అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్న ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు చేప‌డుతాం.

నేను నిన్న చేసిన వ్యాఖ్య‌ల‌కు పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్నా. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బ‌ద్ద వ్య‌తిరేకి కాదా? సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాల‌ని ఉన్నా ఆయ‌నే అడ్డుప‌డి అనేక మంది తెలంగాణ బిడ్డ‌ల చావుకు కార‌ణం కాలేదా? తెలంగాణ ఉద్య‌మాన్ని అణ‌చ‌డానికి ఎన్నో అరాచ‌కాలు చేసిన వ్య‌క్తి కాదా? అందుకే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముమ్మాటికి తెలంగాణ పాలిట రాక్ష‌సుడే. తెలంగాణ నీళ్ల‌ను ఆంధ్ర‌కు త‌ర‌లించిన నీటి దొంగే. అంత‌కు రెట్టింపు నీటిని త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఏమ‌నాలి?

ఒక్క శ్రీశైలం నుండే పోతిరెడ్డిపాడు, ముచ్చుమ‌ర్రి లిఫ్ట్‌ల ద్వారా రోజుకు 9.12 టీఎంసీల నీటిని మ‌ళ్లించే అనుమ‌తులు లేని ప్రాజెక్టులు క‌డుతున్న‌ది ఏపీ ప్ర‌భుత్వ‌మే. మా పాల‌మూరు, డిండి ప్రాజెక్టులు ఉమ్మ‌డి రాష్ట్రంలోనే అనుమ‌తులు పొందిన పాత ప్రాజెక్టులు.

ఇప్ప‌టికైనా జాతీయ గ్రీన్ ట్రిబ్యున‌ల్ కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాల‌ను పాటించి అక్ర‌మ ప్రాజెక్టుల నిర్మాణం ప‌నులు ఆపాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.

కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌, ఆంధ్ర నీటి వాటాను త్వ‌ర‌గా తేల్చమ‌ని ఇద్ద‌రం క‌లిసి కృష్ణా ట్రిబ్యున‌ల్‌ను, కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుదాం. ఆంధ్ర‌, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు, బండి సంజ‌య్ లు ఈ బాధ్య‌త తీసుకోవాలి. అప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం క‌డుతున్న ఆర్డీఎస్ కుడి కాలువ ప‌నులు, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు ఆపివేయాలి’’ అని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌న ప్రకటనలో పేర్కొన్నారు

Comments are closed.

Exit mobile version