హైదరాబాద్ నగరంలోని ఓపెన్ నాలాల పైకప్పులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓపెన్ నాలాలపై క్యాపింగ్ (బాక్స్ డ్రైనేజీల) నిర్మాణానికి రూ. 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని నాలాల సమాచారం సేకరించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంతో పాటు మిగతా మున్సిపాలిటీల్లో కురుస్తున్న వర్షాలు, వరదలపై మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి పురపాలక, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ నిర్మాణం చేస్తామన్నారు. రెండు మీటర్ల కంటే వెడల్పు ఉన్న నాలాలపై గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. క్యాపింగ్ కుదరని నేపథ్యంలో వాటికి పకడ్బందీగా ఫెన్సింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల సమాచారం సేకరించామని తెలిపారు.
నగరం విస్తరించినందున ఆయా ప్రాంతాల్లో ఉన్న నాలాల సమాచారం సేకరించాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న లేదా బలహీనంగా ఉన్న భవనాలను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన భవనాలను వేగంగా కూల్చాలన్నారు. హైదరాబాద్ పరిధిలో 170 వర్షాకాల అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు తవ్విన గుంతలకు కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన నీటి నిల్వ ప్రదేశాల్లో ప్రత్యేక బృందాలతో చర్యలు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు.