బ్రిటన్ నుంచి తెలంగాణాకు వచ్చిన 184 మంది ప్రయాణీకుల ఆచూకీ కోసం వైద్య, ఆరోగ్యశాఖ వెతుకుతోంది. యూకే నుంచి తెలంగాణాకు వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు కారణం. మేడ్చల్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు కూడా తాజాగా కరోనా బాధితులుగా తేలడంతో యూకే నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పద్దెనిమిదికి చేరుకోవడం గమనార్హం. జిల్లాలవారీగా హైదరాబాద్ లో నలుగురు, మేడ్చల్ లో ఆరుగురు, జగిత్యాలలో ఇద్దరు, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల నుంచి ఒక్కొక్కొరు చొప్పున కరోనా పాజిటివ్ బాధితులున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.
మరోవైపు యూకే నుంచి తెలంగాణాకు వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాల వారున్నట్లు కూడా వైద్యారోగ్య శాఖ గుర్తించింది. ఆయా వ్యక్తులు యూకే నుంచి హైదరాబాద్ వచ్చి వారి స్వరాష్ట్రాలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరి గురించి ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు యూకే నుంచి తెలంగాణాకు వచ్చిన వారిలో మరో 184 మంది ప్రయాణికులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో నిన్నటివరకు 16 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తంగా బ్రిటన్ నుంచి వచ్చిన మిగతా 184 మందికోసం వైద్య, ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది.