మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నట్టేనా? పోలీస్ మాన్యువల్ ను ఆమె ధిక్కరించారా? సీఆర్ పీసీ నిబంధనలను సైతం ఉల్లంఘించారా? వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్ లో మంత్రి కొండా సురేఖ నిన్న సీఐ కుర్చీలో కూర్చుని వ్యవహరించిన ఘటనపై ఇవే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
కొండా సురేఖ ఆదివారం మరోసారి వార్తల్లోకి వచ్చారు. తన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారనే సమాచారంతో ఆమె నేరుగా గీసుగొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని మంత్రి సురేఖ భీష్మించారు. చివరికి సీపీ అంబర్ కిషోర్ ఝా మంత్రికి నచ్చజెప్పడంతో ఆమె శాంతించినట్లు వార్తలు వచ్చాయి.
ఇదే దశలో నిన్నటి మంత్రి వ్యవహారశైలిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ వివాదం అటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశరెడ్డి వర్గీయులకు, మంత్రి కొండా సురేఖ వర్గీయులకు సంబంధించింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటో లేదనే కారణంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఉదంతంలో తన అనుచరులకు ఏదేని అన్యాయం జరిగితే మంత్రి సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరమే లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఓ కేబినెట్ మంత్రి స్థాయి హోదాను ఆమె కలిగి ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సందర్భంగా నేరుగా సీఐ సీట్లో కూర్చునే అధికారం మాత్రం సురేఖకు లేదనేది పోలీసు వర్గాల వాదన. పోలీసు మాన్యువల్ కు, సీఆర్ పీసీ నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమంటున్నారు. కొండా సురేఖ ఓ వర్గం తరపున అక్కడికి వచ్చారని, ఇరు వర్గాలకు నచ్చజెప్పడానికి కాదంటున్నారు. ఈ పరిణామాల్లో ఆమె సీఐ కుర్చీలో కూర్చోవడం పోలీస్ నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందంటున్నారు.
కొందరు సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. ఓ ఎస్ఐ సీట్లో కూర్చునే అధికారం పొరుగు జిల్లా ఎస్పీకి కూడా లేదు. సంబంధిత స్టేషన్ పరిధి గల సీఐ, డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, ఐజీ, డీజీపీ, హోం మంత్రి మినహా మరెవరు కూడా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (SHO) సీట్లో కూర్చునే అధికారం లేదు. చివరికి పొరుగు రాష్ట్ర డీజీపీకి కూడా ఈ అధికారం లేదు.
ఏదేని కేసు తప్పుదోవ పడుతోందని ధ్రువీకరించుకుంటే సంబంధిత SHO నుంచి దర్యాప్తు బాధ్యతను తీసుకునే అధికారాన్ని మాత్రం SHO పైఅధికారులు కలిగి ఉంటారు. అంతే తప్ప SHO సీట్లో కూర్చునే అధికారం కేబినెట్ మంత్రికే కాదు మరే ప్రజాప్రతినిధికీ లేదని సీనియర్, రిటైర్డ్ పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ పరిధిలో లేని ఉన్నతాధికారులు ఏదేని అవసరం కోసం స్టేషన్ కు వస్తే ప్రొటోకాల్ ప్రకారం SHO లేచి సెల్యూట్ చేయడం తప్ప, తమ సీట్లో కూర్చోవాలని ఆఫర్ చేయరని వెల్లడిస్తున్నారు.
ఉదాహరణకు గతంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారి వద్దకు అప్పటి మంత్రి ఒకరు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ మాన్యువల్ కు ఎటువంటి విఘాతం కలగకుండా సీపీ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. తన సీటు సమీపంలోనే మరో రెండు కుర్చీలను ఏర్పాటు చేయించి ఇద్దరూ ఆ కుర్చీల్లో మాత్రమే కూర్చుని కాసేపు ముచ్చటించుకోవడం విశేషం.
అంతేకాదు సమీకృత కలెక్టరేట్ల సముదాయాలను ప్రారంభించిన సందర్భంగా సీఎం హోదాలో గల కేసీఆర్ కూడా కలెక్టర్ కుర్చీలో కూర్చోలేదని కొందరు అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అక్కడ విధుల్లో గల కలెక్టర్ హోదాలోని ఐఏఎస్ అధికారిని మాత్రమే కుర్చీలో సీఎం కేసీఆర్ కూర్చోబెట్టారని గుర్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ గీసుగొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవడం సరికొత్త వివాదంగానే పోలీసు వర్గాలు ఉటంకిస్తున్నాయి. మంత్రి హోదాలో ఏదేని గెస్టు హౌజ్ లో కూర్చుని సంబంధిత పోలీసు అధికారులను తన వద్దకే పిలిపించుకుని సమస్యను పరిష్కరించుకునే శక్తి ఉన్నప్పటికీ, కొండా సురేఖ నేరుగా స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చుని భీష్మించిన తీరు వివాదాస్పదంగానే చెబుతున్నారు.
అయితే మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశరెడ్డిల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓ టీవీ ఛానల్ కు చెప్పడం విశేషం. కొండా సురేఖ సీఐ సీట్లో కూర్చున్న విషయం తనకు తెలియదని పీసీసీ చీఫ్ చెప్పినట్లు కూడా ఆయా ఛానల్ నివేదించడం గమనార్హం.