మానుకోట శంకరన్న…అదేనండీ.. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ శుక్రవారం అగ్నిపునీతం కాబోతున్నారు. తన సచ్ఛీలతను చాటబోతున్నారు. తాను ఏ పాపమూ చేయలేదని మరోసారి నిరూపించుకోబోతున్నారు. తాను పాపమే చేస్తే అగ్ని తనను దహించేది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఓ రకంగా తనను వేలెత్తి చూపిన వారిని నిలదీస్తున్నారు. ‘రండి…నా పవిత్రతను కళ్లారా తిలకించండి’ అని ఆహ్వానిస్తున్నారు కూడా. ఈనెల 27న తాను అగ్నిగుండంలో నడవనున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా ఇలాగే నడుస్తున్నానని కూడా స్పష్టం చేస్తున్నారు.
ఇంతకీ మన శంకరన్న అగ్ని గుండంలో నడుస్తూ తన పునీతత్వాన్ని మరోసారి ఎందుకు నిరూపించుకుంటున్నారో తెలుసా? ఈ మధ్య కేసముద్రం మండల కేంద్రంలో జరిగిన క్రిస్టియన్ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ నాయక్ ఓవైపు రెడ్లను, మరోవైపు వెలమలను, ఇంకోవైపు డబ్బున్నవాళ్లను, చివరాఖరున చదువుకున్నవాళ్లను చెడా మడా తిట్టిన సంగతి తెలిసిందే కదా? వీళ్లందరికీ ‘బలుపు’ ఉంటుందని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టీవీల్లోనేగాక సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రసారమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో రెడ్లు రోడ్డెక్కారు. శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
మరికొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో మానుకోట ఎమ్మెల్యేపై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విధంగా రెడ్లు రోడ్లపైకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, వెలమలు మాత్రం కిమ్మనడం లేదు. సరే, ‘బలుపు’ తిట్లు తిన్నవారిలో ఎవరో ఒకరు ముందుకు రావలసిందే కదా? అభ్యంతరం చెప్పక తప్పదు కదా? రెడ్లే ముందు వరుసలో ఉండి ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా తన వ్యాఖ్యల ప్రభావపు సెగ తీవ్రత ఏమిటో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు తెలిసినట్లే కనిపిస్తోంది.
ఇదిగో ఈ నేపథ్యంలోనే శంకర్ నాయక్ ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై కొన్ని మీడియా సంస్థలకు వివరణ కూడా ఇచ్చారు. మోకాలికీ, బోడి గుండుకీ లంకె పెట్టిన చందంగా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కొందరు తనపై కుట్ర పన్నారని శంకర్ నాయక్ సెలవిస్తున్నారు. వివిధ న్యూస్ ఛానళ్లతో మాట్లాడుతూ మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏమన్నారంటే…
‘‘దేవున్ని నేను చూశాను. వీళ్లు చూశారా…మాట్లాడేవాళ్లు? ఏ కులాన్ని తిట్టలేదు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందే కుట్ర. ఎవరో తెలిసీ, తెలియక నా మీద బురద జల్లారు. దాని గురించి నేను ఏం మాట్లాడడం లేదు. వాళ్ల విజ్ఞతకే వదిలిపెడుతున్న. నేను అబ్రహిం లింకన్ గురించి మాట్లాడితే…ఇక్కడ ఏదో అనవసరంగా నా మీద చేస్తిరి. అది అవసరమా? వాట్సప్ లో, ఫేస్ బుక్కులో వచ్చేటియి నిజాలా? దేశం నాశనమై పోతుంది. అంత సృష్టిస్తున్నరు. ఇది అంత అవసరమా? ప్రతి సంవత్సరం…నేను పాపం జేసి ఉంటే మరి ఆ నిప్పుల్నే ఇదై పోవాలె గద? అవునా? కాదా? చూడండి..అగ్నిగుండం ఎట్ల ఉంటది. నేను ఎలా నడుస్తానో చూడండి. ఆర్ఈసీలో చదువుకున్న. ఇరవై ఏళ్లుగా మాల వేస్తున్న.’’ ఇదీ శంకర్ నాయక్ తాజా వాదన.
ఔను శంకరన్నా… మీరన్నట్లు ఈ రెడ్లకు కాస్త బలుపే ఉన్నట్టుంది. లేకపోతే ఏంది శంకరన్నా? దేవున్ని చూసి వచ్చిన మీపై ఇన్ని కుట్రలు చేస్తరా? అసలు మీ వ్యాఖ్యలు ఈ రెడ్లు, ఆ వెలమలు సరిగ్గా విన్నట్లు లేదు. విన్నా డిజిటల్ సౌండ్ లో వినిపించి ఉండకపోవచ్చు. సరిగ్గా వినిపించని వాళ్ల చెవులకు మీ వ్యాఖ్యలు మరింత రీ-సౌండ్ (ప్రతిధ్వని) తో వినేందుకు కాస్త చెవిటి మిషన్లను మీరే పంపిణీ చేస్తే సరి…సరి సరి.
ఔను శంకరన్నా…తమరు పూర్వకాలంలో ప్రభుత్వ ఇంజనీర్ గా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసులో కూడా మీరేమిటో నిరూపించుకున్నట్టున్నారు. రెండున్నరేళ్ల క్రితం అనుకుంటా…మానుకోట తొలి కలెక్టర్ ప్రీతి మీనా విషయంలో చెలరేగిన వివాదానికి క్షమాపణ కూడా చెప్పినట్లున్నారు కదూ!